Wednesday, September 28, 2011

నెరుసు అంటే...

జగ్గాపురం మా అత్తగారి ఊరు. ఆ ఊరిలోనే పుట్టి పెరిగింది నా తోడికోడలు. ఆవిడ వాడిన పదం ఇది. అక్కడ వాడుకలో వున్న పదం. ఇదివరకూ కర్రల పొయ్యిపైన వంట చేసేవాళ్ళు. మంట ఆరిపొయాక పొయ్యిలో కొన్ని కర్రలు కాలితే మిగిలే బొగ్గులుండేవి. కణ కణమని మండుతూ కనిపించే ఆ బొగ్గులుపైన నెమ్మదిగా బూడిద కప్పువేసేది. ఎవరైనా పొరపాటున బూడిద అనుకొని చేయి పెడితే ఆ చిన్ని నలుసంత నిప్పు కణం చేయి చురుక్కుమనిపిస్తుంది. అదే నలుసు అంటుకుని మళ్ళీ మండచ్చుకూడా లేదా.. ఎవ్వరూ పట్టించుకోకపోతే నిర్లిప్తంగా బూడిదై చల్లారిపొవచ్చుకూడా. ఇది ఆడవాళ్ళకు చాలా బాగా వర్తిస్తుంది అనిపించింది. ఒక్క చిన్ని నెరుసు.. నిప్పు రవ్వ.. నిస్సహాయంగా బూడిద క్రింద చల్లారిపొబొయే ఆ కణం ఎవరైనా కెలికితే చేయి కాల్చదా..? నెరుసు మా తోడికోడలు సృఇస్టియోమోకాని నన్ను వెంటాడి వేధించిందాపదం. ఒకప్పుడు నా వెనకాల నా చూట్టూ చాలామంది ఆడవాళ్ళు వుండేవాళ్ళు. చలం రచనల్లోంచి వీరేశలింగంగారి ఆత్మ కధల్లోంచి, ఫెమినిష్టుల రచనల్లోంచి ఎంతోమంది ఆడవాళ్ళు తమ నిస్సహాయత పట్ల అంతులేని కోపంతో వుండే ఆడవాళ్ళ వరసలో నెనూ వున్నాననిపించేది. నా కధల్లో గొంతులన్నీ అవే. తెల్లని బూడిద క్రింద నిర్లిప్తంగా పడున్న బొగ్గు రవ్వ ముట్టుకొంటే చేయి చురుక్కుమనిపించిన అనుభవం నా వేళ్ళ చివరనే వుంది. ఆ నెరుసు గాలికి ఎగిరి ఏ పాకపైన పడ్డా మంటలు లేవటం ఖాయం. ఆడవాళ్ళంతా వాళ్ళ జీవితాల్లో నింపుకొన్న నిర్లిప్తత నుంచి లేచి మంటల్లో ఎగిసిపడాలని నా కోరిక. నేను రాయటం మొదలుపెట్టిన ఏ ముప్పైయేళ్ళలో నా ఆశ చాలావరకూ నెరవేరింది. కానీ ఎక్కడో ఓ చిన్న అసంత్రుప్తి.. ఇంకా గమ్యం చేరలేదని. నేనూ చాలా నడిచాను. ఎలా వుంటే బావుంటుందో.. ఏం చేయాలో చేసికూడా చూపించాను. ఇంకా నా బాధ్యత ఏదైనా మిగిలివుంటే అది నేను సెలవు తీసుకొనేదాకా గమ్యంవైపు నడుస్తూనే వుండడం.

1 వ్యాఖ్యలు:

samataroshni said...

chala bavundi!love,roshni