Thursday, May 30, 2013

మా అమ్మెళ్ళిపోయింది...

ఒక దీపం నీ వెనగ్గా
కదలకుండా.. పెదవి కదపకుండా నువు
ఎలా వచ్చావో.. ఎలా వెళ్ళిపోయావో..
రెంఢూ ప్రశ్నార్ధకాలే
దీపం గాలికి రెపరెప లాడింది
ఉలిక్కిపడి చేయిచాస్తావేమో ననుకున్నా
నేనొచ్చినా చిన్న నవ్వయినా లేదు
పలకనందుకూ.. పడుకుండి పోయినందుకూ
నీ చుట్టూ సమూహాలు చూస్తున్నాసరే
ఎంతలా అరిచానంటే
నువు విననట్లే వున్నావు మరి
ఎన్నిసార్లు అలా నిర్లిప్తంగా లేవు నువు
జీవితం మొత్తంగా ఎన్నిసార్లు
నే కన్నీటి సంద్రమయినా
అందులో నువు మునుగుతూ తేలుతున్నావని
నాకు ఖాయంగా తెలుసు
అందుకే నా ఏడుపుని నీ చేతుల్లో పెట్టేను తప్పించి
మిగతా భారమేదీ లేదు నాకు
ఇప్పుడు చూశావూ.. నువు  ఏ భారం
తీసుకోవని తెలిశాకే అసలైన భయం
ఎప్పటికీ నా భయాలన్నీ నేనొక్కదాన్నే
భరించాలన్న భయం వెన్నులో పాకుతోందే అమ్మా..
నిజంగా భయంగా వుందే
నాకు తెలుస్తూనే వుంది నా చేతులు వదిలావని
వెళ్ళేముందు నీ ఎదురుగ్గా నేను
చూపు నిలవని కళ్ళతో నువు.. చూసింది నన్నేనా
లాక్కుపోతున్న ప్రాణశక్తి నిలుపుకోవాలనే
నీ తపన నన్ను తాకిన నీ చేయి చెపుతూనే వుంది
నాకు తెలియదనుకొన్నావేమో
నీ నొప్పిని నరనరానా నేను
అనుభవించలేదనుకొన్నావేమో
ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా
నువు లేకుండా నేను నిలబడే క్షణం గు రించి
నాకు భయం వేయదని నువ్వెలా తీర్మానించుకొన్నావే
ఈ ప్రపంచం నాకెంత తెలుసనీ.. తెలిస్తే
గాలికి ఎగిరిన నీ ప్రాణాన్ని అలా చేత్తో అందుకొనే దాన్నిగా
ఈ ప్రపంచం నాకెంత పరిచయమనీ
నా చుట్టూవున్న ఈ ఏ ఒక్క మనసునన్నా
ఒక్క క్షణం చదవగలనా
ఈ ప్రపంచం నా కెంత అనుభవమనీ
కొన్ని వందల గంటలు నీ ఎదురుగ్గావున్నా
నా కళ్ళముందే మాయమైపోతున్న
నీ జాడ అణువంతయినా నాకు తెలిసిందా
ఈ ప్రపంచం నా కెంత సన్నిహితమని
నా కిష్టమైన నువ్వే చేజారినా నాకు కాస్తయినా
కబురు అందలేదే
అమ్మా అందుకే భయంగా వుందే
నేనిక్కడున్నా ఎలాగూ మాయమౌతా
నే కట్టుకొన్న చిన్నారి గూడు
నాది కాకుండా జారిపోతూ
మన చుట్టుబంధాలు ఎలా తెగి ముక్కలవుతాయో
నిన్ను చూస్తూంటేనే తెలిసిపోయింది
నాదైనదేదీ ఇక్కడ శాశ్వతంగా ఉండదని
నేనున్నదీ నిజం
నేనెక్కడా లేనిదీ నిజం
నాకు హక్కులేని ఈ క్షణంలో నేనున్నాననీ తెలుసు
నువు నవ్వుకొంటున్నావనీ నాకు తెలుసు
నిన్నే లాక్కుపోయిన కాలం
నన్ను మాత్రం ఎలా వదులుతుంది
ప్రయాణం మొదలు పెట్టాను

