Thursday, May 16, 2013

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..


ఈ మధ్య సినిమా కథ ఎలా రాయచ్చో నేను కనిపెట్టా. మొదటి కిటుకు ఏమిటంటే వరసాగ్గా నెలరోజులపాటు టౌన్‌లో ఉన్న సినిమాలు మొత్తంచూసి పడేయాలి. ఆ మానసిక స్థితి సినిమా కథ రాసేందుకు చక్కగా పనికొస్తుంది. ఇప్పుడు  చూడండి. మనకీ జీవితంలో కాస్త ప్రేమకీ, త్యాగానికీ, వళ్లుమంటకీ, ఏడుపులకీ, మనదైన ప్రత్యేకత ఉంటుంది. సినిమాకు ఇవ్వేమీ అక్కర్లేదు. మనం చూసే, వినే ప్రేమకథలు. ఒక్కమ్మాయి ప్రేమలో పడాలంటే మగపిల్లలు చాలా తంటాలు పడాలి. బహుశా తనే ప్రేమిస్తూ వెంటపడుతున్నాడుకదా అని అమ్మాయిలు మరింత గర్వంగా ఆకాశంవైపు చూస్తూ నడుస్తారు. కానీ సినిమా అమ్మాయిలకు ఇవేం అక్కర్లేదు. స్పీడ్‌గా, ఇంకా మాట్లాడితే బైక్‌ని ఒక టైర్‌పైన నడిపిస్తూ అమ్మాయిచుట్టూ గిర్రున తిరిగి, ఓ ఈలవేస్తే చాలు. అమ్మాయి పుస్తకాలు పారేసి డాన్స్‌ కు దూకుతుంది. చూడండి. ఎంత టైమ్‌ కలిసివచ్చిందో. నేనీ విషయం మా కొలీగ్‌కు చెపితే  ఆయన చాలా దిగులుపడ్డాడు. అనవసరంగా ఓ అమ్మాయి చుట్టూ రెండేళ్ళు తిరిగీ తిరిగీ ఆవిడ్ని కట్టుకొన్నాట్ట. మరి టైమ్‌ ఎంత వేస్టో కదా.

ఇంకో ట్రిక్‌ చెబుతాను. ముష్టి పేదవాళ్ళ సెంటిమెంటు సినిమాతీయి, అదిరిపోయే లవ్‌స్టోరీ తీయి, తలకాయలో ఎలాంటి ఆలోచనా లేకుండా ఐటమ్‌సాంగ్స్‌ తీయి, రీజనింగ్‌తో పనిలేదు. పది గాగ్రాచోళీలు, పొట్టొపొట్టిగావుండే డ్రెస్‌లు కొనుక్కొంటే చాలు సగం సినిమా అయిపోతుంది. డాన్స్‌ లకీ పెద్ద కష్టంలేదు. ఓ పదినిముషాలు సీరియస్‌గా కొన్నిసినిమాలు చూసి, ఆ మూవ్‌మెంట్లలో నచ్చినవి మనసులో కాపీ చేసుకొంటే చాలు. కొత్త డాన్స్‌. అసలు మనకు డాన్స్‌ అనేది రాకపోయినా ప్లాన్‌ చేయచ్చు. ఈ మాత్రం  దానికి డాన్స్‌ డైరక్టర్‌కూడా దండగ. డైరక్టరే తిప్పలు పడొచ్చు. సగం సినిమా అయిందా. ఇంకా రెండు ఫైట్స్‌, క్లైమాక్స్‌ వున్నాయి అవీ చెప్తాను. సినిమా తీయటమంత ఈజీయెస్ట్‌ ఇంకేంలేదు. ఇప్పుడు క్రియోటివ్‌గా.. వద్దులేండి అంతమాటేందుకు. ఈ మాత్రం క్రియోటివిటీ ఏం అవసరం వుందీ. ఇందులో పెద్ద కష్టపడేది ఏదీలేదు. ఇరవైమంది ఫైటర్స్‌.. బాగా తన్నించుకొంటారా? ఐదునిముషాల ఫైటింగ్‌సీన్‌లో ఓ ఇరవైసార్లు పడండి. అంటే జంప్‌ చేస్తేచాలు. ఇక్కడ కాస్త క్రియోటివిటీ అంటే వాళ్ళు ఎక్కడెక్కడ పడతారో అక్కడ నీళ్ళొచ్చే పంపులూ, రెండుమూడు బురదగుంటలూ, పడగానే పైకి ఎగిరేలా టమోటాలు, నిమ్మకాయలూ వుంటే చాలు. గ్రాఫిక్స్‌ గురించి కాస్త ఓనమాలు తెలిస్తే చాలు. ఒకే ఒక ట్రిక్‌ని ప్లాన్‌ చేసుకొని, హీరోని ఐదంతస్థుల ఎత్తునుంచి, పరుగెత్తే కార్లపైనుంచి, లారీల అడుగునుంచి బయటకులాక్కొస్తే చాలు. ఫైట్‌ ఫినిష్‌. చూశారా. కథలు రాయటం ఎంత ఈజీనో. వారంరోజులు బండచాకిరీ చేశా, సెలవు పూటన్నా, పిచ్చి ఆఫీస్‌ స్టాఫ్‌ గోలలేకుండా మెదడు స్విచ్‌ ఆఫ్‌చేసి కళ్ళతో మాత్రం ఈ సినిమా చూద్దాం అనుకొనివచ్చే వేలాది మంది సినిమా ప్రేమికులు ఈ దేశంలో కొదువా చెప్పండి. ఉండండి తొందర పడకండి. ప్రతికథా కంచికి వెళుతుందా, లేదా. అలాగే ప్రతి సినిమా ఏదోరకంగా క్లైమాక్స్‌ కు చచ్చినట్లుగా రావాలి. దీనికి అస్సలు కష్టంలేదు. తలాతోకాలేకుండా నడిపించే సినిమాని, ఆ రెండూ కలిపి ముడేయాలి. మధ్యలో అడ్డం వచ్చిన పాత్రల్ని చంపి పడేసో, లేకపోతే దేశాంతరాలకు పంపేసో, ఎలాగోలా వదిలించుకోవాలి. మిగతావాళ్ళు.. ఎందుకులేండి ఇంత పెద్దమాట. ఇంకెవరుంటారూ.... తల్లీతండ్రినీ వదిలించుకొన్నాం. ఫైటర్స్‌ ఆ పూటతోనే వాళ్ళదారి వాళ్ళు చూసుకొన్నారు. హీరో వెనక్కాలతిరిగే పనీపాటాలేని ఐదారుగురు స్టూడెంట్స్‌, అనుచరులు, హీరో హీరోయినూ.వీళ్ళతో క్లైమాక్స్‌. పెద్ద కష్టమా..! సెంటిమెంట్‌ సినిమా అయితే గుమ్మానికి వేలాడి, గాజుముక్క గుచ్చుకొని విడ స్పృహలేకుండా పడిపోతే, డాక్టర్లు మా వల్లకాదంటే, హీరో ఈలతో హీరోయిన్ కళ్ళు తెరిచేలా చేయచ్చు. ఇలాంటి ఐడియాలు మన దగ్గర ఒక కోటి వుంటాయి.

