Thursday, March 28, 2013

24/7 - సీరియల్ మూడవ భాగం...
http://www.saarangabooks.com/magazine/?p=1309

Thursday, March 21, 2013

ఛానెల్ 24 / 7 – రెండో భాగం

Monday, March 18, 2013

నేను కొత్తగా రాసిన సీరియల్ *ఛానల్ 24 x 7 వెబ్ లింక్.........

http://www.saarangabooks.com/magazine/?p=489

Friday, October 14, 2011

ఒకే అచ్చు బొమ్మలం...!

నేను చాలా ధైర్యంగా రాస్తున్నానని ఆశ్చర్యపోయి మెచ్చుకుంటున్నవాళ్ళకి కృతజ్ఞతలు. ముప్ఫైయేళ్ళుగా మీడియాలో పనిచేస్తున్నాను. రూరల్ జర్నలిస్ట్‌లూ.. డెస్క్‌వాళ్ళూ.. రిపోర్టర్‌లూ.. నేను పనిచేసిన ఏరియాలన్నీ, మన ఇంట్లొ మనం స్వేచ్చగా తిరిగినట్లే వుంటుంది నాకు. జర్నలిస్టులన్నవాళ్ళు ఎలా వుండకూడదో.. ఎలా వుంటే బఫూన్‌లయిపోతారో రాస్తున్నానంతే. నా కొలీగ్స్ కోపం తెచ్చుకోరు. పైగా ఎవరు రాస్తే కోపం వస్తుందీ... ఇప్పుడిప్పుడే ఈ రంగంలో అడుగుపెట్టి, నాకంటే మిగతావాళ్ళు అల్ఫమానవులు.. నాకే బాగా తెలుసు.. నేనొక్కడినే కరక్ట్ అనుకొని ఇతరులపైన పడిపోతేనే ఎవళ్ళకైనా కోపమొస్తుంది. నా కథలు చదివారు. ఆ ఆడవాళ్ళందరి కష్టంలో నేనున్నాను. నాదీ అదే కష్టం. అందుచేత అవి సుజాత కథలు.. ఇవి మీడియా కథలు.
మనుష్యుల బలహీనతలపైన ఏ వ్యాపారమైనా జరుగుతుంది. జర్నలిజం విలువలదగ్గరనుంచి.. పత్రికలూ మీడియా వ్యాపారంలోకి మారిపోవడం కళ్ళారా చూసాను. ఈ వ్యాపారంలో ఉద్యోగులం అందరం భాగస్వాములం. ఒకళ్ళు ఒక బిజినెస్ పెట్టుకొంటే దాన్ని వృద్దిచేసే క్రమంలో పనిచేస్తున్నట్లు మేమూ అంతే. కథలు రాస్తే డబ్బులు రావు. పుస్తకాలు వేస్తే డబ్బు రాదు. రచయితలు వాళ్ళని వాళ్ళు పోషించుకొని, ప్రమోట్ చేసుకొని, వాళ్ళకోసంవాళు సమాజం పెట్టుకొని బతకాల్సిన రోజులివి. రాయటం మనకిష్టమైన వ్యాపకం అయినప్పుడు ఎలాగోలా కీర్తికోసమైనా రాస్తున్నామా లేదా..? ఉద్యోగం అవసరమైనప్పుడు బాగాలేకపోయినా దరిద్రం అనుకొంటూ చేస్తున్నామా లేదా..? మనమేం ప్రత్యేకమైనవాళ్ళం కాదు. మన అందరం ఒకటే.. ఒకే అచ్చు బొమ్మలం. 'నేను స్పెషల్ బాబూ .. మనం అలా ఉండలేమండీ.. ప్రపంచంలో బొత్తిగా మంచితనం పోయింది..' అని ఇలాంటి నిట్టూర్పులు విడుస్తూ చుట్టూ బోలెడుమంది. ఈ అబద్దాలని చచ్చినట్టు వింటాం. బ్లాగ్‌లో సరదాగా ఏదైనా రాద్ద్దామనుకొన్నాను. మనల్ని బోరుకొట్టే అతిగాళ్ళని మీడియాతో ముడిపెట్టానంతే.

