Friday, September 30, 2011

పర్లేదు ఆ పిల్లకి విడాకులిచ్చెయ్...

'మీ ఇంటికి ఫోన్‌చేస్తే ఎవళ్ళూ లిప్ట్ చేయలేదనీ అడిగాను మా ప్రొడ్యూసర్‌ని. 'అవసరమైతే ఎస్ఎమ్మెస్ పెట్టాలి. ఏనిమిషాన్నయినా జీ టీవీనుంచో, ఈటీవీనుంచో కాల్ వస్తుందని వెయిటింగ్. తెలిసిన నంబర్లు తీయదూ అన్నాడతను. మా పక్క ఫ్లాటే వాళ్ళది. ఆ అమ్మాయి నాకు బాగా క్లొజ్. 'ఆవిణ్ణి ఎమైనా అంటే మీరు ఊరుకోరుకానీ మేడం, ఇవ్వాళ మధ్యాన్నం తిండికివస్తాను, బయటంతా బంద్, ఎక్కడా ఏమీ దొరకలేదు, నాకూ ఏమైనా వుంచండి అని చెప్పాలని ట్రై చేస్తున్నా.. ఫోన్ వాడదట.. రాత్రే అనౌన్స్‌మెంట్. ఏదో వుంది మేడం విషయం. ఫీల్డ్‌లో వున్నానా.. నాకు ఒక్క ప్రొడ్యూసర్ తెలియదు. నీ ఇల్లు బంగారంగానూ ప్రొడ్యూసరూ... మోడ్రన్ మహాలక్ష్మి గాడూ.. గడసరి అత్తగాడూ.. ప్రతివాడూ ఈవిడ కాంటాక్ట్‌లో వుంటారు. అప్పుడోసారి ఎస్ఎమ్మెస్ కాంటెస్ట్‌లో ఈవిడకో వెండి గ్లాస్ వచ్చింది, దానికోసం చానల్‌చుట్టూ తిరిగానే.. మొదలూ.. ఇక అడ్డమైన ప్రోగ్రాములూ.. ఎస్ఎమ్మెస్ రిక్వెస్ట్‌లూ.. దానికి అన్నం నీళ్ళూకూడా అక్కరలేదు. సారీ.. ఆవిడని దాన్నీ అన్నందుకూ అన్నాడు నిష్టూరంగా మా ప్రొడ్యూసరు. దొంగకి తేలుకుట్టడం అంటే అర్థమైంది నాకు. సమాధానాలు నా దగ్గరే వున్నాయి. ఈ నెల ఆ పిల్ల ఫోన్ బిల్లు పద్దెనిమిది వేలు. ఇంకా ఈ అమాయకుడికి తెలీలేదు. ఫోన్ కొట్టు లక్ష పట్టుకి వరుస పెట్టి కాల్స్ చేసింది. ఒక్కో కాల్ ఆరు రూపాయలు. ఇప్పుడు నా ఫోన్ ఎందుకనుకున్నారూ మోడ్రన్ మహాలక్ష్మికి సెలెక్ట్ అయ్యానూ.. ఇప్పుడు టీవీలో వస్తున్న యాంకర్ కట్టుకొన్న చీర నా కోసం తెచ్చేయండీ.. బిల్లు కట్టేద్దాం, రేపు ప్రొగ్రాంలో కట్టుకోవాలని నాకో హుకుం. చేతిలో ఫోనుందికదాని జ్వువెలరీతోసహా చీరకు బిల్లు పెట్టండీ అని కాస్ట్యూమర్‌కి చెప్పేశాను. పది నిముషాల ముందే చీరా నగలూ ఇంటికి వచ్చాయి. బిల్లు పదహారు వేలు. ఈ విషయం చెబుదామనే చూస్తుంటే మా ప్రొడూసర్ ఆక్రోశం వినబడింది. 'అసలు ఈవెర్రి ప్రోగ్రాములు చూడటం, ఎస్ఎమ్మెస్‌లూ, పైగా మా ఆయన మన చానల్ హెడ్ అని చెప్పిందట. నా ఉద్యోగం ఊడినంత పనయింది. ఇవ్వాళ నేను కొంపకు చేరాక ఆ టీవీ కనెక్షన్ తీసేయిస్తాను, లేకపోతే అమ్మేస్తాను. ఇంకా ఈవిడ నోరెత్తితే విడాకులు ఇచ్చేస్తాను. లేకపోతే ఫోన్ తియ్యదు.. ఒక్కో అక్షరం వెతుక్కుని ఎస్ఎమ్మెస్ పెడుతున్నా. నాకు తిండి కావాలి, వండుకున్నవన్నీ తినేయద్దూ' అని ఏడుపు గొంతులోకి దిగిపోయాడు మా ప్రొడ్యూసర్. ఓదారుద్దాం అనుకొనేలోపలే ఆ అమ్మాయి లైన్‌లోకి వచ్చింది. 'గడసరి అత్తకి సెలెక్ట్ అయ్యాను మా అత్తగారు ఇక్కడ లేదుకదా.. మీ పేరూ.. మనిద్దరం వున్న ఫోటో పంపేసాను, ఎల్లుండే ప్రొగ్రాం, మా అత్తగారిగా మీరు కరక్ట్‌గా సరిపోతారూ, అందా అమ్మాయి. కాగితాల కిరీటాలు పెట్టించుకోవడం, రికార్డింగు డాన్సులేయటం కళ్ళ ముందు ఆ కార్యక్రమం సెవెంటీ ఎంఎంలో కనబడుతుంటె నిముషంకూడా అలోచించకుండా మా ప్రొడ్యూసర్కి మెస్సేజ్ పెట్టేసాను 'పర్లేదు ఆ పిల్లకి విడాకులిచ్చెయ్, నెనో మంచి లాయర్‌ని చూస్తానూ అని.

