Thursday, May 30, 2013
ఒక
దీపం నీ వెనగ్గా
కదలకుండా..
పెదవి కదపకుండా నువు
ఎలా
వచ్చావో.. ఎలా వెళ్ళిపోయావో..
రెంఢూ
ప్రశ్నార్ధకాలే
దీపం
గాలికి రెపరెప లాడింది
ఉలిక్కిపడి
చేయిచాస్తావేమో ననుకున్నా
నేనొచ్చినా
చిన్న నవ్వయినా లేదు
పలకనందుకూ..
పడుకుండి పోయినందుకూ
నీ
చుట్టూ సమూహాలు చూస్తున్నాసరే
ఎంతలా
అరిచానంటే
నువు
విననట్లే వున్నావు మరి
ఎన్నిసార్లు
అలా నిర్లిప్తంగా లేవు నువు
జీవితం
మొత్తంగా ఎన్నిసార్లు
నే
కన్నీటి సంద్రమయినా
అందులో
నువు మునుగుతూ తేలుతున్నావని
నాకు
ఖాయంగా తెలుసు
అందుకే
నా ఏడుపుని నీ చేతుల్లో పెట్టేను తప్పించి
మిగతా
భారమేదీ లేదు నాకు
ఇప్పుడు
చూశావూ.. నువు ఏ భారం
తీసుకోవని
తెలిశాకే అసలైన భయం
ఎప్పటికీ
నా భయాలన్నీ నేనొక్కదాన్నే
భరించాలన్న
భయం వెన్నులో పాకుతోందే అమ్మా..
నిజంగా
భయంగా వుందే
నాకు
తెలుస్తూనే వుంది నా చేతులు వదిలావని
వెళ్ళేముందు
నీ ఎదురుగ్గా నేను
చూపు
నిలవని కళ్ళతో నువు.. చూసింది నన్నేనా
లాక్కుపోతున్న
ప్రాణశక్తి నిలుపుకోవాలనే
నీ
తపన నన్ను తాకిన నీ చేయి చెపుతూనే వుంది
నాకు
తెలియదనుకొన్నావేమో
నీ
నొప్పిని నరనరానా నేను
అనుభవించలేదనుకొన్నావేమో
ఈ
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా
నువు
లేకుండా నేను నిలబడే క్షణం గు రించి
నాకు
భయం వేయదని నువ్వెలా తీర్మానించుకొన్నావే
ఈ
ప్రపంచం నాకెంత తెలుసనీ.. తెలిస్తే
గాలికి
ఎగిరిన నీ ప్రాణాన్ని అలా చేత్తో అందుకొనే దాన్నిగా
ఈ
ప్రపంచం నాకెంత పరిచయమనీ
నా
చుట్టూవున్న ఈ ఏ ఒక్క మనసునన్నా
ఒక్క
క్షణం చదవగలనా
ఈ
ప్రపంచం నా కెంత అనుభవమనీ
కొన్ని
వందల గంటలు నీ ఎదురుగ్గావున్నా
నా
కళ్ళముందే మాయమైపోతున్న
నీ
జాడ అణువంతయినా నాకు తెలిసిందా
ఈ
ప్రపంచం నా కెంత సన్నిహితమని
నా
కిష్టమైన నువ్వే చేజారినా నాకు కాస్తయినా
కబురు
అందలేదే
అమ్మా
అందుకే భయంగా వుందే
నేనిక్కడున్నా
ఎలాగూ మాయమౌతా
నే
కట్టుకొన్న చిన్నారి గూడు
నాది
కాకుండా జారిపోతూ
మన
చుట్టుబంధాలు ఎలా తెగి ముక్కలవుతాయో
నిన్ను
చూస్తూంటేనే తెలిసిపోయింది
నాదైనదేదీ
ఇక్కడ శాశ్వతంగా ఉండదని
నేనున్నదీ
నిజం
నేనెక్కడా
లేనిదీ నిజం
నాకు
హక్కులేని ఈ క్షణంలో నేనున్నాననీ తెలుసు
నువు
నవ్వుకొంటున్నావనీ నాకు తెలుసు
నిన్నే
లాక్కుపోయిన కాలం
నన్ను
మాత్రం ఎలా వదులుతుంది
ప్రయాణం
మొదలు పెట్టాను
త్వరలోనే
కలుస్తా
Thursday, May 23, 2013
Saturday, May 18, 2013
కొందరు కబుర్లు చెపుతుంటే... అదో
సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. పద విన్యాసాలూ, మాటల కూర్పులూ, పదాల కూర్పులూ ఎప్పటికప్పుడు కొత్తగా
ఉంటుంది. కబుర్లు చెప్పటం, సందేహం లేకుండా చక్కని ఆర్టే. ఒక చక్కని వ్యాసం
చదివాను. పోతన రాసిన భాగవతంలో వామనుడు బలి చక్రవర్తినుంచి మూడడుగుల నేలను దానంగా
తీసుకొన్నాక, భూమినీ ఆకాశాన్ని శరీరంతో కప్పిన వర్ణన
ఏ మూవీ కెమేరాలకు కూడా అందనట్లుగా ఉంటుంది.
