Saturday, May 18, 2013

చెప్పవే చిరుగాలి...


కొందరు కబుర్లు చెపుతుంటే... అదో సినిమా చూస్తున్న ఫీలింగ్‌ వస్తుంది. పద విన్యాసాలూ, మాటల కూర్పులూ, పదాల కూర్పులూ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. కబుర్లు చెప్పటం, సందేహం లేకుండా చక్కని ఆర్టే. ఒక చక్కని వ్యాసం చదివాను. పోతన రాసిన భాగవతంలో వామనుడు బలి చక్రవర్తినుంచి మూడడుగుల నేలను దానంగా తీసుకొన్నాక, భూమినీ ఆకాశాన్ని శరీరంతో కప్పిన వర్ణన ఏ మూవీ కెమేరాలకు కూడా అందనట్లుగా ఉంటుంది. ఆకాశాన్ని దాటి, మేఘరాసిని దాటి, తారాపథాన్నిదాటి, విశ్వమంతా తానే నిండివున్నాడంటారు పోతన. ఇది ఏ కంప్యూటర్‌ గ్రాఫిక్స్ కు అందుతుంది....? ఇలాంటి ఎన్నో ఉదాహరణలతో ఓ రచయిత్రి చక్కని వ్యాసం రాశారు. చదువుతుంటే విశేషాలు తెలుస్తాయి. రకరకాల మాటలు ఉపయోగించటంలో అవతలివాళ్ళ టెక్నిక్‌లు తెలుస్తాయి. ఇవన్నీ తెలిస్తే చక్కగా కబుర్లాడటం తెలుస్తుంది. సో.. మనం చక్కని కబుర్లు చెప్పాలంటే చక్కగా చదవాలి. ఈ చక్కని ఊహ చూడండి. కవికి అర్ధరాత్రి వేళ ఎందుకో మెలకువ వచ్చింది. కిటికీలోంచి, నిద్రజారని కళ్ళతోచూస్తే, చల్లని తెల్లని ఎండలాగా అనిపించిందట. ఎండలో ఇంత ప్రశాంతత ఎలా వుందా అని ఆలోచిస్తుంటే, అది అర్ధరాత్రివేళ కాస్తున్న వెన్నెల అని తేలిందట. నిశాదేవి కట్టుకొన్న నల్లని చీరెపైన తళుకుమన్న జరీపువ్వుల్లాగా నక్షత్రాలు మెరుస్తుంటే, లోకమంతా చల్లని వెన్నెల వాన కురుస్తోందట. దీన్ని వర్ణించాలంటే ప్రకృతిని ఎంతగా ప్రేమించాలి...? ఎంత ఉత్సాహభరితంగా జీవించటాన్ని నేర్చుకోవాలి....? రచయిత ఏమంటారో చూడండి. ఆరుబయట నిద్ర చలిగా, వెన్నెలగా వుంది. మంచు బొట్లు రాలే శబ్దం అన్నారు. మంచు బిందువు చల్లగా ఆకు కొస నుంచి జారటాన్నివినటం ఎలాంటి అనుభూతి..! ఇంత ఉత్సాహాన్ని అనుభవించ గలిగితే, చక్కని మాటల పందిళ్ళేయచ్చు. శ్రీశ్రీ గురించి కొత్తగా చెప్పే పనే లేదు. ఆయన ఒక బాధని వర్ణించే తీరు ఎలా వుందో చూడండి. ఈ పాటకూడా వినేవుంటారు.
కూటి కోసం, కూలి కోసం
పట్టణంలో బతుకుదామని
తల్లి మాటలు చెవిని పెట్టక
బయలుదేరిన బాటసారికి
ఎంత కష్టం!
మబ్బుపట్టి గాలికొట్టీ
వానవస్తే, వరదవస్తే
చిమ్మచీకటి కమ్ముకొస్తే..
ఈ మాటలు పేర్చటంతోనే ఆ యువకుడి పరిస్థితి మన కళ్ళముందు కదులుతుంది. వానలో, ఆకలితో, తల్లివేదనతో మనమూ తడుస్తాం. మాటలిలా పేర్చగలగాలి. ఈసారి చక్కని పోయిట్రీ గురించి ఆలోచించండి. రాయటం అలవాటైతే కబుర్లు వస్తాయి. కబుర్లు చెప్పాలనివుంటే, ముందుగా మాటలు పేర్చండి.  మనం రాసే విషయాలు, మాట్లాడే మాటలు ఎంత ఆచితూచి ఉపయోగించాలో చూడండి. ఓ వార్త చదివాను. ఏం రాశారంటే... 'సభ్య సమాజం సిగ్గుపడేలా పోలీస్‌ ఉద్యోగం చేస్తూ, భార్యను హింసిస్తున్న... . ఈ మాటలో ఎంత గందరగోళం వుంది...? పోలీస్‌ ఉద్యోగం చేస్తే సభ్య సమాజం సిగ్గుపడుతుందా అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే.. బాధ్యతగల పోలీస్‌ వృత్తిలోవుంటూ సభ్య సమాజం సిగ్గుపడేలా  ప్రవర్తించాడు అని రాయాలికదా. మనం కొన్నిసార్లు అనాలోచితంగా మాట్లాడితే ఇలాంటి వ్యతిరేక అర్ధాలు వస్తాయి. ఓ చోట 'అటకెక్కిన గిరిజనుల భూమి పంపిణీ' అనివుంది. ఇంతకీ భూమి పంపిణీ అటకెక్కిందా, గిరిజనులు అటకెక్కారా..? భూమి పంపిణీ అటకెక్కిందీ.. అంటే ప్రస్తుతానికే వాయిదా పడిందీ అనుకోండి. కానీ రాసినతను అటకెక్కిన గిరిజనులు అన్నాడు. ఇలాంటివి ఎన్నెన్ని తప్పుల తడకలో. మన మాటలూ ఇలాగే వుంటాయి సరిగ్గా మాట్లాడకపోతే.  మన తెలుగు ఎంత అందమైన భాష. ఎక్కడైనా ఓ కాలేజ్‌కి వెళ్ళి చూడండి. తెలుగే మాట్లాడు తుంటారు. ష కారం లేకుండా ఉండదు. నీ పేరేమిటి అనడిగితే శైలజ కాస్త షైలజ అంటుంది. ఒకబ్బాయిని అడిగితే షామీ అన్నాడు. నాకు అర్ధం కాలా. నాలుగుసార్లు విన్నాక అది స్వామి అని అర్ధం అయింది. ఇది వరకూ ఇంగ్లీష్‌ కష్టపడి నేర్చుకొనేవాళ్ళు. ఎందుకంటే అది మన భాష కాదు కనుక. ఇప్పుడు తెలుగు తిన్నగా నేర్చుకో అని చెప్పాల్సి వస్తోంది. 

1 వ్యాఖ్యలు:

ceegeeess said...

Edit ceegeeess said...
చీమలో ఓర్పుతో బాటుగా పొదుపరితనమూ,సంఘీభావము కూడా చెప్పుకో తగినవే. తాంక్స్ సుజాత గారు!

July 17, 2014 at 11:05 AM