Wednesday, October 5, 2011

మైండ్ బ్లోయింగ్... అన్‌బిలీవబుల్...

'అసలు మన చానలెక్కడుందీ...'
మా బాస్ అక్షరాలా రంకె పెట్టాడు.
'అదుర్సులూ, వావ్‌లూ, వెధవ వంటల ప్రొగ్రాంకున్న రేటింగ్‌లు మనమిచ్చే సెన్సేషనల్ న్యూస్‌కు ఎందుకురావూ... మనుషులు ఎందుకు నేర్చుకోరూ.. '
'ఏం చూసినా ప్రయోజనం లేదని తేల్చుకొని వుంటారు సర్, వస్తే జగన్ రావాలి, లేకపోతే కిరణ్‌కుమారో, ఇంకా అవకాశముంటే కేసీయారో, కోదండరామో, కవితో ఎవరో ఒకరు వస్తారుకదా, మనం కలికంలోకూడా కనిపించం కదా అని తెలిసిపోయి సరదాగా బల్బులు తినటం, పాముల్ని మెడలో వేసుకోవడం, కార్లని పొట్టమీదుగా పోనివ్వడం చూస్తున్నారు సార్ ' అన్నాం ఏక కంఠంతో.
మళ్ళీ పొరపాటు పడ్డాం.
మా చక్రవర్తి ఒక్కడే లేచి నిలబడి, ' మన న్యూస్ చానల్స్‌లో కూడా కొన్ని ప్రయోగాలు చేయెచ్చు సార్ ' అన్నాడు ముందుగా మావైపు, తర్వాత చీఫ్ వైపు చూసి.
'నిన్ను చూస్తే ప్రాణం లేచి వస్తుందోయ్, చెప్పు చెప్పు ..' అన్నాడు చీప్.
'పులితో నలభై రోజులు అని పులినీ, దాని ట్రైనర్‌నీ ఒక రూంలో పెట్టి కౌంట్‌డౌన్ ఇచ్చేద్దామా..' అన్నాడు వుత్స్చాహంగా మా చక్రవర్తి.
' మన ఎదురుగ్గా బిర్యానీ కనబడుతుందనుకో ఎంత సేపు చూస్తూ కూర్చుంటాం. పులికి కూడా మధ్యలో దాని ఫుడ్ గుర్తొచ్చిందనుకో ట్రైనర్ని చప్పరించేస్తుంది...' అన్నాడు ట్రైనీ సబ్ శీను.
వాడెప్పుడూ అంతే అన్నీ నెగిటివ్ థాట్సే.
అందరూ చక్రవర్తిని చూసి నవ్వేలోగా, తెలివైన మా బాస్ ఆ ఐడియాని తనే గుటకలో మింగేసి.. 'అబ్బే అలాంటివికాదోయ్ కాస్త లైవ్‌లీగా చూడు అన్నాడు.
' సార్ ఐడియా సర్, ఈ ఉదయం నుంచీ మనం కుప్పాయితిప్ప గ్రామంలో దెయ్యం వుందని పుకారూ, గ్రామం వదిలి పోతున్న గ్రామస్తులూ .. అంటూ స్క్రొలింగ్ వేస్తున్నాం కదా సార్.. ఆ దెయ్యాన్ని కనిపెట్టేద్దామా ' అన్నాడు చక్రవర్తి.
' ఎలా..' అన్నాడు చీఫ్. ఆయన మొహం కొంచెం కొంచెంగా వెలుగుతోంది.
' ఏముంది సార్, రాత్రి అక్కడ మకాం వేస్తాం. లేకపోతే డే లైట్‌లోనే నైట్ ఎఫెక్ట్ ఇచ్చి చెట్లూ, తుప్పలూ షూట్ చేద్దాం.. అదిగో దయ్యం అంటూ యండమూరి తరహాలో చివరిదాకా వుందీ వుందీ అని, స్పాట్ లైట్‌లు చూపెడుతూ చివరికి వీరేంద్రనాథ్‌లాగే సైంటిఫిక్ రీజనింగ్ ఇచ్చేద్దాం...'
యధావిధిగా బుర్రలు లేకుండా పుట్టి మీడియాలోకి వచ్చినందుకు మాకు కాసిని దీవెనలూ, చక్రవర్తి అడిగిన బడ్జెట్ శాంక్షన్‌లూ జరిగిపోయాయి.
మూడో రోజు మా కోర్ మీటింగ్ అచ్చం చక్రవర్తి సంతాపసభ మాదిరిగా జరిగింది. చీఫ్ ముక్కలు ముక్కలుగా విషయం చెప్పారు. ఆ రాత్రి కుప్పాయితిప్ప క్యాంపు. ముందే వెళ్ళిన ఆర్ట్ డైరక్టరు స్పెషల్ ఎప్ఫెక్ట్ రావాలని హటాత్తుగా మండే గంధకం మంటలూ, పొగలూ పెట్టించాడట. చివర్లో లేటుగా వచ్చిన చక్రవర్తి అక్కడ నిలబడి ఏర్పాట్లు ఎలా వున్నాయని అడిగాడట. అనుకున్న ఎఫ్ఫెక్ట్ వస్తుందో.. రాదో చూద్దామని ఆర్ట్‌గాడు మంటా, పొగా, నక్కల ఊళా, ఒకేసారి తెప్పించాడు. చక్రవర్తి దడుచుకొని.....
ఇప్పటికి వారం.
ఆ ఎఫ్ఫెక్ట్‌లోంచి చక్రవర్తి ఇంకా బయటికి రాలేదు.
దడుపు జ్వరం.
గమనిక: ఫెంటాస్టిక్.. మైండ్ బ్లోయింగ్... అన్‌బిలీవబుల్... అంటూ చక్కగా బంగారంలాగా మహేష్‌బాబు దూకుడులో అరిచినట్లు మేంకూడా మీడియాలో చెబుతుంటాంకానీ జనం నమ్మరనుకుంటా. అందుకే మా చానలెక్కడుందో మా చీఫ్‌కే అర్థం కాలేదన్నాడు.

3 వ్యాఖ్యలు:

జ్యోతి said...

సుజాతగారు మీ చానెల్ కబుర్లు మాత్రం సూపర్ గా ఉన్నాయిండి. కాదు కాదు చెప్తున్నారు. ధాంక్స్..

జ్యోతిర్మయి said...

సుజాత గారూ..చానళ్ళ మీదు మీ చెణుకు బావుంది.

Anonymous said...

సుజాత గారు ఇలా ఇంటిగుట్టు బయటపెట్టేస్తేస్తున్నారు మీకేం సమస్యలు రావా ( మాకు మాత్రం భలే ఎంటర్టైనింగా ఉంది ) చాలా మంది మీడియా వాళ్ళు బ్లాగులు రాస్తున్నారు కానీ అవన్నీ ఇంత ఓపెన్ గా వుండవు . ఏమైనా మీ కబుర్లు చాలా బావున్నాయండీ . మిమ్మల్ని ఇలా కలవటం సంతోషంగా వుంది