ఆకాశాన్ని దాటి, మేఘరాసిని దాటి, తారాపథాన్నిదాటి, విశ్వమంతా తానే నిండివున్నాడంటారు పోతన. ఇది ఏ కంప్యూటర్
గ్రాఫిక్స్ కు అందుతుంది....? ఇలాంటి ఎన్నో ఉదాహరణలతో ఓ రచయిత్రి
చక్కని వ్యాసం రాశారు. చదువుతుంటే విశేషాలు తెలుస్తాయి. రకరకాల మాటలు ఉపయోగించటంలో
అవతలివాళ్ళ టెక్నిక్‌లు తెలుస్తాయి. ఇవన్నీ తెలిస్తే చక్కగా కబుర్లాడటం
తెలుస్తుంది. సో.. మనం చక్కని కబుర్లు చెప్పాలంటే చక్కగా చదవాలి. ఈ చక్కని ఊహ
చూడండి. కవికి అర్ధరాత్రి వేళ ఎందుకో మెలకువ వచ్చింది. కిటికీలోంచి, నిద్రజారని కళ్ళతోచూస్తే, చల్లని
తెల్లని ఎండలాగా అనిపించిందట. ఎండలో ఇంత ప్రశాంతత ఎలా వుందా అని ఆలోచిస్తుంటే, అది
అర్ధరాత్రివేళ కాస్తున్న వెన్నెల అని తేలిందట. నిశాదేవి కట్టుకొన్న నల్లని చీరెపైన తళుకుమన్న జరీపువ్వుల్లాగా నక్షత్రాలు
మెరుస్తుంటే, లోకమంతా చల్లని వెన్నెల వాన
కురుస్తోందట. దీన్ని వర్ణించాలంటే ప్రకృతిని ఎంతగా ప్రేమించాలి...? ఎంత ఉత్సాహభరితంగా జీవించటాన్ని నేర్చుకోవాలి....? రచయిత ఏమంటారో చూడండి. ఆరుబయట నిద్ర చలిగా, వెన్నెలగా వుంది. మంచు బొట్లు రాలే శబ్దం అన్నారు. మంచు బిందువు
చల్లగా ఆకు కొస నుంచి జారటాన్నివినటం ఎలాంటి అనుభూతి..! ఇంత ఉత్సాహాన్ని అనుభవించ గలిగితే,
చక్కని మాటల పందిళ్ళేయచ్చు. శ్రీశ్రీ గురించి కొత్తగా చెప్పే పనే లేదు. ఆయన ఒక
బాధని వర్ణించే తీరు ఎలా వుందో చూడండి. ఈ పాటకూడా వినేవుంటారు.
కూటి కోసం, కూలి కోసం
పట్టణంలో బతుకుదామని
తల్లి మాటలు చెవిని పెట్టక
బయలుదేరిన బాటసారికి
ఎంత కష్టం!
మబ్బుపట్టి గాలికొట్టీ
వానవస్తే, వరదవస్తే
చిమ్మచీకటి కమ్ముకొస్తే..
ఈ మాటలు పేర్చటంతోనే ఆ యువకుడి
పరిస్థితి మన కళ్ళముందు కదులుతుంది. వానలో, ఆకలితో, తల్లివేదనతో మనమూ తడుస్తాం. మాటలిలా
పేర్చగలగాలి. ఈసారి చక్కని పోయిట్రీ గురించి ఆలోచించండి. రాయటం అలవాటైతే కబుర్లు
వస్తాయి. కబుర్లు చెప్పాలనివుంటే, ముందుగా మాటలు పేర్చండి. మనం రాసే విషయాలు, మాట్లాడే మాటలు ఎంత ఆచితూచి ఉపయోగించాలో చూడండి. ఓ వార్త చదివాను. ఏం
రాశారంటే... 'సభ్య సమాజం సిగ్గుపడేలా పోలీస్
ఉద్యోగం చేస్తూ, భార్యను హింసిస్తున్న... . ఈ మాటలో ఎంత గందరగోళం వుంది...? పోలీస్ ఉద్యోగం చేస్తే సభ్య సమాజం సిగ్గుపడుతుందా అనిపిస్తుంది.
అసలు విషయం ఏమిటంటే.. బాధ్యతగల పోలీస్ వృత్తిలోవుంటూ సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించాడు అని రాయాలికదా. మనం కొన్నిసార్లు
అనాలోచితంగా మాట్లాడితే ఇలాంటి వ్యతిరేక అర్ధాలు వస్తాయి. ఓ చోట 'అటకెక్కిన గిరిజనుల భూమి పంపిణీ' అనివుంది. ఇంతకీ భూమి పంపిణీ అటకెక్కిందా, గిరిజనులు అటకెక్కారా..? భూమి పంపిణీ
అటకెక్కిందీ.. అంటే ప్రస్తుతానికే వాయిదా పడిందీ అనుకోండి. కానీ రాసినతను
అటకెక్కిన గిరిజనులు అన్నాడు. ఇలాంటివి ఎన్నెన్ని తప్పుల తడకలో. మన మాటలూ ఇలాగే వుంటాయి సరిగ్గా
మాట్లాడకపోతే. మన తెలుగు ఎంత అందమైన భాష.
ఎక్కడైనా ఓ కాలేజ్‌కి వెళ్ళి చూడండి. తెలుగే మాట్లాడు తుంటారు. ష కారం లేకుండా
ఉండదు. నీ పేరేమిటి అనడిగితే శైలజ కాస్త షైలజ అంటుంది. ఒకబ్బాయిని అడిగితే షామీ
అన్నాడు. నాకు అర్ధం కాలా. నాలుగుసార్లు విన్నాక అది స్వామి అని అర్ధం అయింది. ఇది
వరకూ ఇంగ్లీష్ కష్టపడి నేర్చుకొనేవాళ్ళు. ఎందుకంటే అది మన భాష కాదు కనుక. ఇప్పుడు
తెలుగు తిన్నగా నేర్చుకో అని చెప్పాల్సి వస్తోంది.