Wednesday, October 12, 2011

షాట్ అదుర్స్.. అయినా అట్టర్‌ఫ్లాప్..

'చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేయరా...' గర్జించాడు మా చీఫ్.
ఆయనకు రూరల్ రిపోర్టర్స్ పైన బహు ప్రేమ. ఆయన కేంప్‌కు వెళితే వాళ్ళంతా ఆయనను నెత్తిన పెట్టుకొని ఊరేగించినంత పని చేస్తారట.
'మీరా బైట్ చూసారా..' అన్నాను.
'పానశాలా... పాఠశాలా..అనే టైటిల్ కూడ పంపేశాడండి. ఎంత బావుందో చూడండి. వాళ్ళ భవిష్యత్ కాస్త పట్టించుకోండి. వాళ్ళు చిన్నవాళ్ళండి. ఎంత కష్టపడి ఆ న్యూస్ కవర్‌చేసాడో పాపం...' అన్నాడు మా చీఫ్.
ఆయన గొంతు బాధతో వణికింది.
'వేస్తే ప్రొబ్లం...' అని అంటున్నానోలేదో...
'ఏమండీ మీరు పై ఎత్తున కూర్చున్నారండీ.. ఎవరినైనా తొక్కేయగలరు. ఆ నున్న రిపోర్టర్ ఫోన్‌ల పైన ఫోన్‌లు. నేను కవర్‌చేసిన న్యుస్ మా వూళ్ళో సంచలనం. బిగ్ షాట్స్ వున్నారు అన్నాడు.. ఇవ్వాళ్టి రూరల్ న్యుస్‌లో ఇచ్చేయండి. పర్లేదండి, వాళ్ళ పైన నాకు నమ్మకముంది....' ఇది సుగ్రీవాజ్ఞ అన్నట్టు అన్నాడాయన మొహం మాడ్చుకొని.
ఏం చెప్పాలో నాకర్ధం కాలేదు. అప్పటికీ 'వేస్తే వాణ్ణి తంతారండి' అన్నాను కూడా.
'వాళ్ళు రిపోర్టింగ్‌లో వున్నారు.. ఆ మాత్రం గట్స్ వుంటాయి వాళ్ళికి...' అన్నాడు ఖచ్చితంగా.
నున్న రిపోర్టర్‌కి నూకలు చెల్లిపోతాయని నిశ్చయం చేసేసుకొని.. ఆ బైట్ ఎడిట్ చేసి డ్రాప్‌లో వేయమని చెప్పేసాను.
'ఆ నున్నగాడి బైట్ చూసారా' అంటూ వచ్చాడు షిప్ట్ ఇన్‌చార్జ్ శంకర్.
'స్కూల్‌లో కూర్చుని వాళ్ళ ఊళ్ళోవాళ్ళు పుల్‌గా తాగుతున్నారు. ఎవరిదో పెళ్ళనుకుంటా. వూరి సగం జనం అక్కడే ఉన్నారు....'
'నేను చెప్పాను బాబూ .. చిన్న వాళ్ళని తొక్కేస్తున్నానని చీఫ్ మండి పడ్డాడు...' అన్నాను.
