Thursday, May 30, 2013

మా అమ్మెళ్ళిపోయింది...

ఒక దీపం నీ వెనగ్గా
కదలకుండా.. పెదవి కదపకుండా నువు
ఎలా వచ్చావో.. ఎలా వెళ్ళిపోయావో..
రెంఢూ ప్రశ్నార్ధకాలే
దీపం గాలికి రెపరెప లాడింది
ఉలిక్కిపడి చేయిచాస్తావేమో ననుకున్నా
నేనొచ్చినా చిన్న నవ్వయినా లేదు
పలకనందుకూ.. పడుకుండి పోయినందుకూ
నీ చుట్టూ సమూహాలు చూస్తున్నాసరే
ఎంతలా అరిచానంటే
నువు విననట్లే వున్నావు మరి
ఎన్నిసార్లు అలా నిర్లిప్తంగా లేవు నువు
జీవితం మొత్తంగా ఎన్నిసార్లు
నే కన్నీటి సంద్రమయినా
అందులో నువు మునుగుతూ తేలుతున్నావని
నాకు ఖాయంగా తెలుసు
అందుకే నా ఏడుపుని నీ చేతుల్లో పెట్టేను తప్పించి
మిగతా భారమేదీ లేదు నాకు
ఇప్పుడు చూశావూ.. నువు  ఏ భారం
తీసుకోవని తెలిశాకే అసలైన భయం
ఎప్పటికీ నా భయాలన్నీ నేనొక్కదాన్నే
భరించాలన్న భయం వెన్నులో పాకుతోందే అమ్మా..
నిజంగా భయంగా వుందే
నాకు తెలుస్తూనే వుంది నా చేతులు వదిలావని
వెళ్ళేముందు నీ ఎదురుగ్గా నేను
చూపు నిలవని కళ్ళతో నువు.. చూసింది నన్నేనా
లాక్కుపోతున్న ప్రాణశక్తి నిలుపుకోవాలనే
నీ తపన నన్ను తాకిన నీ చేయి చెపుతూనే వుంది
నాకు తెలియదనుకొన్నావేమో
నీ నొప్పిని నరనరానా నేను
అనుభవించలేదనుకొన్నావేమో
ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా
నువు లేకుండా నేను నిలబడే క్షణం గు రించి
నాకు భయం వేయదని నువ్వెలా తీర్మానించుకొన్నావే
ఈ ప్రపంచం నాకెంత తెలుసనీ.. తెలిస్తే
గాలికి ఎగిరిన నీ ప్రాణాన్ని అలా చేత్తో అందుకొనే దాన్నిగా
ఈ ప్రపంచం నాకెంత పరిచయమనీ
నా చుట్టూవున్న ఈ ఏ ఒక్క మనసునన్నా
ఒక్క క్షణం చదవగలనా
ఈ ప్రపంచం నా కెంత అనుభవమనీ
కొన్ని వందల గంటలు నీ ఎదురుగ్గావున్నా
నా కళ్ళముందే మాయమైపోతున్న
నీ జాడ అణువంతయినా నాకు తెలిసిందా
ఈ ప్రపంచం నా కెంత సన్నిహితమని
నా కిష్టమైన నువ్వే చేజారినా నాకు కాస్తయినా
కబురు అందలేదే
అమ్మా అందుకే భయంగా వుందే
నేనిక్కడున్నా ఎలాగూ మాయమౌతా
నే కట్టుకొన్న చిన్నారి గూడు
నాది కాకుండా జారిపోతూ
మన చుట్టుబంధాలు ఎలా తెగి ముక్కలవుతాయో
నిన్ను చూస్తూంటేనే తెలిసిపోయింది
నాదైనదేదీ ఇక్కడ శాశ్వతంగా ఉండదని
నేనున్నదీ నిజం
నేనెక్కడా లేనిదీ నిజం
నాకు హక్కులేని ఈ క్షణంలో నేనున్నాననీ తెలుసు
నువు నవ్వుకొంటున్నావనీ నాకు తెలుసు
నిన్నే లాక్కుపోయిన కాలం
నన్ను మాత్రం ఎలా వదులుతుంది
ప్రయాణం మొదలు పెట్టాను

త్వరలోనే కలుస్తా

8 వ్యాఖ్యలు:

ranivani said...

బాధ పడకండి అంతా త్వరలోనే .సర్దుకుంటుంది .

Anonymous said...

Sad to know this ma'am. May her soul rest in peace...Ramu

www.apuroopam.blogspot.com said...

ఆర్ద్రమైన కవిత.అమ్మ తోటి అనుబంధం ఎవరి కైనా సరే మాటలకి అందనిది.ఎంత రాసినా ఎంతో కొంత మిగిలే ఉంటుంది.మీ అమ్మ గారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను.

వనజ తాతినేని/VanajaTatineni said...

:(సారీ సుజాత గారు .

అమ్మ లేకపోతే నిజంగా భయమే ! ఆ లోటు ఎవరు తీర్చలేనిది వదిలేసినా చెయ్యి వెతుక్కుంటూ అందరూ వెళ్ళే వారిమే!

శ్రీలలిత said...


పిల్లల్ని ఎండన పడకుండా కాచే నీడలాంటి అమ్మ లేని లోటు ఎవరూ పూడ్చలేనిది.
కాలంతోపాటు కదలక తప్పని పరిస్థితి. యాంత్రికంగా జీవించక తప్పని పరిస్థితి.
అమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

pallavi said...

Sorry Maam...May her soul rest in peace...
chala aardramga undi ..kallu varshistunnayi chaduvutunte...nijamga amma leni lotu ennatiki teerchalendi..realy very sorry...:(

Anonymous said...

"అమ్మెళ్ళిపోయింది.."

అవును. కళ్ళముందు నుండి గుండెలోతుల్లోకెళ్ళిపోయింది.

anrd said...

ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
కాలమే అన్ని గాయాలను తగ్గిస్తుందని అంటారు.