త్వరలోనే కలుస్తా

Thursday, May 23, 2013

ఛానెల్ 24/7- 9 వ భాగం

“మనిషి ఎలా వుండాలో ఆ స్ట్రక్చర్ ఇమ్మని అడగగలమా” “నువ్వు మహాత్మాగాంధీలా అవ్వాలనుకొన్నావనుకో. మీడియా ఇచ్చేది ఏవుంది. న్యాయంగా, నిజాయితీగా, ధైర్యంగా నీకు నువ్వే తయారవ్వాలి. నాకు మాట్లాడాలంటే భయం, స్టేజ్‌ఫియర్ అన్నావనుకో. ఎవరో ఒక కౌన్సిలింగ్ ఎక్స్‌పర్ట్ నువ్వెలా మాట్లాడాలో, మీడియాలో మాట్లాడి పెడతారు. నీ జీవితంలో నీ ఇల్లు ఎలా వుండాలో, నీ కారు ఏదై వుండాలో నీకెలాంటి డిజైనర్ చీరె కావాలో, నీవేం తినాలో, తాగాలో నిన్నొక కార్పోరేట్ పర్సన్‌లాగ డిజైన్ చేసి పెడుతోంది మీడియా. నువ్వు కోరుకుంటే, నువ్వు గొప్పగా ఎలా వుండాలనుకున్నావో అదే ఊహించి ఇస్తుంది. నీ పిల్లలు అన్నం పప్పు తినకుండా నూడుల్స్ తిని ఎలా ఆరోగ్యంగా వుండాలో చెపుతుంది. నిమ్మకాయ నీళ్లు తాగకుండా న్యూట్రిషియస్ డ్రింక్‌ని చేతిలో పెడుతోంది. నీ గురించి నువ్వు ఆలోచించుకోనక్కరలేదు. అదే ఆలోచించి ఇస్తుంది.” “మరి నాకు ప్రాబ్లం వస్తే..”

Saturday, May 18, 2013

చెప్పవే చిరుగాలి...


