Tuesday, May 14, 2013
మనం చాలామందితో కలుస్తూవుంటాం. తప్పకుండా కుశలప్రశ్నలు వస్తాయి. బావున్నారా.. ఉద్యోగం ఎలావుందీ.. కంఫర్టబుల్‌గావుందా అని. ఈసారి సమాధానాలు ఎలావున్నాయో గమనించండి. చాలామందికి ఎందుకో ఏవీ నచ్చవు. వెతికి వెతికి తీసుకొన్న అద్దె ఇల్లు నచ్చదు, కష్టపడి సంపాదించిన ఉద్యోగం నచ్చదు. జీవితం ఎప్పుడూ ఒక వెతుకులాటలాగే ఉంటుంది. ఎందుకిలా..? నేను ఇద్దరు అమ్మాయిలను కలుసుకొన్నాను. ఒకామె కాస్ట్ ఎక్కౌంటెంట్. వాళ్ళ భర్త చేస్తున్న ప్రాజెక్ట్‌లకు సహాయం చేస్తోంది. ఇంకొకామె కంపెనీ సెక్రటరీ.. చాలామంచి ఉద్యోగం.. కాస్ట్ ఎక్కౌంటెంట్‌గా పనిచేస్తున్న ఆమెకు వచ్చే జీతం చాలా తక్కువ. అదీ భర్త సొంత ఆఫీస్ కనుక బహుశ అసలేమీ ఉండకపోవచ్చు. కంపెనీ సెక్రటరీ అయితే ఏకంగా అప్పటికే మూడు ఉద్యోగాలు మారారు. కొన్నివేలరూపాయలు తేడా అంతే. అయితే స్థిమితంగా మాత్రంలేరు. తను ఇంకెంతో సంపాదించగలిగీ ఇలా ఉండిపోతున్నాననే దిగులుతో వున్నారు. కాస్ట్ ఎక్కౌంటెంట్‌కు .. తీరికలేదు. ఉద్యోగం, ఇల్లు ఇంతే. ఎంత డిప్రెషన్‌లో వున్నారంటే చదివిన చదువు వృధా. పైసా దొరకటంలేదు అన్నది ఈమె వాదన. వాళ్ళతో మట్లాడుతూవుండగానే ఇంకో అమ్మాయి వచ్చి చేరింది. పేరు వందన. చాలా ఇంటరెస్టింగ్ పర్సన్. ఈమె బాపట్ల వ్యవసాయవిశ్వవిద్యాలయం నుంచి పట్టా తీసుకొన్నారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో ఉంటున్నారు. కొన్ని కంపెనీలకోసం ప్రూట్‌ఫల్ఫ్ తయారుచేసి ఇస్తారట. కృష్ణాజిల్లాలోవిస్తారంగా పండే ఎన్నో పండ్లనుంచి గుజ్జు తయారుచేసి ప్రిజర్వ్ చేస్తారు. ఈమె వుండేది పల్లెటూరు. ఆమె చెప్పిన సమస్య ఏమిటో తెలుసా.. అస్తమానం కరంటు పోవటం గురించి. ఇదే సమస్య.
