Monday, May 13, 2013
నేను ఇంతకుముందు ఒక టీవీ
కార్యక్రమానికి స్ర్కిప్టు రాసేపుడు, ఆ
కార్యక్రమానికి సంబంధించి చాలా ఉత్తరాలొచ్చేవి. చాలామంది ఉత్తరాల్లో పదే పదే ఆ
కార్యక్రమం చాలా బావుందని రాసేవారు. ఆ
ఉత్తరాలన్నీ ఒక వరసలోపెట్టి చూస్తుండేదాన్ని. ఆ ఉత్తరాల్లోంచి నేనువినగలిగే ఒక
చక్కని మెసేజ్ ఒకటుండేది. ఉత్తరాలలో ఒకేరకంగా 'బావుంది' అన్న మూడే అక్షరాలు కానీ, వాటిల్లోంచి నిశ్శబ్దంగా 'మేము కార్యక్రమం
మొత్తంగా చూస్తున్నాం. దాని నుంచి మాకు అందుతున్నది తీసుకొంటున్నాం. మా స్పందన
తెలియజేసేందుకు ఉపకరించేది ఈ మూడు అక్షరాలే'కదా అని. అందుకే ఆ ఉత్తరాల్ని కార్యక్రమంలో చదివేవాళ్ళం.
సాధారణంగా, ఒక్కోసారి మెచ్చుకోవటం, మనల్ని గుర్తు
తెచ్చుకోవటం కూడా చాలా అవసరం. ఎదుటివాళ్ళ గుండెల్లో, వాళ్ళు ప్రేమతో మన గురించి జ్ఞాపకం ఒకటి వుందికదా అని, ఆ తీయని అనుభూతికోసం అలాంటి ఉత్తరాలని
నేనెప్పుడూ ముట్టుకొంటూ వుంటాను. సాధారణంగా
చూడండి... మన సొంతిల్లయినా..
అద్దెఇల్లయినా దాన్ని శుభ్రంగా వుంచుతూ అందంగా అలంకరిస్తాం. అన్ని ఇళ్ళూ..
ఒకేలాగా ఉండకపోవచ్చు. అది పూరిల్లయినా సరే, ద్వారాలు.. కిటికీలు తెరిచి చల్లని గాలిని, వెలుతురిని ఆహ్వానిస్తాం. ప్రతిపండగకీ తోరణాలు కట్టి, తియ్యటి పిండివంటలు వండుతాం. బంధువులని ఆహ్వానిస్తాం. ఆహ్వానం అందుకొన్న అందరూ వచ్చి కాస్సేపు మన
ఇంట్లోవుండి, వెళ్ళేముందు ఓ మౌనసందేశం వదిలివెళతారు.
'మీ ఇల్లు బావుంది. నీ ఆహ్వానం బావుంది..
అభిమానం బావుంది. నీ ఇల్లు అచ్చం మా ఇల్లులా వుంది అని. ఆ కార్యక్రమం గురించి రాసిన
ఉత్తరాల్లోకూడా నాకు ఇదేవినిపిస్తుంది. ఆ కార్యక్రమ స్ఫూర్తితో ఎన్నెన్నో
నైపుణ్యాలు నేర్చుకొన్నామని రాసిన వందలాది ఉత్తరాల్లోకూడా ఇదేవినిపించింది.
సమయంలేక అందరినీ చూడలేకపోయం, కానీ మన దగ్గరకు ఉత్తరాలసుగంధం మోసుకువచ్చిన శుభసందేశం
ఇదే.
ఆ కార్యక్రమానికి వచ్చిన ఒక ఉత్తరం
గురించి చెబుతాను. ద్వారక రాశారు. బషీర్‌బాగ్‌లో వుంటారు. ఆవిడ రాసిన ఉత్తరంలో తన ప్రతి మధ్యాహ్నాన్ని ఎంత బాగా వర్ణించారో
చెప్పలేను. మధ్యాహ్నాం వాళ్ళవీధిలో పెద్దగా సంచారం వుండదు. కిటికీలోంచి కాస్తంత
వంగితే నందివర్ణనం, పచ్చని ఆకులు పలకరిస్తాయట. గాఢమైన
ఆకుపచ్చ రంగు, ఆకులమధ్యని గుండ్రని తెల్లని పువ్వులు,
వాటిపైనుంచి దూరంగాచూస్తే రోడ్డు..