ఇంత గొప్ప అవార్డ్‌ పిక్చర్‌ కథని, ఐదే నిముషాల్లో రాస్తే మీరు షాకైనారా, లేదా. చివర్లో ఎవరైనా ఇలాంటి గొప్ప సినిమా తీయదలుచుకొంటే ఒకే ఒక టెక్నిక్‌ అండీ. సినిమాకథ రాసిన మీకే పెద్దగా నచ్చకపోయినా పర్లేదు. డైరక్టర్‌ ఏడుపుమొహం పెట్టినా లెక్కలేదు. డోంట్‌కేర్‌. అయితే ఒక్క నిర్మాతకు మాత్రం నచ్చాలి. గుర్తు పెట్టుకోండి. ఆయనకే నచ్చాలి. మధ్యలో ఆయనకి పాపం కొన్ని డౌట్లు వస్తాయి. హీరో ఒకే ఒక్కగుద్దుతో 20మంది నుంచి 90మందిని ఎలా తంతాడండీ. తలుచుకొంటే నాకు చేతులు నెప్పుడుతున్నాయి అనేలోగానే ఆయన్ని కనికట్టుచేసి దృష్టి మళ్ళించగలగాలి. అసలా.. ఆ ఫైట్లేనండీ మన సినిమాకు హైలెట్‌ అని వప్పించగలగాలి. ఈ టాప్‌ సీక్రెట్‌ని దృష్టిలో పెట్టుకొన్నారా... సినిమా కథ రాయటం కాఫీ తాగినంత ఈజీ. 

2 వ్యాఖ్యలు:

Unknown said...

చాలా బాగా రాసారు మేడం ,

మీ బ్లాగు బావుంది ,

మీకు వీలున్నపుడు మా బ్లాగు ను చూడండి

ధన్యవాదాలు,
http://techwaves4u.blogspot.in/
తెలుగు లో టెక్నికల్ బ్లాగు

Zilebi said...

వావ్,

కిటుకు చెప్పెసేరు, ఇక ఒక కథని ప్రెజెంట్ చేసెయ్యండి మరి !

(దాన్ని సినీ లోకం వాళ్ళు తన్నేసుకు పోయి సినెమా గా తీసి, ఆ క్రెడిట్స్ కూడా మీకు ఇవ్వకుండా ఆ చిత్రమే మీరు చూడాల్సి వస్తే, మీ కనా కష్టాలు/ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయో అని ఆలోచిస్తా ఉన్నా!!)

జేకే!

చీర్స్
జిలేబి