Friday, May 17, 2013
సినిమా కథలు బావుంటాయి. ముఖ్యంగా రాజులు, రాజ్యాలు,విఠలాచార్య కత్తియుద్దాల సినిమాలు టీవీల్లో చూస్తుంటాం. సరదాగా వుంటాయి. అవన్నీ కాల్పనిక కథలు. అందులో ఎక్కడా రీజనింగ్ వుండదు. ఓ పెద్ద దయ్యమో, రాక్షసో కనిపిస్తుంది. దానికి అస్సలు తెలివితేటలే వుండవు. వీపుపైన ఓ దెబ్బకొట్టినా భయపడుతుంది. మనకి నవ్వొస్తుంది. లైఫ్‌లో మనకి అందనివాటిని, మనం చేయలేని సాహసాలను అలా ముట్టుకోగలిగితే, లేని శక్తి మన చేతిలోవుందని వూహిస్తే కలిగే సంతోషం అది. రాజకుమారుడి వేషంలో ఎన్టీఆర్ కత్తియుద్ధంచేసి పాతాళమాంత్రికుణ్ణి ఓడిస్తే ఎంతసరదాగా వుంటుంది! ఒక సామాన్యుడ్ని, మంత్రాలొచ్చిన మాయగాడు తలుచుకొంటే పిల్లినో, బల్లినో చేయడా..? అయినా చేయలేరు. హీరోనే జయిస్తాడు. మనలో వుండే విజేతనవుదామనే కాంక్ష హీరోని గెలిపిస్తేనే వుంటుంది. అంతే కదండీ. వాస్తవం కంటే ఊహ అందంగా వుంటుంది. ఊహలాగా జీవితం ఉంటుందా...? సాఫీగా సాగుతున్న జీవితంలో ఏదో ఒక అలజడి రాకుండా వుండదు. చదువుకి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపారంలో హెచ్చుతగ్గులు కావచ్చు, ఎవరైనా స్నేహితుల నమ్మక ద్రోహం కావచ్చు, స్నేహంలో, బంధుత్వంలో, చివరికి భార్యాభర్తలు, బంధువులకుకూడా అనుకోని సంఘటనలు జరగవచ్చు. ఇలాంటి ఎదురు దెబ్బల్ని మనుష్యులు తేలిగ్గా తీసుకోగలిగితే బావుండు. కానీ అలా జరగదు. సక్సెస్‌ను ఆరాధించినట్లు, జీవితంలోకి ఆహ్వానించినట్లు ఎవ్వరూ ఓటమిని ఒప్పుకోరు. కానీ, గెలుపులాగే ఓటమినికూడా చేతిలోకి తీసుకోవటంలోనే అసలైన సరదా వుందనిపిస్తుంది నాకు. జీవితంలో ఛాలెంజ్ అనేది లేకపోతే ఇంకా థ్రిల్ ఏముంటుంది. కొందరిని చూడండి. కాస్త ఇబ్బంది ఎదురైనాసరే వెంటనే కుంగిపోతారు. స్నేహితులమధ్య, భార్యభర్తలమధ్య విభేధాలు రావటం సహజం. ఎదురు దెబ్బలు మనసుకి గాయం చేస్తాయి. నిజమే. ఆ గాయం మానక పోవచ్చు. అయితే కోలుకొనే దిశగా వెంటనే ప్రయాణం అవ్వాలి. ఎలాంటి ఇరకాటాన్నయినా ఎదుర్కోవాలి. జీవితం మొదటిలోనే ఎన్నెన్నో చేదు అనుభవలు ఎదుర్కొన్న విజేతలు మనకి ఎంతోమంది తెలుసు. రాజకీయాలు, క్రీడలు, కళలు.. ఇలాంటి వాటిల్లో మొదట తిరస్కరించబడి తర్వాత ఎదిగినవాళ్ళ గురించి మనం విన్నాం, చూశాం కూడా. మనిషి హృదయంలో ఓ పోరాడే శక్తి వుంది. దాన్ని వదులుకొంటే నష్టం. రేపటి పైన ఆశ వుండాలి. నేను దర్జాగా బతక గలననే ధైర్యం చాలా అవసరం. ఒక్కోసారి వృత్తిపరమైన ఇబ్బందులు వస్తాయి. కానీ ఓటమి ఒప్పేసుకొని, పరిస్థితుల నుంచి పారిపోవాలని చూస్తేనే ప్రమాదం. ఒక చిన్నచీమను చూడండి. అది ఎంతో కష్టపడి బుల్లి పంచదార పలుకును లాక్కుపోతూ వుంటుంది. ఆ పలుకు బరువు చీమకంటే ఎక్కువే. దాన్ని కష్టపడి కష్టపడి ఈడుస్తూ వుంటుంది. దాని ఆశ చూడండి. ఎలాగోలా ఆ ఆహారం దాచుకోవాలి. పాపం ఎన్నిసార్లు చేతులు నొప్పెడుతుంటే ఆగిపోతుందో. చీమకి అసలు చేతులుంటాయా అని డౌటొచ్చింది. గోడ పైకి ఎక్కి, జారి పడి, మళ్ళీ ప్రయత్నం చేసే చీమను శ్రద్ధగా చూశాను. దానికి చేతులు ఉన్నాయోలేవో కానీ, ఓర్పు మటుకు బోలెడంత వుంది. అది ఎక్కాలని ప్రయత్నం చేస్తుందికానీ, వెను దిరిగి పారిపోవాలని చూడదు. అంత చిన్న చీమలో అంత ఓర్పు, ఓపికవుంటే మనకెంత వుండాలి...? ఒక్కక్షణం ఆలోచించండి. ప్రతిరోజు, ప్రతి ఉదయం మనకోసమే వుందనిపిస్తుంది. ఎలాంటి గాయం అయినా ఒకటి రెండురోజుల్లో తగ్గుముఖం పట్టినప్పుడు, మనసుకి తగిలినగాయం మాత్రం శాశ్వతమా...? అయితే కాస్త సమయం తీసుకొంటుంది. లైఫ్‌లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. మనసు దాన్నుంచి మళ్ళించ గలగాలి. ఒక్కోసారి సంగీతంవింటూవుంటే మనసుకెంతో స్వాంతన అనిపిస్తుంది. ఇష్టమైన స్నేహితులను కలుసుకోవటంలో, పుస్తకాలు చదవంటంలో ఎంతో అలసట మాయమై పోతుంది. ఎవరో ఒక కవి వెలిగే దీపాన్ని ఆశతో పోల్చారు. మనిషి మనసులో ఆశ, దీపంలాగా వెలుగుతూ వుండాలని ఆయన భావన. బావుంది కదా. మన మనసులో దీపం మనకి తప్పకుండా వెలుగువైపు చూపిస్తుంది.
Thursday, May 16, 2013
ఈ
మధ్య సినిమా కథ ఎలా రాయచ్చో నేను కనిపెట్టా. మొదటి కిటుకు ఏమిటంటే వరసాగ్గా నెలరోజులపాటు టౌన్‌లో ఉన్న సినిమాలు మొత్తంచూసి
పడేయాలి. ఆ మానసిక స్థితి సినిమా కథ రాసేందుకు చక్కగా పనికొస్తుంది. ఇప్పుడు చూడండి. మనకీ జీవితంలో కాస్త ప్రేమకీ, త్యాగానికీ, వళ్లుమంటకీ, ఏడుపులకీ, మనదైన ప్రత్యేకత ఉంటుంది. సినిమాకు
ఇవ్వేమీ అక్కర్లేదు. మనం చూసే, వినే ప్రేమకథలు. ఒక్కమ్మాయి ప్రేమలో పడాలంటే మగపిల్లలు చాలా తంటాలు
పడాలి. బహుశా తనే ప్రేమిస్తూ వెంటపడుతున్నాడుకదా అని అమ్మాయిలు
మరింత గర్వంగా ఆకాశంవైపు చూస్తూ నడుస్తారు. కానీ సినిమా అమ్మాయిలకు ఇవేం
అక్కర్లేదు. స్పీడ్‌గా, ఇంకా మాట్లాడితే బైక్‌ని ఒక టైర్‌పైన
నడిపిస్తూ అమ్మాయిచుట్టూ గిర్రున తిరిగి, ఓ ఈలవేస్తే చాలు. అమ్మాయి పుస్తకాలు పారేసి డాన్స్ కు దూకుతుంది.