Thursday, September 29, 2011

ప్రస్తుతం ఖాళీ...

ఈ మధ్య కధలెందుకో ఊరికూర్కెనే మధ్యలోనే ఎండయిపొతున్నాయి. సాహిత్యరచనే జీవితంగా, ఊపిరిగా, అన్నంగా, బిసిబెళిబాత్‌లాగా ఉండాలనుకుంటుంటే.. ఎందుకు ఇలాగయిపోతుంది...? ఒక కధ మొదలు పెట్టాను. మంచి భార్యాభర్తలు. మంచంటే ఏమిటీ అని క్వచ్చన్ ఎదురుగ్గా. సమాధానం చివరి పేజీలో అనుకొని, సరేమరి ఆ భార్యాభర్తలు అన్యోనంగా ఉంటారని ఊహించే లోపల.. మరి అన్యోనం అంటే మళ్ళీ క్వచ్చన్. ఎవ్వళ్ళో ఒక్కళ్ళ మాటే ఇంకొకళ్ళు వినటం అని తోచింది. సరేపో... ఆ మంచి భార్యాభర్తలకి తగవచ్చింది. మాట ఎప్పూడూవినే మనిషి వినకపొతే వచ్చె తగవది. ఇద్దరిమధ్య బొలెడన్ని తగవులు పెడుతూ కధ రాసుకుపోవచ్చు అనుకొంటే ప్రతి తగవులోనూ వినే మనిషి ఓడిపోవడమే. నా ఇల్లు.. నా సంపాదన.. నా ఆస్థి.. నా రెండో పెళ్ళాం.. దిక్కున్నచోట చెప్పుకో.. పోతేపో.. ఇంకేముందీ.. వినే మనిషికి భయమేసింది. హాయిగా వింటేపోలా.. వెధవ ఉద్యోగాలు చేయాలి.. పిల్లల్ని ఖష్టపడి పెంచాలి. చందనాబ్రదర్స్, ఆరెస్‌బ్రదర్స్, సిఏమ్మారూ.. ప్రసాద్స్‌సూ.. హైద్రాబాద్ బిర్యానీ.. పిజ్జాలూ .. ఏవీ వుండవు. ఏం తగవులేద్దూ.. ఒక నిముషం ఊరుకొంటే వాడే పదింటికెల్లా పోతాడు. రాత్రి తొమ్మిదింటికెప్పుడో ఊడిపడతాడు. ఓ అరగంట కూడుపెట్టి మర్యాదచేస్తె సరి. అని వినేమనిషి నేను వద్దన్నా కాంప్రమైజ్‌కి మైండ్ పెడుతోంది. ఇంకేంవుంది.. కధయిపోయింది. సరే ఇంకోకధ. ఈసారి హీరోపైనే బేస్ చేద్దామనిపించింది. ఓ హీరో.. రవితేజ.. కిక్ కావాలి జీవితంలో.. యహె.. సినిమా కధకాదులే వేరే