Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts

Thursday, May 30, 2013

మా అమ్మెళ్ళిపోయింది...

ఒక దీపం నీ వెనగ్గా
కదలకుండా.. పెదవి కదపకుండా నువు
ఎలా వచ్చావో.. ఎలా వెళ్ళిపోయావో..
రెంఢూ ప్రశ్నార్ధకాలే
దీపం గాలికి రెపరెప లాడింది
ఉలిక్కిపడి చేయిచాస్తావేమో ననుకున్నా
నేనొచ్చినా చిన్న నవ్వయినా లేదు
పలకనందుకూ.. పడుకుండి పోయినందుకూ
నీ చుట్టూ సమూహాలు చూస్తున్నాసరే
ఎంతలా అరిచానంటే
నువు విననట్లే వున్నావు మరి
ఎన్నిసార్లు అలా నిర్లిప్తంగా లేవు నువు
జీవితం మొత్తంగా ఎన్నిసార్లు
నే కన్నీటి సంద్రమయినా
అందులో నువు మునుగుతూ తేలుతున్నావని
నాకు ఖాయంగా తెలుసు
అందుకే నా ఏడుపుని నీ చేతుల్లో పెట్టేను తప్పించి
మిగతా భారమేదీ లేదు నాకు
ఇప్పుడు చూశావూ.. నువు  ఏ భారం
తీసుకోవని తెలిశాకే అసలైన భయం
ఎప్పటికీ నా భయాలన్నీ నేనొక్కదాన్నే
భరించాలన్న భయం వెన్నులో పాకుతోందే అమ్మా..
నిజంగా భయంగా వుందే
నాకు తెలుస్తూనే వుంది నా చేతులు వదిలావని
వెళ్ళేముందు నీ ఎదురుగ్గా నేను
చూపు నిలవని కళ్ళతో నువు.. చూసింది నన్నేనా
లాక్కుపోతున్న ప్రాణశక్తి నిలుపుకోవాలనే
నీ తపన నన్ను తాకిన నీ చేయి చెపుతూనే వుంది
నాకు తెలియదనుకొన్నావేమో
నీ నొప్పిని నరనరానా నేను
అనుభవించలేదనుకొన్నావేమో
ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా
నువు లేకుండా నేను నిలబడే క్షణం గు రించి
నాకు భయం వేయదని నువ్వెలా తీర్మానించుకొన్నావే
ఈ ప్రపంచం నాకెంత తెలుసనీ.. తెలిస్తే
గాలికి ఎగిరిన నీ ప్రాణాన్ని అలా చేత్తో అందుకొనే దాన్నిగా
ఈ ప్రపంచం నాకెంత పరిచయమనీ
నా చుట్టూవున్న ఈ ఏ ఒక్క మనసునన్నా
ఒక్క క్షణం చదవగలనా
ఈ ప్రపంచం నా కెంత అనుభవమనీ
కొన్ని వందల గంటలు నీ ఎదురుగ్గావున్నా
నా కళ్ళముందే మాయమైపోతున్న
నీ జాడ అణువంతయినా నాకు తెలిసిందా
ఈ ప్రపంచం నా కెంత సన్నిహితమని
నా కిష్టమైన నువ్వే చేజారినా నాకు కాస్తయినా
కబురు అందలేదే
అమ్మా అందుకే భయంగా వుందే
నేనిక్కడున్నా ఎలాగూ మాయమౌతా
నే కట్టుకొన్న చిన్నారి గూడు
నాది కాకుండా జారిపోతూ
మన చుట్టుబంధాలు ఎలా తెగి ముక్కలవుతాయో
నిన్ను చూస్తూంటేనే తెలిసిపోయింది
నాదైనదేదీ ఇక్కడ శాశ్వతంగా ఉండదని
నేనున్నదీ నిజం
నేనెక్కడా లేనిదీ నిజం
నాకు హక్కులేని ఈ క్షణంలో నేనున్నాననీ తెలుసు
నువు నవ్వుకొంటున్నావనీ నాకు తెలుసు
నిన్నే లాక్కుపోయిన కాలం
నన్ను మాత్రం ఎలా వదులుతుంది
ప్రయాణం మొదలు పెట్టాను

త్వరలోనే కలుస్తా

Wednesday, September 28, 2011

నెరుసు అంటే...