కొందరు కబుర్లు చెపుతుంటే... అదో సినిమా చూస్తున్న ఫీలింగ్‌ వస్తుంది. పద విన్యాసాలూ, మాటల కూర్పులూ, పదాల కూర్పులూ ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. కబుర్లు చెప్పటం, సందేహం లేకుండా చక్కని ఆర్టే. ఒక చక్కని వ్యాసం చదివాను. పోతన రాసిన భాగవతంలో వామనుడు బలి చక్రవర్తినుంచి మూడడుగుల నేలను దానంగా తీసుకొన్నాక, భూమినీ ఆకాశాన్ని శరీరంతో కప్పిన వర్ణన ఏ మూవీ కెమేరాలకు కూడా అందనట్లుగా ఉంటుంది. ఆకాశాన్ని దాటి, మేఘరాసిని దాటి, తారాపథాన్నిదాటి, విశ్వమంతా తానే నిండివున్నాడంటారు పోతన. ఇది ఏ కంప్యూటర్‌ గ్రాఫిక్స్ కు అందుతుంది....? ఇలాంటి ఎన్నో ఉదాహరణలతో ఓ రచయిత్రి చక్కని వ్యాసం రాశారు. చదువుతుంటే విశేషాలు తెలుస్తాయి. రకరకాల మాటలు ఉపయోగించటంలో అవతలివాళ్ళ టెక్నిక్‌లు తెలుస్తాయి. ఇవన్నీ తెలిస్తే చక్కగా కబుర్లాడటం తెలుస్తుంది. సో.. మనం చక్కని కబుర్లు చెప్పాలంటే చక్కగా చదవాలి. ఈ చక్కని ఊహ చూడండి. కవికి అర్ధరాత్రి వేళ ఎందుకో మెలకువ వచ్చింది. కిటికీలోంచి, నిద్రజారని కళ్ళతోచూస్తే, చల్లని తెల్లని ఎండలాగా అనిపించిందట. ఎండలో ఇంత ప్రశాంతత ఎలా వుందా అని ఆలోచిస్తుంటే, అది అర్ధరాత్రివేళ కాస్తున్న వెన్నెల అని తేలిందట. నిశాదేవి కట్టుకొన్న నల్లని చీరెపైన తళుకుమన్న జరీపువ్వుల్లాగా నక్షత్రాలు మెరుస్తుంటే, లోకమంతా చల్లని వెన్నెల వాన కురుస్తోందట. దీన్ని వర్ణించాలంటే ప్రకృతిని ఎంతగా ప్రేమించాలి...? ఎంత ఉత్సాహభరితంగా జీవించటాన్ని నేర్చుకోవాలి....? రచయిత ఏమంటారో చూడండి. ఆరుబయట నిద్ర చలిగా, వెన్నెలగా వుంది. మంచు బొట్లు రాలే శబ్దం అన్నారు. మంచు బిందువు చల్లగా ఆకు కొస నుంచి జారటాన్నివినటం ఎలాంటి అనుభూతి..! ఇంత ఉత్సాహాన్ని అనుభవించ గలిగితే, చక్కని మాటల పందిళ్ళేయచ్చు. శ్రీశ్రీ గురించి కొత్తగా చెప్పే పనే లేదు. ఆయన ఒక బాధని వర్ణించే తీరు ఎలా వుందో చూడండి. ఈ పాటకూడా వినేవుంటారు.
కూటి కోసం, కూలి కోసం
పట్టణంలో బతుకుదామని
తల్లి మాటలు చెవిని పెట్టక
బయలుదేరిన బాటసారికి
ఎంత కష్టం!
మబ్బుపట్టి గాలికొట్టీ
వానవస్తే, వరదవస్తే
చిమ్మచీకటి కమ్ముకొస్తే..
ఈ మాటలు పేర్చటంతోనే ఆ యువకుడి పరిస్థితి మన కళ్ళముందు కదులుతుంది. వానలో, ఆకలితో, తల్లివేదనతో మనమూ తడుస్తాం. మాటలిలా పేర్చగలగాలి. ఈసారి చక్కని పోయిట్రీ గురించి ఆలోచించండి. రాయటం అలవాటైతే కబుర్లు వస్తాయి. కబుర్లు చెప్పాలనివుంటే, ముందుగా మాటలు పేర్చండి.  మనం రాసే విషయాలు, మాట్లాడే మాటలు ఎంత ఆచితూచి ఉపయోగించాలో చూడండి. ఓ వార్త చదివాను. ఏం రాశారంటే... 'సభ్య సమాజం సిగ్గుపడేలా పోలీస్‌ ఉద్యోగం చేస్తూ, భార్యను హింసిస్తున్న... . ఈ మాటలో ఎంత గందరగోళం వుంది...? పోలీస్‌ ఉద్యోగం చేస్తే సభ్య సమాజం సిగ్గుపడుతుందా అనిపిస్తుంది. అసలు విషయం ఏమిటంటే.. బాధ్యతగల పోలీస్‌ వృత్తిలోవుంటూ సభ్య సమాజం సిగ్గుపడేలా  ప్రవర్తించాడు అని రాయాలికదా. మనం కొన్నిసార్లు అనాలోచితంగా మాట్లాడితే ఇలాంటి వ్యతిరేక అర్ధాలు వస్తాయి. ఓ చోట 'అటకెక్కిన గిరిజనుల భూమి పంపిణీ' అనివుంది. ఇంతకీ భూమి పంపిణీ అటకెక్కిందా, గిరిజనులు అటకెక్కారా..? భూమి పంపిణీ అటకెక్కిందీ.. అంటే ప్రస్తుతానికే వాయిదా పడిందీ అనుకోండి. కానీ రాసినతను అటకెక్కిన గిరిజనులు అన్నాడు. ఇలాంటివి ఎన్నెన్ని తప్పుల తడకలో. మన మాటలూ ఇలాగే వుంటాయి సరిగ్గా మాట్లాడకపోతే.  మన తెలుగు ఎంత అందమైన భాష. ఎక్కడైనా ఓ కాలేజ్‌కి వెళ్ళి చూడండి. తెలుగే మాట్లాడు తుంటారు. ష కారం లేకుండా ఉండదు. నీ పేరేమిటి అనడిగితే శైలజ కాస్త షైలజ అంటుంది. ఒకబ్బాయిని అడిగితే షామీ అన్నాడు. నాకు అర్ధం కాలా. నాలుగుసార్లు విన్నాక అది స్వామి అని అర్ధం అయింది. ఇది వరకూ ఇంగ్లీష్‌ కష్టపడి నేర్చుకొనేవాళ్ళు. ఎందుకంటే అది మన భాష కాదు కనుక. ఇప్పుడు తెలుగు తిన్నగా నేర్చుకో అని చెప్పాల్సి వస్తోంది. 

Friday, May 17, 2013

చీమంత చేయలేమా...!