చూడండి. ఎంత టైమ్ కలిసివచ్చిందో. నేనీ విషయం
మా కొలీగ్‌కు చెపితే ఆయన చాలా
దిగులుపడ్డాడు. అనవసరంగా ఓ అమ్మాయి చుట్టూ రెండేళ్ళు తిరిగీ తిరిగీ ఆవిడ్ని కట్టుకొన్నాట్ట. మరి టైమ్ ఎంత వేస్టో కదా.
ఇంకో
ట్రిక్ చెబుతాను. ముష్టి పేదవాళ్ళ సెంటిమెంటు సినిమాతీయి, అదిరిపోయే లవ్‌స్టోరీ తీయి, తలకాయలో
ఎలాంటి ఆలోచనా లేకుండా ఐటమ్‌సాంగ్స్ తీయి, రీజనింగ్‌తో పనిలేదు. పది గాగ్రాచోళీలు,
పొట్టొపొట్టిగావుండే డ్రెస్‌లు కొనుక్కొంటే చాలు సగం సినిమా అయిపోతుంది. డాన్స్ లకీ
పెద్ద కష్టంలేదు. ఓ పదినిముషాలు సీరియస్‌గా కొన్నిసినిమాలు చూసి, ఆ మూవ్‌మెంట్లలో నచ్చినవి మనసులో కాపీ చేసుకొంటే చాలు. కొత్త డాన్స్. అసలు మనకు డాన్స్ అనేది
రాకపోయినా ప్లాన్ చేయచ్చు. ఈ మాత్రం దానికి డాన్స్ డైరక్టర్‌కూడా దండగ. డైరక్టరే తిప్పలు పడొచ్చు. సగం
సినిమా అయిందా. ఇంకా రెండు ఫైట్స్, క్లైమాక్స్ వున్నాయి అవీ చెప్తాను. సినిమా తీయటమంత ఈజీయెస్ట్ ఇంకేంలేదు. ఇప్పుడు క్రియోటివ్‌గా..
వద్దులేండి అంతమాటేందుకు. ఈ మాత్రం క్రియోటివిటీ ఏం అవసరం వుందీ. ఇందులో పెద్ద కష్టపడేది ఏదీలేదు. ఇరవైమంది
ఫైటర్స్.. బాగా తన్నించుకొంటారా? ఐదునిముషాల
ఫైటింగ్‌సీన్‌లో ఓ ఇరవైసార్లు పడండి. అంటే జంప్ చేస్తేచాలు. ఇక్కడ కాస్త క్రియోటివిటీ అంటే వాళ్ళు ఎక్కడెక్కడ పడతారో అక్కడ నీళ్ళొచ్చే పంపులూ, రెండుమూడు బురదగుంటలూ, పడగానే పైకి ఎగిరేలా టమోటాలు, నిమ్మకాయలూ వుంటే చాలు. గ్రాఫిక్స్
గురించి కాస్త ఓనమాలు తెలిస్తే చాలు. ఒకే ఒక ట్రిక్‌ని ప్లాన్ చేసుకొని, హీరోని ఐదంతస్థుల ఎత్తునుంచి,
పరుగెత్తే కార్లపైనుంచి, లారీల అడుగునుంచి బయటకులాక్కొస్తే చాలు.
ఫైట్ ఫినిష్. చూశారా. కథలు రాయటం ఎంత ఈజీనో. వారంరోజులు బండచాకిరీ చేశా, సెలవు
పూటన్నా, పిచ్చి ఆఫీస్ స్టాఫ్ గోలలేకుండా
మెదడు స్విచ్ ఆఫ్‌చేసి కళ్ళతో మాత్రం ఈ సినిమా చూద్దాం అనుకొనివచ్చే వేలాది మంది
సినిమా ప్రేమికులు ఈ దేశంలో కొదువా చెప్పండి. ఉండండి
తొందర పడకండి. ప్రతికథా కంచికి వెళుతుందా, లేదా. అలాగే ప్రతి సినిమా ఏదోరకంగా క్లైమాక్స్ కు చచ్చినట్లుగా
రావాలి. దీనికి అస్సలు కష్టంలేదు. తలాతోకాలేకుండా నడిపించే సినిమాని, ఆ రెండూ కలిపి ముడేయాలి. మధ్యలో అడ్డం
వచ్చిన పాత్రల్ని చంపి పడేసో, లేకపోతే
దేశాంతరాలకు పంపేసో, ఎలాగోలా వదిలించుకోవాలి. మిగతావాళ్ళు.. ఎందుకులేండి ఇంత పెద్దమాట. ఇంకెవరుంటారూ....
తల్లీతండ్రినీ వదిలించుకొన్నాం. ఫైటర్స్ ఆ పూటతోనే వాళ్ళదారి వాళ్ళు
చూసుకొన్నారు. హీరో వెనక్కాలతిరిగే పనీపాటాలేని ఐదారుగురు స్టూడెంట్స్, అనుచరులు, హీరో హీరోయినూ.వీళ్ళతో క్లైమాక్స్.
పెద్ద కష్టమా..! సెంటిమెంట్ సినిమా అయితే గుమ్మానికి వేలాడి, గాజుముక్క గుచ్చుకొని ఆవిడ స్పృహలేకుండా పడిపోతే, డాక్టర్లు మా వల్లకాదంటే, హీరో ఈలతో హీరోయిన్
కళ్ళు తెరిచేలా చేయచ్చు. ఇలాంటి ఐడియాలు మన దగ్గర ఒక కోటి వుంటాయి.