నా కధ. పరుగెత్తుతోంది. చదవాలి.. చదవాలి.. చచ్చేలా చదవాలి. చదివీ.. చదివీ.. అబ్బో కిక్కులేదు. సరె.. ఉద్యోగం.. చెయ్యాలీ.. చెయ్యాలీ.. చచ్చుకుంటూ నెలజీతం లక్షకోసం చెయ్యాలి. కళ్ళు వాచిపొయేలా సిస్టంకి అతుక్కుపోవాలి. కిక్కు.. అబ్బే.. అబ్బే.. పోనీ.. లవ్వూ.. ఓరిదేవుడో.. నిముష నిముషం అట్టెండన్సూ.. మెస్సేజులూ.. ఫొనులో ప్రేమ.. ప్రసాద్స్‌లో ప్రేమ.. ఒట్టి ప్రేమేనా.. ఒక్కో ప్రేమకు కనీసం రెండు వేలు. పైగా సినిమా మధ్యలోపోయి కూల్డ్రింకులూ.. కాఫీలూ.. అదేం కర్మో.. మల్టీప్లెక్సుల్లో యభైయేసి షాపులూ.. వావ్ బాగుందే అనగానే కొనతాలూ.. ఇంకో పదివేలూ.. వారానికి ఒక ప్రేమ చాలనిపించాక.. పోనీ పెళ్ళాడితేపోలా అనుకొంటే.. రొటీన్ మంత్రాలూ.. కాళ్ళు పడిపోయేలా రిసెప్షనూ.. హమ్మయ్యా.. ఆఖరాఖరికి ఫస్ట్ నైట్. కిక్కు లేదంటాడే హీరో.. జీవితాంతం పై మొత్తం పనులు చేస్తూనే.. చేస్తూనే ఉండాలని తలుచుకుంటే నడుం పీకేస్తుంది. కిక్ అంటే వాంతొస్తుంది అని హీరో పరుగోపరుగు. రెండో కధ అలా అయిపోయింది. మూడో కధ. తలుచుకొంటేనే కన్నీళ్ళొస్తున్నాయి. మీడియాపైన గాలిదుమారం రేపే సెన్సేషన్ కధ మొదలెట్టాను. నమ్మండి. ఒక్క సియివోను వెదికానంతే. ఇంకేంకధ. ఆ సియివో మొత్తం తనే. ఎవరెలా వుండాలో.. ఎవరెలా నవ్వాలో.. ఎంత తూకంగా.. నమ్రతగా వుండాలో మొత్తం... చక్రి సర్వోపగతుండు.. ఇంకేం కధ..? ఎలా నడపాలో తనకే తెలుసని నోరుమూసుకోని పొమ్మన్నాడు. ఇప్పటికి ఆరు నెలలు.. కొత్త కధకి థాటొస్తే ఒట్టు.. ప్రస్తుతం ఖాళీ.

Wednesday, September 28, 2011

నెరుసు అంటే...