సినిమా కథలు బావుంటాయి. ముఖ్యంగా రాజులురాజ్యాలు,విఠలాచార్య కత్తియుద్దాల సినిమాలు టీవీల్లో చూస్తుంటాం. సరదాగా వుంటాయి. అవన్నీ కాల్పనిక కథలు. అందులో ఎక్కడా రీజనింగ్‌ వుండదు. ఓ పెద్ద దయ్యమోరాక్షసో కనిపిస్తుంది. దానికి అస్సలు తెలివితేటలే వుండవు. వీపుపైన ఓ దెబ్బకొట్టినా భయపడుతుంది. మనకి నవ్వొస్తుంది. లైఫ్‌లో మనకి అందనివాటిని, మనం చేయలేని సాహసాలను అలా ముట్టుకోగలిగితే, లేని శక్తి మన చేతిలోవుందని వూహిస్తే కలిగే సంతోషం అది. రాజకుమారుడి వేషంలో ఎన్టీఆర్‌ కత్తియుద్ధంచేసి పాతాళమాంత్రికుణ్ణి ఓడిస్తే ఎంతసరదాగా వుంటుంది! ఒక సామాన్యుడ్నిమంత్రాలొచ్చిన మాయగాడు తలుచుకొంటే పిల్లినోబల్లినో చేయడా..? అయినా చేయలేరు. హీరోనే జయిస్తాడు. మనలో వుండే విజేతనవుదామనే కాంక్ష హీరోని గెలిపిస్తేనే వుంటుంది. అంతే కదండీ. వాస్తవం కంటే ఊహ అందంగా వుంటుంది. ఊహలాగా జీవితం ఉంటుందా...సాఫీగా సాగుతున్న జీవితంలో ఏదో ఒక అలజడి రాకుండా వుండదు. చదువుకి సంబంధించి కావచ్చుఉద్యోగానికి సంబంధించి కావచ్చువ్యాపారంలో హెచ్చుతగ్గులు కావచ్చుఎవరైనా స్నేహితుల నమ్మక ద్రోహం కావచ్చుస్నేహంలో, బంధుత్వంలో, చివరికి భార్యాభర్తలు, బంధువులకుకూడా అనుకోని సంఘటనలు జరగవచ్చు. ఇలాంటి ఎదురు దెబ్బల్ని మనుష్యులు తేలిగ్గా తీసుకోగలిగితే బావుండు. కానీ అలా జరగదు. సక్సెస్‌ను ఆరాధించినట్లు, జీవితంలోకి ఆహ్వానించినట్లు ఎవ్వరూ ఓటమిని ఒప్పుకోరు. కానీ, గెలుపులాగే ఓటమినికూడా చేతిలోకి తీసుకోవటంలోనే అసలైన సరదా వుందనిపిస్తుంది నాకు. జీవితంలో ఛాలెంజ్‌ అనేది లేకపోతే ఇంకా థ్రిల్‌ ఏముంటుంది.  కొందరిని చూడండి. కాస్త ఇబ్బంది ఎదురైనాసరే వెంటనే కుంగిపోతారు. స్నేహితులమధ్యభార్యభర్తలమధ్య విభేధాలు రావటం సహజం. ఎదురు దెబ్బలు మనసుకి గాయం చేస్తాయి. నిజమే. ఆ గాయం మానక పోవచ్చు. అయితే కోలుకొనే దిశగా వెంటనే ప్రయాణం అవ్వాలి. ఎలాంటి ఇరకాటాన్నయినా ఎదుర్కోవాలి. జీవితం మొదటిలోనే ఎన్నెన్నో చేదు అనుభవలు ఎదుర్కొన్న విజేతలు మనకి ఎంతోమంది తెలుసు. రాజకీయాలుక్రీడలుకళలు.. ఇలాంటి వాటిల్లో మొదట తిరస్కరించబడి తర్వాత ఎదిగినవాళ్ళ గురించి మనం విన్నాం, చూశాం కూడా. మనిషి హృదయంలో ఓ పోరాడే శక్తి వుంది. దాన్ని వదులుకొంటే నష్టం. రేపటి పైన ఆశ వుండాలి. నేను దర్జాగా బతక గలననే ధైర్యం చాలా అవసరం. ఒక్కోసారి వృత్తిపరమైన ఇబ్బందులు వస్తాయి. కానీ ఓటమి ఒప్పేసుకొనిపరిస్థితుల నుంచి పారిపోవాలని చూస్తేనే ప్రమాదం. ఒక చిన్నచీమను చూడండి. అది ఎంతో కష్టపడి బుల్లి పంచదార పలుకును లాక్కుపోతూ వుంటుంది. ఆ పలుకు బరువు చీమకంటే ఎక్కువే. దాన్ని కష్టపడి కష్టపడి ఈడుస్తూ వుంటుంది. దాని ఆశ చూడండి. ఎలాగోలా ఆ ఆహారం దాచుకోవాలి. పాపం ఎన్నిసార్లు చేతులు నొప్పెడుతుంటే ఆగిపోతుందో. చీమకి అసలు చేతులుంటాయా అని డౌటొచ్చింది. గోడ పైకి ఎక్కి, జారి పడిమళ్ళీ ప్రయత్నం చేసే చీమను శ్రద్ధగా చూశాను. దానికి చేతులు ఉన్నాయోలేవో కానీ, ఓర్పు మటుకు బోలెడంత వుంది. అది ఎక్కాలని ప్రయత్నం చేస్తుందికానీ, వెను దిరిగి పారిపోవాలని చూడదు. అంత చిన్న చీమలో అంత ఓర్పు, ఓపికవుంటే మనకెంత వుండాలి...? ఒక్కక్షణం ఆలోచించండి. ప్రతిరోజుప్రతి ఉదయం మనకోసమే వుందనిపిస్తుంది. ఎలాంటి గాయం అయినా ఒకటి రెండురోజుల్లో తగ్గుముఖం పట్టినప్పుడుమనసుకి తగిలినగాయం మాత్రం శాశ్వతమా...అయితే కాస్త సమయం తీసుకొంటుంది. లైఫ్‌లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. మనసు దాన్నుంచి మళ్ళించ గలగాలి. ఒక్కోసారి సంగీతంవింటూవుంటే మనసుకెంతో స్వాంతన అనిపిస్తుంది. ఇష్టమైన స్నేహితులను కలుసుకోవటంలోపుస్తకాలు చదవంటంలో ఎంతో అలసట మాయమై పోతుంది. ఎవరో ఒక కవి వెలిగే దీపాన్ని ఆశతో పోల్చారు. మనిషి మనసులో ఆశ, దీపంలాగా వెలుగుతూ వుండాలని ఆయన భావన. బావుంది కదా. మన మనసులో దీపం మనకి తప్పకుండా వెలుగువైపు చూపిస్తుంది.