ఇంత
గొప్ప అవార్డ్ పిక్చర్ కథని, ఐదే
నిముషాల్లో రాస్తే మీరు షాకైనారా, లేదా. చివర్లో ఎవరైనా
ఇలాంటి గొప్ప సినిమా తీయదలుచుకొంటే ఒకే ఒక టెక్నిక్ అండీ. సినిమాకథ రాసిన మీకే పెద్దగా నచ్చకపోయినా పర్లేదు. డైరక్టర్ ఏడుపుమొహం పెట్టినా
లెక్కలేదు. డోంట్‌కేర్. అయితే ఒక్క నిర్మాతకు మాత్రం నచ్చాలి. గుర్తు
పెట్టుకోండి. ఆయనకే నచ్చాలి. మధ్యలో ఆయనకి పాపం కొన్ని డౌట్లు వస్తాయి. హీరో ఒకే
ఒక్కగుద్దుతో 20మంది నుంచి 90మందిని ఎలా తంతాడండీ. తలుచుకొంటే నాకు
చేతులు నెప్పుడుతున్నాయి అనేలోగానే ఆయన్ని కనికట్టుచేసి దృష్టి మళ్ళించగలగాలి.
అసలా.. ఆ ఫైట్లేనండీ మన సినిమాకు హైలెట్ అని వప్పించగలగాలి. ఈ టాప్ సీక్రెట్‌ని
దృష్టిలో పెట్టుకొన్నారా... సినిమా కథ రాయటం కాఫీ తాగినంత ఈజీ.
Wednesday, May 15, 2013
ఒక కవి, మాటలు గురించి ఎంత చక్కగా చెప్పారంటే.. ’కళ్ళు తెరిచినప్పటినుంచి చెవిఒగ్గివినాలనిపించే మాటలు ఐశ్వర్యప్రదాలు, జ్ఞానప్రదాలు, ప్రతిమాటకీ, అక్షరం అక్షరానికీ
కృతజ్ఞతలు‘ అన్నారు. నిజమే కదా. మాటలులేని, మాటలువినిపించని ప్రపంచం ఊహించటం కష్టం. ఉత్త కష్టంకాదు అసాధ్యం.
అసలు మాటలు ఎంత బావుంటాయో ఒక కథ చెప్పనా. ఇద్దరు జబ్బుగా ఉన్నవాళ్ళు ఓ హాస్పటల్‌లో
ఉన్నారు. ఒకతను లేచి కూర్చోగలడు, ఇంకో అతను మంచంలో ఉన్నాడు. లేచి
కూర్చొనగలిగిన రోగి, పడుకొనివున్న ఇంకో రోగికి తను
కిటికీలోంచి చూడగలిగిన ప్రతిదీ వర్ణిస్తున్నాడు. అటుగావెళ్ళే ప్రేమికులు, పెళ్ళిఊరేగింపులు, నడుస్తూ వేళ్ళే భార్యాభర్తలు, ఒకటేమిటి ఈ ప్రపంచంలోని చైతన్యం అంతా ఆ
కిటికీలోంచి చూస్తూ వర్ణించేవాడు. ఓ రోజు అతను చనిపోయాడు. పడుకొనివున్న రోగి తనకు
కిటికీ అవతలేముందో చూడాలని వుందని అడిగాడు. ఎందరన్ని అడిగినా ఒకటే సమాధానం. ఆ
కిటికీపక్కన ఏమీలేదు. తెల్లనిగోడ. లేవగలిగిన రోగి తనతోటి జబ్బుగావున్న రోగి
ఉల్లాసం కలిగించేందుకు కల్పించి చెప్పిన కబుర్లు. మంచంలో ఉండిపోయిన అతనికి ప్రాణం
పోసిన మాటలు అవన్నీ. మాటల గురించి ఒక రిపోర్ట్ చదివాను. దానిలో సారాంశం ఏమిటంటే.. ఆడవాళ్లు
సగటున రోజుకి ఇరవైవేల పదాలు మాట్లాడితే, మగవాళ్ళు ఏడువేలే మాట్లాడతారట. చూడండి విచిత్రం. ఆడవాళ్లు ఊరికే ఏదేదో మాట్లాడుతూ వుంటారనికాబోలు అర్ధం.
సాధారణంగా మాట్లాడే అవసరం ఆడవాళ్ళకే ఉంటుంది. పిల్లలతో మాట్లాడాలి. పెద్దలకు అన్నీ
అమర్చాలి. ఇంటాబయటా ఎందరెందరితోనో మాట్లాడితేనే పన్లవుతాయి. మా బంధువు ఒకాయన
మొత్తం రోజులలో ఒక్కమాటకూడా మాట్లాడటం నేనువినలేదు. అయినా వాళ్ళావిడ ఆయనకు సమస్తం అమర్చిపెడుతుంది. ప్రశ్న ఆవిడదే, సమాధానం ఆవిడదే. ఏమండీ.. భోజనం చేద్దామా అంటుంది. ఆయన ఆ.. ఊ.. అనడు. రండీ
ఒంటిగంటయిపోయిందీ అంటోంది మళ్ళీ. ఆయనలేచి భోజనం దగ్గరనోరు తెరుస్తాడు తినేందుకు.
అంతే. మరి రిపోర్ట్‌లు వస్తున్నాయంటే,
రావా. పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. అవునా, కాదా.