జగ్గాపురం మా అత్తగారి ఊరు. ఆ ఊరిలోనే పుట్టి పెరిగింది నా తోడికోడలు. ఆవిడ వాడిన పదం ఇది. అక్కడ వాడుకలో వున్న పదం. ఇదివరకూ కర్రల పొయ్యిపైన వంట చేసేవాళ్ళు. మంట ఆరిపొయాక పొయ్యిలో కొన్ని కర్రలు కాలితే మిగిలే బొగ్గులుండేవి. కణ కణమని మండుతూ కనిపించే ఆ బొగ్గులుపైన నెమ్మదిగా బూడిద కప్పువేసేది. ఎవరైనా పొరపాటున బూడిద అనుకొని చేయి పెడితే ఆ చిన్ని నలుసంత నిప్పు కణం చేయి చురుక్కుమనిపిస్తుంది. అదే నలుసు అంటుకుని మళ్ళీ మండచ్చుకూడా లేదా.. ఎవ్వరూ పట్టించుకోకపోతే నిర్లిప్తంగా బూడిదై చల్లారిపొవచ్చుకూడా. ఇది ఆడవాళ్ళకు చాలా బాగా వర్తిస్తుంది అనిపించింది. ఒక్క చిన్ని నెరుసు.. నిప్పు రవ్వ.. నిస్సహాయంగా బూడిద క్రింద చల్లారిపొబొయే ఆ కణం ఎవరైనా కెలికితే చేయి కాల్చదా..? నెరుసు మా తోడికోడలు సృఇస్టియోమోకాని నన్ను వెంటాడి వేధించిందాపదం. ఒకప్పుడు నా వెనకాల నా చూట్టూ చాలామంది ఆడవాళ్ళు వుండేవాళ్ళు. చలం రచనల్లోంచి వీరేశలింగంగారి ఆత్మ కధల్లోంచి, ఫెమినిష్టుల రచనల్లోంచి ఎంతోమంది ఆడవాళ్ళు తమ నిస్సహాయత పట్ల అంతులేని కోపంతో వుండే ఆడవాళ్ళ వరసలో నెనూ వున్నాననిపించేది. నా కధల్లో గొంతులన్నీ అవే. తెల్లని బూడిద క్రింద నిర్లిప్తంగా పడున్న బొగ్గు రవ్వ ముట్టుకొంటే చేయి చురుక్కుమనిపించిన అనుభవం నా వేళ్ళ చివరనే వుంది. ఆ నెరుసు గాలికి ఎగిరి ఏ పాకపైన పడ్డా మంటలు లేవటం ఖాయం. ఆడవాళ్ళంతా వాళ్ళ జీవితాల్లో నింపుకొన్న నిర్లిప్తత నుంచి లేచి మంటల్లో ఎగిసిపడాలని నా కోరిక. నేను రాయటం మొదలుపెట్టిన ఏ ముప్పైయేళ్ళలో నా ఆశ చాలావరకూ నెరవేరింది. కానీ ఎక్కడో ఓ చిన్న అసంత్రుప్తి.. ఇంకా గమ్యం చేరలేదని. నేనూ చాలా నడిచాను. ఎలా వుంటే బావుంటుందో.. ఏం చేయాలో చేసికూడా చూపించాను. ఇంకా నా బాధ్యత ఏదైనా మిగిలివుంటే అది నేను సెలవు తీసుకొనేదాకా గమ్యంవైపు నడుస్తూనే వుండడం.

Saturday, September 24, 2011

మనం నిమిత్త మాత్రులం!