Thursday, May 16, 2013

ఛానెల్ 24 / 7- 8 వ భాగం

( కిందటి వారం తరువాయి) “శ్రీధర్‌గారూ ఈ కాన్సెప్ట్ ఎల్లా రిజెక్ట్ చేశారో అర్ధం కావటం లేదు” అన్నది కాదంబరి. చేతిలోవున్న ఫైళ్ళు, క్యాసెట్లు, హెడ్‌ఫోన్ టేబుల్ పైన పెట్టి శ్రీధర్ ఎదురుగ్గా నిలబడింది. శ్రీధర్ ముందు అయోమయంగా ఆమె వంక చూశాడు. ఒక్క నిముషం ఏవీ అర్ధం కాలేదు. ఆమె చేతిలో వున్న ఫైల్ లోగో చూశాక అర్ధం అయింది. “మేడం కూర్చోండి” అన్నాడు తాపీగా. కాదంబరితో కాస్సేపు కబుర్లు పెట్టుకొంటే కాస్త టెన్షనన్నా తగ్గుతుందనిపించింది.

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..


ఈ మధ్య సినిమా కథ ఎలా రాయచ్చో నేను కనిపెట్టా. మొదటి కిటుకు ఏమిటంటే వరసాగ్గా నెలరోజులపాటు టౌన్‌లో ఉన్న సినిమాలు మొత్తంచూసి పడేయాలి. ఆ మానసిక స్థితి సినిమా కథ రాసేందుకు చక్కగా పనికొస్తుంది. ఇప్పుడు  చూడండి. మనకీ జీవితంలో కాస్త ప్రేమకీ, త్యాగానికీ, వళ్లుమంటకీ, ఏడుపులకీ, మనదైన ప్రత్యేకత ఉంటుంది. సినిమాకు ఇవ్వేమీ అక్కర్లేదు. మనం చూసే, వినే ప్రేమకథలు. ఒక్కమ్మాయి ప్రేమలో పడాలంటే మగపిల్లలు చాలా తంటాలు పడాలి. బహుశా తనే ప్రేమిస్తూ వెంటపడుతున్నాడుకదా అని అమ్మాయిలు మరింత గర్వంగా ఆకాశంవైపు చూస్తూ నడుస్తారు. కానీ సినిమా అమ్మాయిలకు ఇవేం అక్కర్లేదు. స్పీడ్‌గా, ఇంకా మాట్లాడితే బైక్‌ని ఒక టైర్‌పైన నడిపిస్తూ అమ్మాయిచుట్టూ గిర్రున తిరిగి, ఓ ఈలవేస్తే చాలు. అమ్మాయి పుస్తకాలు పారేసి డాన్స్‌ కు దూకుతుంది. చూడండి. ఎంత టైమ్‌ కలిసివచ్చిందో. నేనీ విషయం మా కొలీగ్‌కు చెపితే  ఆయన చాలా దిగులుపడ్డాడు. అనవసరంగా ఓ అమ్మాయి చుట్టూ రెండేళ్ళు తిరిగీ తిరిగీ ఆవిడ్ని కట్టుకొన్నాట్ట. మరి టైమ్‌ ఎంత వేస్టో కదా.

ఇంకో ట్రిక్‌ చెబుతాను. ముష్టి పేదవాళ్ళ సెంటిమెంటు సినిమాతీయి, అదిరిపోయే లవ్‌స్టోరీ తీయి, తలకాయలో ఎలాంటి ఆలోచనా లేకుండా ఐటమ్‌సాంగ్స్‌ తీయి, రీజనింగ్‌తో పనిలేదు. పది గాగ్రాచోళీలు, పొట్టొపొట్టిగావుండే డ్రెస్‌లు కొనుక్కొంటే చాలు సగం సినిమా అయిపోతుంది. డాన్స్‌ లకీ పెద్ద కష్టంలేదు. ఓ పదినిముషాలు సీరియస్‌గా కొన్నిసినిమాలు చూసి, ఆ మూవ్‌మెంట్లలో నచ్చినవి మనసులో కాపీ చేసుకొంటే చాలు. కొత్త