'తొక్కటం కాదు.. ఆ ఊళ్ళోవాళ్ళే వీడి తోలొలిచేస్తారు.. ' అంటూ లేచిపోయాడు శంకర్.
మధ్యాహ్నం న్యుస్‌లో 'ఇది పానశాలా.. పాఠశాలా...!' అద్భుతంగా వచ్చేసింది.
స్కూళ్ళనీ, పంచాయితీ ఆఫీసుల్ని ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి ఎలా వాడుతున్నారో చూడమని మా న్యుస్ రీడర్ అదిరిపోయే లీడ్ ఇచ్చేసాడు.
మంచి కెమేరామెన్‌ని హైర్ చేసాడనుకుంటా.. డబ్బులిచ్చాడనే గౌరవంకొద్దీ.. మా నున్న రిపోర్టర్‌ని వెనకాలే ఫాలోచేసి.. అతన్ని అందమైన యాంగిల్స్‌లో లాగించేసాడు. ఎడిట్ చేసే అవకాశం లేదు.
తాగేవాళ్ళు.. నున్న.., తాగిపడిపోయినవాళ్ళూ.. నున్న.., స్కూల్ బిల్డింగ్.. లైటూ.. అన్నీ వైడ్ షాట్స్... యధాతధంగా టెలీకాస్ట్ చేసేశాం.
ఎలాగోలా ఎప్పుడైనా మీ చానల్‌లో మమ్మల్ని చూపించరా వెధవా అని బుద్ధిలేక అడిగారే అనుకో... 'రాత్రిపూట ఎవ్వళ్ళూ లేరుకదాని ఆ స్కూల్‌లో కూర్చుని ప్రశాంతంగా మందు పుచ్చుకొంటుంటే.. దాన్ని ప్రపంచానికి చాటుతావురా చచ్చినాడా' అని వాళ్ళ మొగుళ్ళను అప్రతిష్టపాలు చేసినందుకు ఆడాళ్ళంతా కలసి నున్న గాడిని తన్నేశారట.
'ఇలా దౌర్జన్యం చేస్తున్నారు మిమ్మల్ని టీవీలో చూపెడతాను ' అన్నాడట నున్న.
'మోడ్రన్ మాలక్ష్మిలో ట్రై చేయిరా అని నాలుగు నెల్లనుంచీ నీకు అరిసెలూ, లడ్లూ మేపుతుంటే మెక్కి, నయా పైసా పనిచేయకుండా మమ్మలిని ఇలా గ్లామర్ లేకుండా చూపిస్తానంటావా ' అని రెండో విడత వాయించేశారట ఆడాళ్ళు.
నున్నకి హైద్రాబాద్‌లోనే వైద్యం.
ఖర్చులు ఆఫీసే భరించింది.
చీఫ్ స్వయంగా వెళ్ళి అయన్ని పరామర్శించాడు.
ఎలా పలకరించాలో తెలియక మేం మాత్రం మొహం చాటేశాం.