ఈమెకు ముందు నేనో మాట్లాడుతూవున్నవిధ్యాధికులు ఇద్దరూ ఎన్నో అసౌకర్యాల గురించి చెప్పారు. వస్తువుల ధరలు, ధరకు తగ్గ నాణ్యతలేకపోవటం,, కిరాయికి తీసుకొన్న ఇళ్ళల్లోవుండే ఇబ్బందులు, అసూయపరులైన చుట్టుపక్కలవాళ్ళు. ఈ ప్రపంచంలో ఒక్క విషయంకూడా వాళ్ళకు ఆనందం ఇచ్చినట్లు నాకు కనిపించలేదు. నా ఎదురుగ్గా కూర్చున్న వందన ఎలాంటి సౌకర్యంలేని ఆ పల్లెటూరు గురించి ఎన్నో కబుర్లు చెప్పారో లెక్కలేదు. ఆవిడ మాటలువింటూ నేను కృష్ణాజిల్లాలోని ఆ పల్లెటూరి రోడ్లపైన విహరించాను. ఎర్రమట్టినేల, జున్నుపాలు, అప్పుడేకోసిన కూరలతో భోజనం, వందన నన్ను చాలా ఊరించింది. మనిషికి కావలసింది ఏమిటో నాకు ఫజిల్ పూర్తిచేసినట్లు తేలింది. వసంత రుతువులో కోయిల మనల్ని అడిగి పాడదు. ఎప్పుడూ కష్టపడుతూ తేనెటీగ తేనే సంపాదించటంలోనే ఆనందిస్తుంది. మనం కేవలంవసంతరుతువునీ, వర్షగమనాన్ని ఆనందిస్తూ ఉండలేకపోవచ్చు. కానీ మనకోసంగావున్న ప్రపంచాన్ని ఆనందించి లేకపోవట నష్టంకదా.
చాలామందికి చాలా విషయాలు బావుండకపోవచ్చు. కానీ అలా బాగాలేనివిలైఫ్ కాదు. అవి చిన్నపాటి అసౌకర్యాలు. అంటే వందన అన్నట్లు ‘కరంటు విషయంలోమాత్రం చిరాకొస్తుందండీ. నేను పుట్టినప్పటినుంచి టౌన్స్‌లో పెరిగాను. కొన్ని సౌకర్యాలకు అలవాటు పడ్డాను. కానీ నేనీ పనిని చేతిలోకి తీసుకొచ్చాక మిగతా విషయాలవైపు దృష్టి పోనివ్వలేదు. నేను చదువుకొన్న చదువుకు దగ్గరగా వుండేపని ఇది. ఇంకా చుట్టుపల్లెలనుంచి, స్త్రీలసంఘాలు ఏర్పాటుచేశాం. తేనెటీగల పుట్టగొడుగుల పెంపకం ఇలాంటి చిన్నపాటి పరిశ్రమలు నెమ్మదిగా మొదలుపెట్టాం. కొన్నాళ్ళకు అందరిచేతుల్లో డబ్బులుంటాయి‘ అన్నది వందన. వాళ్ళ నాన్నగారు హైద్రాబాద్‌లో లీడింగ్ లాయర్. అమ్మ డాక్టర్. పుష్కలంగా డబ్బుంది. వందనకి ఆ పల్లెటూరు నచ్చింది. నాకు వందన చాలాచాలా నచ్చింది.
జార్జ్ మాసన్ యూనివర్శిటీ సైకాలజీ పరిశోధకులు జేమ్స్ మాడక్స్ చేస్తున్న పరిశోధనల ప్రకారం ’చక్కని తిండి, కాస్తో కూస్తో వ్యాయామం, కంటినిండా నిద్ర, డాక్టర్ చెకప్‌లతోపాటు రోజులో సాధ్యమైనంత సమయం మానసికంగా తృప్తిగా నిర్మలంగా బతకటంకూడా అవసరం. ప్రతి ఒక్కరూ జీవితంలో మనకు తృప్తినీ, ఆనందాన్ని, బాధనీ కలిగిస్తున్న అంశాలేమిటో గుర్తించి, చక్కని వృత్తి, చక్కని వ్యాపకం పెంచుకోవాలి. పనిలో ఆనందం అనుభవించాలి. మనం ఏంచేసినా తృప్తిగా చేస్తే నిండు నూరేళ్ళు ఖాయం‘ అంటున్నారు మాడక్స్. ఈ సందేశం చాలా బావుంది కదా. సంవత్సరం మొత్తంగా ఇలా తృప్తిగా వుండి చూద్దాం.
Subscribe to:
Post Comments (Atom)
2 వ్యాఖ్యలు:
నిజం చెప్పారు . అలా ఉండటానికి ప్రయత్నం చేద్దా
Good message.
Post a Comment