డాన్స్‌. అసలు మనకు డాన్స్‌ అనేది రాకపోయినా ప్లాన్‌ చేయచ్చు. ఈ మాత్రం  దానికి డాన్స్‌ డైరక్టర్‌కూడా దండగ. డైరక్టరే తిప్పలు పడొచ్చు. సగం సినిమా అయిందా. ఇంకా రెండు ఫైట్స్‌, క్లైమాక్స్‌ వున్నాయి అవీ చెప్తాను. సినిమా తీయటమంత ఈజీయెస్ట్‌ ఇంకేంలేదు. ఇప్పుడు క్రియోటివ్‌గా.. వద్దులేండి అంతమాటేందుకు. ఈ మాత్రం క్రియోటివిటీ ఏం అవసరం వుందీ. ఇందులో పెద్ద కష్టపడేది ఏదీలేదు. ఇరవైమంది ఫైటర్స్‌.. బాగా తన్నించుకొంటారా? ఐదునిముషాల ఫైటింగ్‌సీన్‌లో ఓ ఇరవైసార్లు పడండి. అంటే జంప్‌ చేస్తేచాలు. ఇక్కడ కాస్త క్రియోటివిటీ అంటే వాళ్ళు ఎక్కడెక్కడ పడతారో అక్కడ నీళ్ళొచ్చే పంపులూ, రెండుమూడు బురదగుంటలూ, పడగానే పైకి ఎగిరేలా టమోటాలు, నిమ్మకాయలూ వుంటే చాలు. గ్రాఫిక్స్‌ గురించి కాస్త ఓనమాలు తెలిస్తే చాలు. ఒకే ఒక ట్రిక్‌ని ప్లాన్‌ చేసుకొని, హీరోని ఐదంతస్థుల ఎత్తునుంచి, పరుగెత్తే కార్లపైనుంచి, లారీల అడుగునుంచి బయటకులాక్కొస్తే చాలు. ఫైట్‌ ఫినిష్‌. చూశారా. కథలు రాయటం ఎంత ఈజీనో. వారంరోజులు బండచాకిరీ చేశా, సెలవు పూటన్నా, పిచ్చి ఆఫీస్‌ స్టాఫ్‌ గోలలేకుండా మెదడు స్విచ్‌ ఆఫ్‌చేసి కళ్ళతో మాత్రం ఈ సినిమా చూద్దాం అనుకొనివచ్చే వేలాది మంది సినిమా ప్రేమికులు ఈ దేశంలో కొదువా చెప్పండి. ఉండండి తొందర పడకండి. ప్రతికథా కంచికి వెళుతుందా, లేదా. అలాగే ప్రతి సినిమా ఏదోరకంగా క్లైమాక్స్‌ కు చచ్చినట్లుగా రావాలి. దీనికి అస్సలు కష్టంలేదు. తలాతోకాలేకుండా నడిపించే సినిమాని, ఆ రెండూ కలిపి ముడేయాలి. మధ్యలో అడ్డం వచ్చిన పాత్రల్ని చంపి పడేసో, లేకపోతే దేశాంతరాలకు పంపేసో, ఎలాగోలా వదిలించుకోవాలి. మిగతావాళ్ళు.. ఎందుకులేండి ఇంత పెద్దమాట. ఇంకెవరుంటారూ.... తల్లీతండ్రినీ వదిలించుకొన్నాం. ఫైటర్స్‌ ఆ పూటతోనే వాళ్ళదారి వాళ్ళు చూసుకొన్నారు. హీరో వెనక్కాలతిరిగే పనీపాటాలేని ఐదారుగురు స్టూడెంట్స్‌, అనుచరులు, హీరో హీరోయినూ.వీళ్ళతో క్లైమాక్స్‌. పెద్ద కష్టమా..! సెంటిమెంట్‌ సినిమా అయితే గుమ్మానికి వేలాడి, గాజుముక్క గుచ్చుకొని విడ స్పృహలేకుండా పడిపోతే, డాక్టర్లు మా వల్లకాదంటే, హీరో ఈలతో హీరోయిన్ కళ్ళు తెరిచేలా చేయచ్చు. ఇలాంటి ఐడియాలు మన దగ్గర ఒక కోటి వుంటాయి.