మాటలు సరిగ్గా ఉపయోగించగలిగితే అంతకంటే
శక్తివంతమైనవి ఇంకొటి ఏమీలేదు. ఒకళ్ళ ఇంట్లో ఒక చార్ట్ చూశాను. తెల్లని చార్ట్ పైన పొందికగా
రాసిన అక్షరాలు. మంచి మాటలు. వేదాల్లో పూర్వికులు, దయగల మాటలతో దానం చేయమన్నారు. ’సంతోషంగా, మనస్ఫూర్తిగా అర్హులైనవారికి దానం చేయండి. అది ఇతరులకు నువు చేసే
మేలుకాదు.. నీ విద్యుక్తధర్మం‘. ఆ రోజు ఆ ఇంట్లో నేను కూర్చున్న పది నిముషాలూ ఈ మాటలని
చూస్తూనే వున్నాను. మనం తరాలుకానుకగా డబ్బు, ఇళ్ళూ, ఆస్తులూ ఇవ్వాలనుకొంటాం. కానీ కానుకగా
ఇవ్వాల్సింది మంచి తనాన్ని, సంస్కారాన్ని. గుణాలు నిజంగా
సంతోషపెడతాయి. ఆ ఇంట్లో పిల్లలు గురించి ఓ నిముషం ఆలోచించాను. శుభ్రంగా, తెలివిగా సంతోషంగా వున్నారు. మనస్ఫూర్తిగా
ఇతరులకోసం ఏదయినా వీల్ళు ఇచ్చేయగలరు అనిపించింది. బహుశ నేనుచూసిన చార్ట్‌ని,
పిల్లలని పక్కనే కూర్చుని చూడటం వల్ల కావచ్చు. మొత్తానికి వాళ్ళంటి వాతావారణాన్ని
అద్భుతంగా మార్చేశాయి ఆ మాటలు. మరొక్కసారి
నేను చదివిన రిపోర్ట్ గురించి చెపుతున్నా. నాకెందుకో, ఈ స్త్రీ పురుషుల్లో తేడాలు కనిపెట్టే రిపోర్ట్లు నచ్చనేనచ్చవు. పోనీ
ఆ రిపోర్ట్ ఆరోగ్యానికీ, భావోద్వేగాలకీ సంబంధించిన రిపోర్ట్ లైతే
ఫర్వాలేదు. కేవలం ఎవరు తెలివైన వాళ్ళో నిరూపించే రిపోర్ట్ లపై మాత్రం ఎందుకింత
సమయం వృధాచేశారో ననిపిస్తోంది. స్త్రీ పురుషుల్లో ఎవరుగొప్ప అయితేనేముంది, మనందరం
ఎవరికివాళ్ళుగా ఎప్పుడూ లేము. అందరం కలిసే ఉండాలి. ఆ కలిసివుండటంలో ఒకళ్ళనొకళ్ళు
అర్ధం చేసుకోవాలని, సమానంగా వ్యవహరించాలని కోరుకొంటాం. ఎందుచేతనంటే సమానంగావుండే
సహజీవనంలో ఆనందం ఉంటుంది కనుక. వ్యక్తులు ఎప్పుడూ వాళ్ళ గుణాలవల్ల
గొప్పవాళ్ళవుతారుకానీ ఆడా మగా తేడాలవల్ల మాత్రంకానేకాదు.
Tuesday, May 14, 2013
మనం చాలామందితో కలుస్తూవుంటాం. తప్పకుండా కుశలప్రశ్నలు వస్తాయి. బావున్నారా.. ఉద్యోగం ఎలావుందీ.. కంఫర్టబుల్‌గావుందా అని. ఈసారి సమాధానాలు ఎలావున్నాయో గమనించండి. చాలామందికి ఎందుకో ఏవీ నచ్చవు. వెతికి వెతికి తీసుకొన్న అద్దె ఇల్లు నచ్చదు, కష్టపడి సంపాదించిన ఉద్యోగం నచ్చదు. జీవితం ఎప్పుడూ ఒక వెతుకులాటలాగే ఉంటుంది. ఎందుకిలా..? నేను ఇద్దరు అమ్మాయిలను కలుసుకొన్నాను. ఒకామె కాస్ట్ ఎక్కౌంటెంట్. వాళ్ళ భర్త చేస్తున్న ప్రాజెక్ట్‌లకు సహాయం చేస్తోంది. ఇంకొకామె కంపెనీ సెక్రటరీ.. చాలామంచి ఉద్యోగం.. కాస్ట్ ఎక్కౌంటెంట్‌గా పనిచేస్తున్న ఆమెకు వచ్చే జీతం చాలా తక్కువ. అదీ భర్త సొంత ఆఫీస్ కనుక బహుశ అసలేమీ ఉండకపోవచ్చు. కంపెనీ సెక్రటరీ అయితే ఏకంగా అప్పటికే మూడు ఉద్యోగాలు మారారు. కొన్నివేలరూపాయలు తేడా అంతే. అయితే స్థిమితంగా మాత్రంలేరు. తను ఇంకెంతో సంపాదించగలిగీ ఇలా ఉండిపోతున్నాననే దిగులుతో వున్నారు. కాస్ట్ ఎక్కౌంటెంట్‌కు .. తీరికలేదు. ఉద్యోగం, ఇల్లు ఇంతే. ఎంత డిప్రెషన్‌లో వున్నారంటే చదివిన చదువు వృధా. పైసా దొరకటంలేదు అన్నది ఈమె వాదన. వాళ్ళతో మట్లాడుతూవుండగానే ఇంకో అమ్మాయి వచ్చి చేరింది. పేరు వందన. చాలా ఇంటరెస్టింగ్ పర్సన్. ఈమె బాపట్ల వ్యవసాయవిశ్వవిద్యాలయం నుంచి పట్టా తీసుకొన్నారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో ఉంటున్నారు. కొన్ని కంపెనీలకోసం ప్రూట్‌ఫల్ఫ్ తయారుచేసి ఇస్తారట. కృష్ణాజిల్లాలోవిస్తారంగా పండే ఎన్నో పండ్లనుంచి గుజ్జు తయారుచేసి ప్రిజర్వ్ చేస్తారు. ఈమె వుండేది పల్లెటూరు. ఆమె చెప్పిన సమస్య ఏమిటో తెలుసా.. అస్తమానం కరంటు పోవటం గురించి. ఇదే సమస్య.
