Wednesday, May 15, 2013

ఎవరు గొప్ప..


ఒక కవి, మాటలు గురించి ఎంత చక్కగా చెప్పారంటే.. ’కళ్ళు తెరిచినప్పటినుంచి చెవిఒగ్గివినాలనిపించే మాటలు ఐశ్వర్యప్రదాలు, జ్ఞానప్రదాలు, ప్రతిమాటకీ, అక్షరం అక్షరానికీ కృతజ్ఞతలు‘ అన్నారు. నిజమే కదా. మాటలులేని, మాటలువినిపించని ప్రపంచం ఊహించటం కష్టం. ఉత్త కష్టంకాదు అసాధ్యం. అసలు మాటలు ఎంత బావుంటాయో ఒక కథ చెప్పనా. ఇద్దరు జబ్బుగా ఉన్నవాళ్ళు ఓ హాస్పటల్‌లో ఉన్నారు. ఒకతను లేచి కూర్చోగలడు, ఇంకో అతను మంచంలో ఉన్నాడు. లేచి కూర్చొనగలిగిన రోగి, పడుకొనివున్న ఇంకో రోగికి తను కిటికీలోంచి చూడగలిగిన ప్రతిదీ వర్ణిస్తున్నాడు. అటుగావెళ్ళే ప్రేమికులు, పెళ్ళిఊరేగింపులు, నడుస్తూ వేళ్ళే భార్యాభర్తలు, ఒకటేమిటి ఈ ప్రపంచంలోని చైతన్యం అంతా ఆ కిటికీలోంచి చూస్తూ వర్ణించేవాడు. ఓ రోజు అతను చనిపోయాడు. పడుకొనివున్న రోగి తనకు కిటికీ అవతలేముందో చూడాలని వుందని అడిగాడు. ఎందరన్ని అడిగినా ఒకటే సమాధానం. ఆ కిటికీపక్కన ఏమీలేదు. తెల్లనిగోడ. లేవగలిగిన రోగి తనతోటి జబ్బుగావున్న రోగి ఉల్లాసం కలిగించేందుకు కల్పించి చెప్పిన కబుర్లు. మంచంలో ఉండిపోయిన అతనికి ప్రాణం పోసిన మాటలు అవన్నీ. మాటల గురించి ఒక రిపోర్ట్ చదివాను. దానిలో సారాంశం ఏమిటంటే.. ఆడవాళ్లు సగటున రోజుకి ఇరవైవేల పదాలు మాట్లాడితే, మగవాళ్ళు ఏడువేలే మాట్లాడతారట. చూడండి విచిత్రం. ఆడవాళ్లు ఊరికే ఏదేదో మాట్లాడుతూ వుంటారనికాబోలు అర్ధం. సాధారణంగా మాట్లాడే అవసరం ఆడవాళ్ళకే ఉంటుంది. పిల్లలతో మాట్లాడాలి. పెద్దలకు అన్నీ అమర్చాలి. ఇంటాబయటా ఎందరెందరితోనో మాట్లాడితేనే పన్లవుతాయి. మా బంధువు ఒకాయన మొత్తం రోజులలో ఒక్కమాటకూడా మాట్లాడటం నేనువినలేదు. అయినా వాళ్ళావిడ ఆయనకు సమస్తం అమర్చిపెడుతుంది. ప్రశ్న ఆవిడదే, సమాధానం ఆవిడదే. ఏమండీ.. భోజనం చేద్దామా అంటుంది. ఆయన ఆ.. ఊ.. అనడు. రండీ ఒంటిగంటయిపోయిందీ అంటోంది మళ్ళీ. ఆయనలేచి భోజనం దగ్గరనోరు తెరుస్తాడు తినేందుకు. అంతే.  మరి రిపోర్ట్‌లు వస్తున్నాయంటే, రావా. పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. అవునా, కాదా.

మాటలు సరిగ్గా ఉపయోగించగలిగితే అంతకంటే శక్తివంతమైనవి ఇంకొటి ఏమీలేదు. ఒకళ్ళ ఇంట్లో ఒక చార్ట్‌ చూశాను. తెల్లని చార్ట్‌ పైన పొందికగా రాసిన అక్షరాలు. మంచి మాటలు. వేదాల్లో పూర్వికులు, దయగల మాటలతో దానం చేయమన్నారు. ’సంతోషంగా, మనస్ఫూర్తిగా అర్హులైనవారికి దానం చేయండి. అది ఇతరులకు నువు చేసే మేలుకాదు.. నీ విద్యుక్తధర్మం‘. ఆ రోజు ఆ ఇంట్లో నేను కూర్చున్న పది నిముషాలూ ఈ మాటలని చూస్తూనే వున్నాను. మనం తరాలుకానుకగా డబ్బు, ఇళ్ళూ, ఆస్తులూ ఇవ్వాలనుకొంటాం. కానీ కానుకగా ఇవ్వాల్సింది మంచి తనాన్ని, సంస్కారాన్ని. గుణాలు నిజంగా సంతోషపెడతాయి. ఆ ఇంట్లో పిల్లలు గురించి ఓ నిముషం ఆలోచించాను.  శుభ్రంగా, తెలివిగా సంతోషంగా వున్నారు. మనస్ఫూర్తిగా ఇతరులకోసం ఏదయినా వీల్ళు ఇచ్చేయగలరు అనిపించింది. బహుశ నేనుచూసిన చార్ట్‌ని, పిల్లలని పక్కనే కూర్చుని చూడటం వల్ల కావచ్చు. మొత్తానికి వాళ్ళంటి వాతావారణాన్ని అద్భుతంగా మార్చేశాయి ఆ మాటలు.   మరొక్కసారి నేను చదివిన రిపోర్ట్‌ గురించి చెపుతున్నా. నాకెందుకో, ఈ స్త్రీ పురుషుల్లో తేడాలు కనిపెట్టే రిపోర్ట్లు నచ్చనేనచ్చవు. పోనీ ఆ రిపోర్ట్‌ ఆరోగ్యానికీ, భావోద్వేగాలకీ సంబంధించిన రిపోర్ట్‌ లైతే ఫర్వాలేదు. కేవలం ఎవరు తెలివైన వాళ్ళో నిరూపించే రిపోర్ట్ లపై మాత్రం ఎందుకింత సమయం వృధాచేశారో ననిపిస్తోంది. స్త్రీ పురుషుల్లో ఎవరుగొప్ప అయితేనేముంది, మనందరం ఎవరికివాళ్ళుగా ఎప్పుడూ లేము. అందరం కలిసే ఉండాలి. ఆ కలిసివుండటంలో ఒకళ్ళనొకళ్ళు అర్ధం చేసుకోవాలని, సమానంగా వ్యవహరించాలని కోరుకొంటాం. ఎందుచేతనంటే సమానంగావుండే సహజీవనంలో ఆనందం ఉంటుంది కనుక. వ్యక్తులు ఎప్పుడూ వాళ్ళ గుణాలవల్ల గొప్పవాళ్ళవుతారుకానీ ఆడా మగా తేడాలవల్ల మాత్రంకానేకాదు. 

1 వ్యాఖ్యలు:

పిఆర్ తమిరి said...

సందేశం, మీ రచన సంతృప్తికరంగా ఉన్నాయి...అభినందనలు.....