జగ్గాపురం మా అత్తగారి ఊరు. ఆ ఊరిలోనే పుట్టి పెరిగింది నా తోడికోడలు. ఆవిడ వాడిన పదం ఇది. అక్కడ వాడుకలో వున్న పదం. ఇదివరకూ కర్రల పొయ్యిపైన వంట చేసేవాళ్ళు. మంట ఆరిపొయాక పొయ్యిలో కొన్ని కర్రలు కాలితే మిగిలే బొగ్గులుండేవి. కణ కణమని మండుతూ కనిపించే ఆ బొగ్గులుపైన నెమ్మదిగా బూడిద కప్పువేసేది. ఎవరైనా పొరపాటున బూడిద అనుకొని చేయి పెడితే ఆ చిన్ని నలుసంత నిప్పు కణం చేయి చురుక్కుమనిపిస్తుంది. అదే నలుసు అంటుకుని మళ్ళీ మండచ్చుకూడా లేదా.. ఎవ్వరూ పట్టించుకోకపోతే నిర్లిప్తంగా బూడిదై చల్లారిపొవచ్చుకూడా. ఇది ఆడవాళ్ళకు చాలా బాగా వర్తిస్తుంది అనిపించింది. ఒక్క చిన్ని నెరుసు.. నిప్పు రవ్వ.. నిస్సహాయంగా బూడిద క్రింద చల్లారిపొబొయే ఆ కణం ఎవరైనా కెలికితే చేయి కాల్చదా..? నెరుసు మా తోడికోడలు సృఇస్టియోమోకాని నన్ను వెంటాడి వేధించిందాపదం. ఒకప్పుడు నా వెనకాల నా చూట్టూ చాలామంది ఆడవాళ్ళు వుండేవాళ్ళు. చలం రచనల్లోంచి వీరేశలింగంగారి ఆత్మ కధల్లోంచి, ఫెమినిష్టుల రచనల్లోంచి ఎంతోమంది ఆడవాళ్ళు తమ నిస్సహాయత పట్ల అంతులేని కోపంతో వుండే ఆడవాళ్ళ వరసలో నెనూ వున్నాననిపించేది. నా కధల్లో గొంతులన్నీ అవే. తెల్లని బూడిద క్రింద నిర్లిప్తంగా పడున్న బొగ్గు రవ్వ ముట్టుకొంటే చేయి చురుక్కుమనిపించిన అనుభవం నా వేళ్ళ చివరనే వుంది. ఆ నెరుసు గాలికి ఎగిరి ఏ పాకపైన పడ్డా మంటలు లేవటం ఖాయం. ఆడవాళ్ళంతా వాళ్ళ జీవితాల్లో నింపుకొన్న నిర్లిప్తత నుంచి లేచి మంటల్లో ఎగిసిపడాలని నా కోరిక. నేను రాయటం మొదలుపెట్టిన ఏ ముప్పైయేళ్ళలో నా ఆశ చాలావరకూ నెరవేరింది. కానీ ఎక్కడో ఓ చిన్న అసంత్రుప్తి.. ఇంకా గమ్యం చేరలేదని. నేనూ చాలా నడిచాను. ఎలా వుంటే బావుంటుందో.. ఏం చేయాలో చేసికూడా చూపించాను. ఇంకా నా బాధ్యత ఏదైనా మిగిలివుంటే అది నేను సెలవు తీసుకొనేదాకా గమ్యంవైపు నడుస్తూనే వుండడం.

Wednesday, September 21, 2011

మనం ఏం మాట్లాడినా..