అప్పుడప్పుడు వాహనాలు... వీటన్నింటిమధ్య నుంచి కనిపించకుండా రెక్కలు అల్లాడిస్తూ ఓ
తెల్లని హంస ఆవిడ చుట్టూ
తిరుగుతూ ఉంటుందట. ఆ హంస ఆవిడ కలల ఊహలు. ఆ
కిటికీ ఆవిడ ప్రపంచం. ఈవీథి
దాటితే నగరంలోకి అడుగుపెట్టవచ్చు. నాకేం పని ఉంటుంది..? నెలకో సారి ఇంట్లోకి కావలసిన సరుకులు తెచ్చుకోవటం తప్ప. అయినా
ఉదయాన్నీ, మధ్యాహ్నాలనీ, సాయంత్రపు చల్లదనాన్ని, నెలవంకనీ ఆమెకు
చూపెట్టే ఆ కిటికీ ఇవ్వాళ ఆవిడ మనోప్రపంచంపు
మహాగ్రంధం. కేవలం ఆ కార్యక్రమం వల్లనే
నాకీ దృష్టి కలిగింది. నేనిలా ఆలోచించానంటే దీనివల్లనే అన్నారామె. ఎలావుందీ ఉత్తరం?
వెతుకుతున్నదేదో నీటి సుసిరం, నీలిసరస్సులా నిశ్చలం. అవునా కాదా? మనం వెతికేది మన మనస్సుల్లోనేవుంది. కాకపోతే దాన్ని తెలుసుకొనేందుకు
సమయం పడుతుంది. ద్వారక ఒక చక్కని కిటికీ
తలుపు తీసి చూపించారు. ప్రతిరోజు చూసే నగరం నాకెంత కొత్తగా కనిపించిందో చెప్పలేను.
ఏ రోడ్డు కూడలిలోనయినా ఆగి చూడండి. ఒక పక్క మొలుచుకొచ్చిన పువ్వులు, ఫలభరితమైన తోటలుంటాయి. కూడలి, నాలుగు చేతులతో నగారాన్ని మోస్తున్న ఆదిశేషుడిలా ఉంటుంది.
సెలవురోజుల్లో పాతపుస్తకాల లైబ్రరీ అవుతుంది. ఇంకా ఎన్ని కనబడతాయో చూడండి.
పరుగెత్తుతున్న వేగాన్ని చూడచ్చు. ఆ వేగాన్ని చిటికెలో ఆపేయగల శక్తినీ చూడచ్చు.
నవ్వొస్తోందా...! పరుగెత్తే వాహనాల్ని ఒక్క చేతిసైగతో ట్రాఫిక్ కానిస్టేబుల్
ఆపేయ్యడా. ఆ రోడ్డుకి జీవం లేదు. కానీ మనందరంకలసి, పూలమ్మేవాళ్ళు, పండ్లమ్మేవాళ్ళు, నడిచేమనం, వాహనాల శబ్దం.. ఇవన్నీ కలసి ఆ రోడ్డుకి
చైతన్యం తెచ్చాం. జీవితానికి అంతే. నిత్య చైతన్యం మనమే. ఇంత వసంతాన్ని మనలోనే దాచుకొని, ఎప్పుడైనా, వడగాలిdస్తే.. వడగాలివంటి కష్టాలొస్తే రానీయండి. హాయిగా రెండుచేతులా
ఏదిదొరికినా తీసుకొందాం.
మనం జీవితాన్ని కవిత్వంతో పోల్చుకొందాం. కవిత్వం రాయటం ఇష్టం అని చాలామంది అంటుంటారు.
నిజంగానే ఏదయినా రాయటంమాత్రం గొప్ప అనుభవం. కవిత్వం రాయటమంటే 'ప్రపంచాన్ని మేల్కొపటం. ఎవ్వరూ లేవకముందు నువు నిద్రలేవటం' అన్నారోకవి. ఇంకా చీకట్లువిడిపోని నగరం మధ్యలో
నిలబడి అందరికీ హెచ్చరిక చేయటం. దానికర్ధం, నిద్రలేవండి, రాజీపడకండి, సరికొత్త జీవితాన్ని ఆహ్వానించండి అని చెప్పటమేగా.
కవిగారు అన్నట్లు కవిత రాయటమంటే మళ్ళీ మళ్ళీ పుట్టటం, కొత్త ప్రపంచానికి స్వాగతం చెప్పటం. ఏమంటారు?
Subscribe to:
Post Comments (Atom)
2 వ్యాఖ్యలు:
ఎంత బాగా చెప్పారండీ.. నిజమే..
కొత్తగా రెక్కలు విచ్చుకున్న పూవు,
అప్పుడే పుట్టిన శిశువు,
రాజీ పడని బతుకులోంచి పుట్టిన విశ్వాసం,
భావావేశాలతో ప్రాణం పోసుకున్న కవిత
నిజంగానే కొత్త ప్రపంచానికి స్వాగతం చెప్పడమే...
ఎంత బాగా చెప్పారండీ.. నిజమే..
కొత్తగా రెక్కలు విచ్చుకున్న పూవు,
అప్పుడే పుట్టిన శిశువు,
రాజీ పడని బతుకులోంచి పుట్టిన విశ్వాసం,
భావావేశాలతో ప్రాణం పోసుకున్న కవిత
నిజంగానే కొత్త ప్రపంచానికి స్వాగతం చెప్పడమే...
Post a Comment