ఈమెకు ముందు నేనో మాట్లాడుతూవున్నవిధ్యాధికులు ఇద్దరూ ఎన్నో అసౌకర్యాల గురించి చెప్పారు. వస్తువుల ధరలు, ధరకు తగ్గ నాణ్యతలేకపోవటం,, కిరాయికి తీసుకొన్న ఇళ్ళల్లోవుండే ఇబ్బందులు, అసూయపరులైన చుట్టుపక్కలవాళ్ళు. ఈ ప్రపంచంలో ఒక్క విషయంకూడా వాళ్ళకు ఆనందం ఇచ్చినట్లు నాకు కనిపించలేదు. నా ఎదురుగ్గా కూర్చున్న వందన ఎలాంటి సౌకర్యంలేని ఆ పల్లెటూరు గురించి ఎన్నో కబుర్లు చెప్పారో లెక్కలేదు. ఆవిడ మాటలువింటూ నేను కృష్ణాజిల్లాలోని ఆ పల్లెటూరి రోడ్లపైన విహరించాను. ఎర్రమట్టినేల, జున్నుపాలు, అప్పుడేకోసిన కూరలతో భోజనం, వందన నన్ను చాలా ఊరించింది. మనిషికి కావలసింది ఏమిటో నాకు ఫజిల్ పూర్తిచేసినట్లు తేలింది. వసంత రుతువులో కోయిల మనల్ని అడిగి పాడదు. ఎప్పుడూ కష్టపడుతూ తేనెటీగ తేనే సంపాదించటంలోనే ఆనందిస్తుంది. మనం కేవలంవసంతరుతువునీ, వర్షగమనాన్ని ఆనందిస్తూ ఉండలేకపోవచ్చు. కానీ మనకోసంగావున్న ప్రపంచాన్ని ఆనందించి లేకపోవట నష్టంకదా.
చాలామందికి చాలా విషయాలు బావుండకపోవచ్చు. కానీ అలా బాగాలేనివిలైఫ్ కాదు. అవి చిన్నపాటి అసౌకర్యాలు. అంటే వందన అన్నట్లు ‘కరంటు విషయంలోమాత్రం చిరాకొస్తుందండీ. నేను పుట్టినప్పటినుంచి టౌన్స్‌లో పెరిగాను. కొన్ని సౌకర్యాలకు అలవాటు పడ్డాను. కానీ నేనీ పనిని చేతిలోకి తీసుకొచ్చాక మిగతా విషయాలవైపు దృష్టి పోనివ్వలేదు. నేను చదువుకొన్న చదువుకు దగ్గరగా వుండేపని ఇది. ఇంకా చుట్టుపల్లెలనుంచి, స్త్రీలసంఘాలు ఏర్పాటుచేశాం. తేనెటీగల పుట్టగొడుగుల పెంపకం ఇలాంటి చిన్నపాటి పరిశ్రమలు నెమ్మదిగా మొదలుపెట్టాం. కొన్నాళ్ళకు అందరిచేతుల్లో డబ్బులుంటాయి‘ అన్నది వందన. వాళ్ళ నాన్నగారు హైద్రాబాద్‌లో లీడింగ్ లాయర్. అమ్మ డాక్టర్. పుష్కలంగా డబ్బుంది. వందనకి ఆ పల్లెటూరు నచ్చింది. నాకు వందన చాలాచాలా నచ్చింది.
జార్జ్ మాసన్ యూనివర్శిటీ సైకాలజీ పరిశోధకులు జేమ్స్ మాడక్స్ చేస్తున్న పరిశోధనల ప్రకారం ’చక్కని తిండి, కాస్తో కూస్తో వ్యాయామం, కంటినిండా నిద్ర, డాక్టర్ చెకప్‌లతోపాటు రోజులో సాధ్యమైనంత సమయం మానసికంగా తృప్తిగా నిర్మలంగా బతకటంకూడా అవసరం. ప్రతి ఒక్కరూ జీవితంలో మనకు తృప్తినీ, ఆనందాన్ని, బాధనీ కలిగిస్తున్న అంశాలేమిటో గుర్తించి, చక్కని వృత్తి, చక్కని వ్యాపకం పెంచుకోవాలి. పనిలో ఆనందం అనుభవించాలి. మనం ఏంచేసినా తృప్తిగా చేస్తే నిండు నూరేళ్ళు ఖాయం‘ అంటున్నారు మాడక్స్. ఈ సందేశం చాలా బావుంది కదా. సంవత్సరం మొత్తంగా ఇలా తృప్తిగా వుండి చూద్దాం.
Monday, May 13, 2013
నేను ఇంతకుముందు ఒక టీవీ
కార్యక్రమానికి స్ర్కిప్టు రాసేపుడు, ఆ
కార్యక్రమానికి సంబంధించి చాలా ఉత్తరాలొచ్చేవి. చాలామంది ఉత్తరాల్లో పదే పదే ఆ
కార్యక్రమం చాలా బావుందని రాసేవారు. ఆ
ఉత్తరాలన్నీ ఒక వరసలోపెట్టి చూస్తుండేదాన్ని. ఆ ఉత్తరాల్లోంచి నేనువినగలిగే ఒక
చక్కని మెసేజ్ ఒకటుండేది. ఉత్తరాలలో ఒకేరకంగా 'బావుంది' అన్న మూడే అక్షరాలు కానీ, వాటిల్లోంచి నిశ్శబ్దంగా 'మేము కార్యక్రమం
మొత్తంగా చూస్తున్నాం. దాని నుంచి మాకు అందుతున్నది తీసుకొంటున్నాం. మా స్పందన
తెలియజేసేందుకు ఉపకరించేది ఈ మూడు అక్షరాలే'కదా అని. అందుకే ఆ ఉత్తరాల్ని కార్యక్రమంలో చదివేవాళ్ళం.
సాధారణంగా, ఒక్కోసారి మెచ్చుకోవటం, మనల్ని గుర్తు
తెచ్చుకోవటం కూడా చాలా అవసరం. ఎదుటివాళ్ళ గుండెల్లో, వాళ్ళు ప్రేమతో మన గురించి జ్ఞాపకం ఒకటి వుందికదా అని, ఆ తీయని అనుభూతికోసం అలాంటి ఉత్తరాలని
నేనెప్పుడూ ముట్టుకొంటూ వుంటాను. సాధారణంగా
చూడండి... మన సొంతిల్లయినా..
అద్దెఇల్లయినా దాన్ని శుభ్రంగా వుంచుతూ అందంగా అలంకరిస్తాం. అన్ని ఇళ్ళూ..
ఒకేలాగా ఉండకపోవచ్చు. అది పూరిల్లయినా సరే, ద్వారాలు.. కిటికీలు తెరిచి చల్లని గాలిని, వెలుతురిని ఆహ్వానిస్తాం. ప్రతిపండగకీ తోరణాలు కట్టి, తియ్యటి పిండివంటలు వండుతాం. బంధువులని ఆహ్వానిస్తాం. ఆహ్వానం అందుకొన్న అందరూ వచ్చి కాస్సేపు మన
ఇంట్లోవుండి, వెళ్ళేముందు ఓ మౌనసందేశం వదిలివెళతారు.