అబ్బే అనిపించిందా.. వైరాగ్యం, నిర్లిప్తత, దేవుళ్ళు, దయ్యాలు, నమ్మకాలు.. ఈ లిస్ట్‌లోకి ఈ మాటకూడా వస్తుందనుకోండి.. ఈపాటికి ఇంకేం చదువుతాం లెద్దూ అనికూడా అనిపించిందా.. వద్దొద్దు మిస్సయిపొతారు.. ఎలా నిమిత్త మాత్రులమో తెలుసుకో వద్దూ.. ఇల్లాగే. మనిష్టం వచ్చినట్లు రాసుకొంటూపొయి, డైరక్ట్‌గా పెజీల్లో ఇచ్చేస్తూ.. అది డైరక్ట్‌గా పాటకులకు వెళ్ళిపొతూ.. ఎంతో జాయ్‌గా వుంటాంకదా. అలాంటిది ఒక అటాక్‌తొ నేను ఎలక్ర్ట్రానిక్ మీడియాలో వచ్చి పడ్డాను. మీడియా ఎదైనా ఒకటే.... చచ్చినా కాదు.... మన తలకాయలోంచి, పేజీల్లోంచి, పాఠకుల హ్రుదయాల్లోంచి పొయే దారి చటుక్కున మూసుకుపోయి.. యాంకర్ల మూడ్‌పైన, ప్రొడక్షన్ మేనేజర్ దయాధర్మాలపైన, షూటింగ్ కోసం మనకు కేటాయించిన కారు తాలూకూ డ్రైవరు, మేకప్‌మెన్, హేయిర్‌డ్రెస్సర్, క్యాస్టూంస్, చివరకు మనం నమ్మి, ప్రేమించి, ఇష్టపడి తీసుకొన్న డైరక్టర్కి ఇంట్లొ ఎలాంటి ప్రాబ్లంస్ రాకూండా చేయకుండా చేయమని మనం ఏడుకొండలవాడికి మొక్కినా స్ట్రాంగ్ మొక్కుపైన కూడా ఎలక్ర్ట్రానిక్ మీడియా వుద్యొగం వణుకుతూ, క్షణక్షణం బీపీ పెంచుతూ, మనకు వినయం నేర్పుతూ, మన గోళ్ళ వరకూ మాత్రమే మనం తినే చాకచక్యం అలవర్చుతూ వుంటుంది. ఇక్కడ మనం నిమిత్త మాత్రులం. మనం 10 గంటలకు ఎక్కడో దిల్సుఖ్‌నగర్‌లో ఏ కవి యాకూబ్ ఇంటిలోనో, మంతెన సత్యనారాయన్నో నాలుగు ముక్కలు మాట్లాడమని డిసైడ్‌చేసి 8 గంటలకే ఆఫీసుకు వస్తాం. ఎగ్జాక్ట్ 10.30 అని ధైర్యంగా, తెలియక చెప్పేస్తాం. తీరా ఆఫీసులో అడుగు పెట్టెసరికి అప్పటికి తయారై కారెక్కాల్సిన సుభాషిని.. హెయిర్ డ్రెస్సర్ జుట్టు స్ట్రెయిట్ చేస్తుంటే తీరిగ్గా ఫొన్లో మాట్లాడుకునే పనిలో వుంటుంది. కెమేరామెన్, అసిస్టెంట్, లైట్‌బాయిస్ , టిఫిన్ తింటేగానీ ఎలాగూ బయలుదేరంకదా అని.. క్యాంటిన్లో సెటిలై వుంటారు. ప్రొడక్షన్ మేనేజర్ ఇప్పుడే బయలుదేరాను మేడం అని ఫోన్ స్విట్చాఫ్ పెట్టేస్తాడు. కారుంటుంది, డ్రైవరు కనిపించడు. కాస్ట్యుంస్ అతను ఇప్పుడే నీరూస్‌కి వచ్చాను, డోర్ తీయలేదు అంటాడు తాపీగా. ఏదో ఒకటి, ఎలాగోలా ముగించి రావోయ్ సుభాషినీ అన్నామా .. సరైన మేకప్‌లేక, డ్రస్సులు రాకా, మనం తొందరపెట్టి విసుక్కోవటంవల్లా మూడాఫ్ అయిపోయి, కళ్ళనీళ్ళోచ్చి, మేకప్ చెడిపోతుందన్న భయంతో, మనసు మూగభాధకులోనై, నేనీరోజు వచ్చినా సరిగ్గా ప్రోగ్రాం చేయలేకపొతాను అన్న అల్టిమేటం నా మొహాన్ని విసిరేసి సరిగ్గా పదింటికి టిఫెన్ మింగేందుకు క్యాంటిన్‌కి నెమ్మదిగా నడచి వెళుతూవుంటే.. అలా చూస్తూ వుండిన క్షణాన మంతెన సత్యనారాయణ ఫోన్ చేసి, నేనూ నా లేహ్యాలూ రెడీ అన్నాడనుకోండి.. అ క్షణాన 'మనం నిమిత్త మాత్రులం' అని నాకు అనిపించడం తప్పెనంటారా..?

Wednesday, September 21, 2011

మనం ఏం మాట్లాడినా..

