Sunday, October 9, 2011

జర్నలిస్ట్ దయ్యం..

'నువ్వు దాన్ని పట్టించుకోకు.. అది జర్నలిస్ట్ దయ్యం..' అన్నాయి నా తోటి దయ్యాలు.
నేను వచ్చి వాలిన మర్రిచెట్టు పైన ఓవైపంతా చాలా దయ్యాలు, రెండోవైపు గంభీరంగా మొహం పెట్టుకొని ఒకేఒక దయ్యం.
'అలా ప్రత్యేకమైన దయ్యాలుంటాయా ..' అన్నాను నేను.
నేను గవర్నమెంట్ టీచర్ని కనుక ప్రశ్నలు వేయడం నాకలవాటు.
'ఏందు కుండవూ.. మనుష్యుల్లొ వాళ్ళు ప్రత్యేకమట. దయ్యాల్లోకూడా వాళ్ళు సెలబ్రిటీలట. ఎడిటర్ దయ్యం, ప్రొగ్రాం హెడ్, వాయిస్ ఓవర్లూ, యాంకర్లూ, న్యూస్‌రీడర్లూ, కాసేపట్లో వస్తాయి చూద్దువుగాని...' అంది నేను రాగానే నన్ను పలకరించి పరిచయం చేసుకొన్న ఓ ముసలామె దయ్యం.
జర్నలిస్ట్‌లంటే మనకి సరదా వేస్తుందికదా. ఈవిడ వద్దంటున్నా పోయి పరిచయం చేసుకొన్నాను.
జర్నలిస్ట్ దయ్యం నా వంక అలా కిందుగా చూసి 'నువ్వు మా స్టూడియోకి ఎప్పుడైనా వచ్చావా' అంది.
'అన్నపూర్ణానా... సారధా..' అనబోతున్నానా అంతలోనే నన్ను మద్యలో కట్ చేసి 'నీలాంటి బోడి టీచర్‌లు మా స్టుడియోకి రారు. చంద్రబాబునాయుడో, రాఘవేందర్రావో, రాజకుమారి, ఇంకా పనీపాడూలేని ముసిలి జర్నలిస్ట్‌లూ, తెలుగు భాషని కాపాడే వాళ్ళు, పండగలప్పుడు దేవుళ్ళగురుంచి చెప్పే ఆడాళ్ళు.. మహేషూ, యంటీయారూ.. ఇంకా చాలా మంది వస్తారు. నాకు వాళ్ళంతా ఫ్రెండ్స్. అబ్బో ఎన్ని ప్రొగ్రాంస్ చేశానో. అస్సెంబ్లీ, సెక్రటేరియట్ బీట్లూ, జగన్ ఓదార్పు యాత్ర.. చెప్పినా నీకేం తెలుస్తాయ్ ' అంది నన్ను బొత్తిగా తీసిపారేస్తూ.
నేను కాస్త చిన్నబుచ్చుకొని 'నేనూ సీరియల్స్ చూస్తా బాబూ.. టీవీ లేకుండా నిముషంకూడా వుండలే'నన్నాను.
'అసలు నేనులేకుండా నీకు టీవీ ప్రొగ్రాం లెక్కడివీ ' అంది దయ్యం విచారంగా.
'అవన్నీ వదిలేసి ఎలా వచ్చావూ అన్నాను నేను.
'ఏమో అలా పని చేస్తూ చేస్తూ రాత్రింబగళ్ళూ అక్కడే కదా. నిద్ర పోవటానికే ఇళ్ళు. చిన్న కునుకు తీస్తూ ఇలా వచ్చేసాను. భలే కంగారు పడ్డాననుకో. ఆఫీస్ వదిలి రాను కదా. ఒక్క మనిషీ తెలీదు, ఒక్క వీధీ తెలీదు, కొన్ని బజార్లు కూడా గుర్తుపట్ట లేక పోయాను. ఎవర్నైనా నేను వెళ్ళాల్సిన మర్రిచెట్టేక్కడా అని అడుగుదామంటే ఎవ్వళ్ళూ తెలీలేదు...'
'అదేంటీ.. నీకు సీఎంలూ.. సినిమా వాళ్ళూ తెలుసన్నావు కదా ' అన్నాను ఆశ్చర్యపోయి. నామట్టుకు నాకే ఈ చెట్టుపైన వచ్చి వాలగానే యాభై మంది దాకా తెలిసినవాళ్ళు కనిపించారు...
'అదేకదా.. నాకు తెలుసువాళ్ళు, నేనెవ్వళ్ళకీ తెలీలేదు. ఎవ్వళ్ళూ నన్ను గుర్తుపెట్టుకోలేదు, పట్టించుకోలేదు.. చూసావుకదా ఎలా ఒంటరిగా వున్నానో...'
'అదేంటీ.. జర్నలిస్ట్ అంటే చాలా గొప్ప ఉద్యోగం కదా. నువ్విలా అయిపోవడమేమిటీ.. '
జర్నలిస్ట్ దయ్యం చిరాకు పడింది.
'నేను గొప్పే.. ఆ సంగతి ఎవ్వళ్ళకి తెలుసు. ఈసారి నేను పోలీస్ కానిస్టేబుల్‌గా పుట్టాలనుకున్నా. జర్నలిస్ట్‌నని ఎవడైనా అన్నాడో వాడికి నూకలు చెల్లినట్టే...'
'ఇంకానయం... నేను వచ్చే జన్మలో జర్నలిస్ట్‌ని అవ్వాలనుకున్నా, ఈ తిక్క వెధవికి చెప్పానుకాదు..'

2 వ్యాఖ్యలు:

Anonymous said...

నమస్తే మేడం...

ఈటీవీ2లో మీరు ఏం చేస్తారు / చేసేవారు? ప్రోగ్రామింగ్ లోనా? ఏ ప్రోగ్రాం? నేను ఈటీవీ2 పెట్టినప్పటి నుంచీ న్యూస్ డెస్క్ లో చేస్తున్నా. అందుకే క్యూరియాసిటీ...

ఫణీంద్ర

సి.సుజాత said...

ఈటీవీలో సఖి ఐదేళ్ళు, తర్వాత వనిత టీవీ, తర్వాత హెచ్ఎం టీవీలో ప్రొగ్రామింగ్ హెడ్‌గా చేశాను. అంతకు ముందు ఉదయం, ఆంధ్రజ్యోతి...మొత్తంగా జర్నలిస్ట్‌నే.