Sunday, October 9, 2011

జర్నలిస్ట్ దయ్యం..

'నువ్వు దాన్ని పట్టించుకోకు.. అది జర్నలిస్ట్ దయ్యం..' అన్నాయి నా తోటి దయ్యాలు.
నేను వచ్చి వాలిన మర్రిచెట్టు పైన ఓవైపంతా చాలా దయ్యాలు, రెండోవైపు గంభీరంగా మొహం పెట్టుకొని ఒకేఒక దయ్యం.
'అలా ప్రత్యేకమైన దయ్యాలుంటాయా ..' అన్నాను నేను.
నేను గవర్నమెంట్ టీచర్ని కనుక ప్రశ్నలు వేయడం నాకలవాటు.
'ఏందు కుండవూ.. మనుష్యుల్లొ వాళ్ళు ప్రత్యేకమట. దయ్యాల్లోకూడా వాళ్ళు సెలబ్రిటీలట. ఎడిటర్ దయ్యం, ప్రొగ్రాం హెడ్, వాయిస్ ఓవర్లూ, యాంకర్లూ, న్యూస్‌రీడర్లూ, కాసేపట్లో వస్తాయి చూద్దువుగాని...' అంది నేను రాగానే నన్ను పలకరించి పరిచయం చేసుకొన్న ఓ ముసలామె దయ్యం.
జర్నలిస్ట్‌లంటే మనకి సరదా వేస్తుందికదా. ఈవిడ వద్దంటున్నా పోయి పరిచయం చేసుకొన్నాను.
జర్నలిస్ట్ దయ్యం నా వంక అలా కిందుగా చూసి 'నువ్వు మా స్టూడియోకి ఎప్పుడైనా వచ్చావా' అంది.
'అన్నపూర్ణానా... సారధా..' అనబోతున్నానా అంతలోనే నన్ను మద్యలో కట్ చేసి 'నీలాంటి బోడి టీచర్‌లు మా స్టుడియోకి రారు. చంద్రబాబునాయుడో, రాఘవేందర్రావో, రాజకుమారి, ఇంకా పనీపాడూలేని ముసిలి జర్నలిస్ట్‌లూ, తెలుగు భాషని కాపాడే వాళ్ళు, పండగలప్పుడు దేవుళ్ళగురుంచి చెప్పే ఆడాళ్ళు.. మహేషూ, యంటీయారూ.. ఇంకా చాలా మంది వస్తారు. నాకు వాళ్ళంతా ఫ్రెండ్స్. అబ్బో ఎన్ని ప్రొగ్రాంస్ చేశానో. అస్సెంబ్లీ, సెక్రటేరియట్ బీట్లూ, జగన్ ఓదార్పు యాత్ర.. చెప్పినా నీకేం తెలుస్తాయ్ ' అంది నన్ను బొత్తిగా తీసిపారేస్తూ.
నేను కాస్త చిన్నబుచ్చుకొని 'నేనూ సీరియల్స్ చూస్తా బాబూ.. టీవీ లేకుండా నిముషంకూడా వుండలే'నన్నాను.
'అసలు నేనులేకుండా నీకు టీవీ ప్రొగ్రాం లెక్కడివీ ' అంది దయ్యం విచారంగా.
'అవన్నీ వదిలేసి ఎలా వచ్చావూ అన్నాను నేను.
'ఏమో అలా పని చేస్తూ చేస్తూ రాత్రింబగళ్ళూ అక్కడే కదా. నిద్ర పోవటానికే ఇళ్ళు. చిన్న కునుకు తీస్తూ ఇలా వచ్చేసాను. భలే కంగారు పడ్డాననుకో. ఆఫీస్ వదిలి రాను కదా. ఒక్క మనిషీ తెలీదు, ఒక్క వీధీ తెలీదు, కొన్ని బజార్లు కూడా గుర్తుపట్ట లేక పోయాను. ఎవర్నైనా నేను వెళ్ళాల్సిన మర్రిచెట్టేక్కడా అని అడుగుదామంటే ఎవ్వళ్ళూ తెలీలేదు...'
'అదేంటీ.. నీకు సీఎంలూ.. సినిమా వాళ్ళూ తెలుసన్నావు కదా ' అన్నాను ఆశ్చర్యపోయి. నామట్టుకు నాకే ఈ చెట్టుపైన వచ్చి వాలగానే యాభై మంది దాకా తెలిసినవాళ్ళు కనిపించారు...
'అదేకదా.. నాకు తెలుసువాళ్ళు, నేనెవ్వళ్ళకీ తెలీలేదు. ఎవ్వళ్ళూ నన్ను గుర్తుపెట్టుకోలేదు, పట్టించుకోలేదు.. చూసావుకదా ఎలా ఒంటరిగా వున్నానో...'
'అదేంటీ.. జర్నలిస్ట్ అంటే చాలా గొప్ప ఉద్యోగం కదా. నువ్విలా అయిపోవడమేమిటీ.. '
జర్నలిస్ట్ దయ్యం చిరాకు పడింది.
'నేను గొప్పే.. ఆ సంగతి ఎవ్వళ్ళకి తెలుసు. ఈసారి నేను పోలీస్ కానిస్టేబుల్‌గా పుట్టాలనుకున్నా. జర్నలిస్ట్‌నని ఎవడైనా అన్నాడో వాడికి నూకలు చెల్లినట్టే...'
'ఇంకానయం... నేను వచ్చే జన్మలో జర్నలిస్ట్‌ని అవ్వాలనుకున్నా, ఈ తిక్క వెధవికి చెప్పానుకాదు..'