ఇంత గొప్ప అవార్డ్‌ పిక్చర్‌ కథని, ఐదే నిముషాల్లో రాస్తే మీరు షాకైనారా, లేదా. చివర్లో ఎవరైనా ఇలాంటి గొప్ప సినిమా తీయదలుచుకొంటే ఒకే ఒక టెక్నిక్‌ అండీ. సినిమాకథ రాసిన మీకే పెద్దగా నచ్చకపోయినా పర్లేదు. డైరక్టర్‌ ఏడుపుమొహం పెట్టినా లెక్కలేదు. డోంట్‌కేర్‌. అయితే ఒక్క నిర్మాతకు మాత్రం నచ్చాలి. గుర్తు పెట్టుకోండి. ఆయనకే నచ్చాలి. మధ్యలో ఆయనకి పాపం కొన్ని డౌట్లు వస్తాయి. హీరో ఒకే ఒక్కగుద్దుతో 20మంది నుంచి 90మందిని ఎలా తంతాడండీ. తలుచుకొంటే నాకు చేతులు నెప్పుడుతున్నాయి అనేలోగానే ఆయన్ని కనికట్టుచేసి దృష్టి మళ్ళించగలగాలి. అసలా.. ఆ ఫైట్లేనండీ మన సినిమాకు హైలెట్‌ అని వప్పించగలగాలి. ఈ టాప్‌ సీక్రెట్‌ని దృష్టిలో పెట్టుకొన్నారా... సినిమా కథ రాయటం కాఫీ తాగినంత ఈజీ. 

Wednesday, May 15, 2013

ఛానెల్ 24/7 – 6 వ భాగం

( కిందటి వారం తరువాయి) “మీరు సావిత్రిగార్ని సజెస్ట్ చేశారు కదా. ఆవిడ్ని మేనేజ్ చేయగలమా” అన్నాడు న్యూస్ కోఆర్డినేటర్ రమణ. “మనం పట్టాభిగార్ని, వెంకట్రావు, ప్రొఫెసర్ బలరాం ఇంకా మొత్తం పన్నెండుమందిని అనుకొన్నాం. అందులో జయమ్మగారు, సంజయ్‌గారు వేరే లైవ్‌లో ఉన్నారట. పట్టాభిగారు ఆ మూల ఉన్నారు. వెహికల్ ప్రాబ్లం. ఇకపోతే రమణగారూ ఇటు దక్షిణామూర్తిగారిని మన చానల్ చుట్టుపక్కల్నే ఉన్నారు కనుక వాళ్లని అనుకొందమా” అన్నాడు శ్రీధర్.