'మీ ఇల్లు బావుంది. నీ ఆహ్వానం బావుంది..
అభిమానం బావుంది. నీ ఇల్లు అచ్చం మా ఇల్లులా వుంది అని. ఆ కార్యక్రమం గురించి రాసిన
ఉత్తరాల్లోకూడా నాకు ఇదేవినిపిస్తుంది. ఆ కార్యక్రమ స్ఫూర్తితో ఎన్నెన్నో
నైపుణ్యాలు నేర్చుకొన్నామని రాసిన వందలాది ఉత్తరాల్లోకూడా ఇదేవినిపించింది.
సమయంలేక అందరినీ చూడలేకపోయం, కానీ మన దగ్గరకు ఉత్తరాలసుగంధం మోసుకువచ్చిన శుభసందేశం
ఇదే.
ఆ కార్యక్రమానికి వచ్చిన ఒక ఉత్తరం
గురించి చెబుతాను. ద్వారక రాశారు. బషీర్‌బాగ్‌లో వుంటారు. ఆవిడ రాసిన ఉత్తరంలో తన ప్రతి మధ్యాహ్నాన్ని ఎంత బాగా వర్ణించారో
చెప్పలేను. మధ్యాహ్నాం వాళ్ళవీధిలో పెద్దగా సంచారం వుండదు. కిటికీలోంచి కాస్తంత
వంగితే నందివర్ణనం, పచ్చని ఆకులు పలకరిస్తాయట. గాఢమైన
ఆకుపచ్చ రంగు, ఆకులమధ్యని గుండ్రని తెల్లని పువ్వులు,
వాటిపైనుంచి దూరంగాచూస్తే రోడ్డు..
అప్పుడప్పుడు వాహనాలు... వీటన్నింటిమధ్య నుంచి కనిపించకుండా రెక్కలు అల్లాడిస్తూ ఓ
తెల్లని హంస ఆవిడ చుట్టూ
తిరుగుతూ ఉంటుందట. ఆ హంస ఆవిడ కలల ఊహలు. ఆ
కిటికీ ఆవిడ ప్రపంచం. ఈవీథి
దాటితే నగరంలోకి అడుగుపెట్టవచ్చు. నాకేం పని ఉంటుంది..? నెలకో సారి ఇంట్లోకి కావలసిన సరుకులు తెచ్చుకోవటం తప్ప. అయినా
ఉదయాన్నీ, మధ్యాహ్నాలనీ, సాయంత్రపు చల్లదనాన్ని, నెలవంకనీ ఆమెకు
చూపెట్టే ఆ కిటికీ ఇవ్వాళ ఆవిడ మనోప్రపంచంపు
మహాగ్రంధం. కేవలం ఆ కార్యక్రమం వల్లనే
నాకీ దృష్టి కలిగింది. నేనిలా ఆలోచించానంటే దీనివల్లనే అన్నారామె. ఎలావుందీ ఉత్తరం?
వెతుకుతున్నదేదో నీటి సుసిరం, నీలిసరస్సులా నిశ్చలం. అవునా కాదా? మనం వెతికేది మన మనస్సుల్లోనేవుంది. కాకపోతే దాన్ని తెలుసుకొనేందుకు
సమయం పడుతుంది. ద్వారక ఒక చక్కని కిటికీ
తలుపు తీసి చూపించారు. ప్రతిరోజు చూసే నగరం నాకెంత కొత్తగా కనిపించిందో చెప్పలేను.
ఏ రోడ్డు కూడలిలోనయినా ఆగి చూడండి. ఒక పక్క మొలుచుకొచ్చిన పువ్వులు, ఫలభరితమైన తోటలుంటాయి. కూడలి, నాలుగు చేతులతో నగారాన్ని మోస్తున్న ఆదిశేషుడిలా ఉంటుంది.
సెలవురోజుల్లో పాతపుస్తకాల లైబ్రరీ అవుతుంది. ఇంకా ఎన్ని కనబడతాయో చూడండి.
పరుగెత్తుతున్న వేగాన్ని చూడచ్చు. ఆ వేగాన్ని చిటికెలో ఆపేయగల శక్తినీ చూడచ్చు.
నవ్వొస్తోందా...! పరుగెత్తే వాహనాల్ని ఒక్క చేతిసైగతో ట్రాఫిక్ కానిస్టేబుల్
ఆపేయ్యడా. ఆ రోడ్డుకి జీవం లేదు. కానీ మనందరంకలసి, పూలమ్మేవాళ్ళు, పండ్లమ్మేవాళ్ళు, నడిచేమనం, వాహనాల శబ్దం.. ఇవన్నీ కలసి ఆ రోడ్డుకి
చైతన్యం తెచ్చాం. జీవితానికి అంతే. నిత్య చైతన్యం మనమే. ఇంత వసంతాన్ని మనలోనే దాచుకొని, ఎప్పుడైనా, వడగాలిdస్తే.. వడగాలివంటి కష్టాలొస్తే రానీయండి. హాయిగా రెండుచేతులా
ఏదిదొరికినా తీసుకొందాం.
మనం జీవితాన్ని కవిత్వంతో పోల్చుకొందాం. కవిత్వం రాయటం ఇష్టం అని చాలామంది అంటుంటారు.
నిజంగానే ఏదయినా రాయటంమాత్రం గొప్ప అనుభవం. కవిత్వం రాయటమంటే 'ప్రపంచాన్ని మేల్కొపటం. ఎవ్వరూ లేవకముందు నువు నిద్రలేవటం' అన్నారోకవి. ఇంకా చీకట్లువిడిపోని నగరం మధ్యలో
నిలబడి అందరికీ హెచ్చరిక చేయటం. దానికర్ధం, నిద్రలేవండి, రాజీపడకండి, సరికొత్త జీవితాన్ని ఆహ్వానించండి అని చెప్పటమేగా.
కవిగారు అన్నట్లు కవిత రాయటమంటే మళ్ళీ మళ్ళీ పుట్టటం, కొత్త ప్రపంచానికి స్వాగతం చెప్పటం. ఏమంటారు?
Subscribe to:
Posts (Atom)