మనం ఏం మాట్లాడినా ముందు మనకు నచ్చుతుంది. అన్న షర్టేస్తే మాస్ .. అన్న మడతేస్తే మాస్.. అని ఓ పాటలాగ తెలిసో తెలియకో లొలోపల మనం కూడా అలాగే వుంటాం. ఒక్కోసారి ఆ గర్వం దాచుకొని కాస్త వినయం నటిస్తాం. మనం పెట్టే ఆ వినయం మొహంలో దాచుకోలేని చిరునవ్వులో కనిపిస్తూనే వుంటుంది. ఇప్పుడు 'మనం' అంటూ నేను రాస్తున్నప్పుడు కూడా.. ఓసారి విజయవాడ ఏఐఆర్ స్టుడియో లో ముందర లాంజ్ లో కూర్చుని వున్నాను. వున్న సొఫాలూ చైర్లూ నిండిపొయి వున్నాయి. నా ప్రక్కనే ఎవరో నిలబడ్డారు. బహుశా నేను కాళ్ళు వూగిస్తూ నాప్రక్కనున్నాయన వంక ఒకటికి రెండు సార్లు సందేహంగా చూస్తూ , నేనూ రేడియో స్టేషన్లో రికార్డింగ్ కే వచ్చానన్న సంకేతాలిస్తూనే వుండి వుంటాను. ఉన్నట్లుండి నా చైర్ ప్రక్కన నిలబడ్డ ముసలాయనా, ఆయన చేతిలో జనపనార సంచీ ఎక్కడో తెలిసినట్లు అనిపించింది. వెంటనే మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది అన్నాను. ఆయన నా వంక చూసి .. చూసావా.. నన్ను వావిలాల గోపాలక్రిష్ణయ్య అంటారులే. కాళ్ళు వూపటం మానేసి లేస్తే నేను కూర్చుంటానన్నారు. నా మొహం ఎలా పెట్టివుంటానో, ఆయన ఏఐఆర్ నుంచి వెళ్ళిపొయేదాకా ఆయన వెనక్కాల ఎలా తిరిగి వుంటానో వూహించండి!

Monday, September 19, 2011

సి.సుజాత కబుర్లు: హాయ్..

సి.సుజాత కబుర్లు: హాయ్..: నేను సుజాత. తెలుసు కదా. చెప్పటం, రాయటం.. నా ఉద్యొగమే కబుర్లు. రాయటానికీ, కబుర్లు చెప్పటానికీ పెద్ద తేడా వున్నట్లు లేదు కదా. కానీ మనం ఎలాగోలా...

Sunday, September 18, 2011

ఆప్తులంటే.. వీళ్ళు!

విజయవాడలో నవోదయలో అడుగుపెడుతుండగానే.. మీకు కోత్త ప్రపంచాన్ని ఇచ్చిన మనిషి వెళ్ళిపొయాక వచ్చారేం అన్నారు రామ్మోహనరావుగారు. సుప్తభుజంగాలు నవల ముందు మాట రాస్తూ..బండెడు చెత్తలొ ఒక మాణిక్యం మెరిస్తే ఎలా వుంటుందీ..? కళ్ళు జిగేల్ మనవూ.. బురద మడుగులో ఒక పద్మం విరిస్తే ఎలా వుంటుందీ..? మనసు పరవశించదూ. అటువంటి అరుదైన మాణిక్యాల్లో, పద్మాల్లో ఒకటి సుజాత సుప్తభుజాంగలు. ఈ నవల, రచయిత్రి మొదటి నవల కావటం విశేషం.. అంటూ సాహితీ ప్రపంచానికి నన్ను పరిచయం చేసి, నా ఉద్యొగ జీవితానికి రహదారి వేసిన నండూరిగారు కనబడకుండా పొతే ఏం మట్లాడటం.. ఇంకాస్త ముందెళ్ళిపొయిన మహీధర రామ్మోహనరావుగారు, యేటుకూరి బలరామమూర్తిగారు, ఇప్పటికి విజయవాడ నుంచి పలకరించే పరకల పట్టాభిరామారావుగరు కంకణం కట్టుకొని నా వునికి ప్రపంచానికి యెలా చాటారో.. తలో చేయివేసి ఎలా ముందు నిల్చోబెట్టారో.. ఎంత చెప్పాలి..? యే బాంధవ్యంతో అంటే.. సరిగ్గా.. మనిషికి మనిషికీ వుండవలసిన అనుబంధంతో. కాసేపు పుస్తకాల వంకా, కాసేపు రొడ్డువైపు దిక్కులు చూస్తూ కూర్చుంటే.. నేనింకో పదేళ్ళు పర్లేదా.. అన్నారు రామ్మోహనరావుగారు. ఆ ఓదార్పుకి ఏం మాట్లాడాలి..? పొయినోళ్ళు అందరూ మంచొళ్ళు.. ఉన్నొళ్ళు పొయినొళ్ళ తీపిగుర్తులు.