మనం ఏం మాట్లాడినా ముందు మనకు నచ్చుతుంది. అన్న షర్టేస్తే మాస్ .. అన్న మడతేస్తే మాస్.. అని ఓ పాటలాగ తెలిసో తెలియకో లొలోపల మనం కూడా అలాగే వుంటాం. ఒక్కోసారి ఆ గర్వం దాచుకొని కాస్త వినయం నటిస్తాం. మనం పెట్టే ఆ వినయం మొహంలో దాచుకోలేని చిరునవ్వులో కనిపిస్తూనే వుంటుంది. ఇప్పుడు 'మనం' అంటూ నేను రాస్తున్నప్పుడు కూడా.. ఓసారి విజయవాడ ఏఐఆర్ స్టుడియో లో ముందర లాంజ్ లో కూర్చుని వున్నాను. వున్న సొఫాలూ చైర్లూ నిండిపొయి వున్నాయి. నా ప్రక్కనే ఎవరో నిలబడ్డారు. బహుశా నేను కాళ్ళు వూగిస్తూ నాప్రక్కనున్నాయన వంక ఒకటికి రెండు సార్లు సందేహంగా చూస్తూ , నేనూ రేడియో స్టేషన్లో రికార్డింగ్ కే వచ్చానన్న సంకేతాలిస్తూనే వుండి వుంటాను. ఉన్నట్లుండి నా చైర్ ప్రక్కన నిలబడ్డ ముసలాయనా, ఆయన చేతిలో జనపనార సంచీ ఎక్కడో తెలిసినట్లు అనిపించింది. వెంటనే మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అన్నాను. ఆయన నా వంక చూసి .. చూసావా.. నన్ను వావిలాల గోపాలక్రిష్ణయ్య అంటారులే. కాళ్ళు వూపటం మానేసి లేస్తే నేను కూర్చుంటానన్నారు. నా మొహం ఎలా పెట్టివుంటానో, ఆయన ఏఐఆర్ నుంచి వెళ్ళిపొయేదాకా ఆయన వెనక్కాల ఎలా తిరిగి వుంటానో వూహించండి!

Monday, September 19, 2011

సి.సుజాత కబుర్లు: హాయ్..

సి.సుజాత కబుర్లు: హాయ్..: నేను సుజాత. తెలుసు కదా. చెప్పటం, రాయటం.. నా ఉద్యొగమే కబుర్లు. రాయటానికీ, కబుర్లు చెప్పటానికీ పెద్ద తేడా వున్నట్లు లేదు కదా. కానీ మనం ఎలాగోలా...

Sunday, September 18, 2011

ఆప్తులంటే.. వీళ్ళు!

విజయవాడలో నవోదయలో అడుగుపెడుతుండగానే.. మీకు కోత్త ప్రపంచాన్ని ఇచ్చిన మనిషి వెళ్ళిపొయాక వచ్చారేం అన్నారు రామ్మోహనరావుగారు. సుప్తభుజంగాలు నవల ముందు మాట రాస్తూ..బండెడు చెత్తలొ ఒక మాణిక్యం మెరిస్తే ఎలా వుంటుందీ..? కళ్ళు జిగేల్ మనవూ.. బురద మడుగులో ఒక పద్మం విరిస్తే ఎలా వుంటుందీ..? మనసు పరవశించదూ. అటువంటి అరుదైన మాణిక్యాల్లో, పద్మాల్లో ఒకటి సుజాత సుప్తభుజాంగలు. ఈ నవల, రచయిత్రి మొదటి నవల కావటం విశేషం.. అంటూ సాహితీ ప్రపంచానికి నన్ను పరిచయం చేసి, నా ఉద్యొగ జీవితానికి రహదారి వేసిన నండూరిగారు కనబడకుండా పొతే ఏం మట్లాడటం.. ఇంకాస్త ముందెళ్ళిపొయిన మహీధర రామ్మోహనరావుగారు, యేటుకూరి బలరామమూర్తిగారు, ఇప్పటికి విజయవాడ నుంచి పలకరించే పరకల పట్టాభిరామారావుగరు కంకణం కట్టుకొని నా వునికి ప్రపంచానికి యెలా చాటారో.. తలో చేయివేసి ఎలా ముందు నిల్చోబెట్టారో.. ఎంత చెప్పాలి..? యే బాంధవ్యంతో అంటే.. సరిగ్గా.. మనిషికి మనిషికీ వుండవలసిన అనుబంధంతో. కాసేపు పుస్తకాల వంకా, కాసేపు రొడ్డువైపు దిక్కులు చూస్తూ కూర్చుంటే.. నేనింకో పదేళ్ళు పర్లేదా.. అన్నారు రామ్మోహనరావుగారు. ఆ ఓదార్పుకి ఏం మాట్లాడాలి..? పొయినోళ్ళు అందరూ మంచొళ్ళు.. ఉన్నొళ్ళు పొయినొళ్ళ తీపిగుర్తులు.