Friday, October 7, 2011

ఏ నిముషానికి ఏమి జరుగునో....

'సెట్లో చారిగారిని చూస్తే ముద్దోచ్చేస్తుందీ' అన్నాను.
'నాక్కూడా...' అన్నాడు మా మార్కెటింగ్ మేనేజర్.
'అరగంట స్లాట్ యాభై వేలు. పదమూడు స్లాట్స్‌కీ నెట్ క్యాష్ ఇచ్చేసాడు. ఇప్పుడీయన్ని ఎత్తుకొని సెట్ చుట్టూ తిప్పూ అన్నా తిప్పుతా' అన్నాడాయన తన్మయంగా.
వారఫలాల కోసం వేసిన సెట్ అదిరింది. వెనక్కాల ఏడుకొండలవాడి విగ్రహం, ఆయన అభయ హస్తం సరిగ్గా తన నెత్తిదగ్గర రావాలని చారీగారు కోరినట్లు ఆర్ట్ డైరక్టరు చారి నెత్తి పైన వెంకన్న చేయి పెట్టేసాడు.
'మన చీఫ్ ఒకసారి వచ్చి చూస్తానన్నారు. ఆయన రాగానే మొదలు పెట్టేద్దాం ' అన్నాడు మా.మే.(మార్కెటింగ్ మేనేజర్).
'చారిగారు సినిమా యాక్టరా.. అన్ని యాంగిల్సూ చూపించేందుకు, సింగిల్ కేం చాలు అని మేం మొత్తుకొన్నా వినకుండా మా మా.మే. త్రీ కేం సెట్టప్పు స్వయంగా దగ్గరుండి అరెంజ్ చేయించాడు. కూర్చున్న వినాయకుడిలా వున్న చారిని అన్ని కేముల్లో క్లొజులూ, వైడ్లూ తీసి చూసి హమ్మయ్యా అని రెడీగా వున్నారు కేమేరామెన్లు.
'పది నిముషాల్లో దుర్ముహూర్తం, మొదలెట్టండో..' అని చారి వెంటాడి వేధిస్తున్నా.. విననట్లు చీఫ్ ఎడిటర్ కోసం అందరం స్టుడియోలో ఎదురుచూస్తున్నాం.
సరిగ్గా పదే పది నిముషాల తర్వాత చీఫ్ వచ్చారు. చారిగారు వెంటనే గుప్పెడు మట్టి, ఒక ఆకుపచ్చ రాతి వుంగరం భక్తిగా ఆయన చేతుల్లో పెట్టాడు.
'అది త్రివేణీ సంగమంలో తీసిన మట్టి, ఏ టెన్షనూ దగ్గరకు రానివ్వదు. ఈ ఉంగరం ప్రత్యేకంగా చెన్నకేశవుడి పాదాల దగ్గరనుంచి తెచ్చాను. నాకీ ప్రొగ్రాం దయచేయించి నన్నూ నా శక్తినీ ఈ ప్రపంచానికి చూపిస్తున్నందుకు మీకు సర్వదా రుణపడి వుంటానూ' అన్నాడు చారి చీఫ్ ఎడిటర్ పట్ల కృతజ్ఞతతో కరిగి నీరైపోతూ.
అందరి ముందూ అందుకుంటే బావుండదని కాస్త ఇబ్బందిగానూ, పోన్లే మట్టీ రాయే కదా అని అనుకొనో, కాస్త నవ్వు మొహంగా అవి అందుకొంటూ...
'మీరు చెప్పిన ప్రతి అక్షరం నిజమవుతుందాన్నారు చారిగారూ, మాట నిలబెట్టుకోవాలి' అన్నాడు మా చీఫ్.
'గ్రహాలు నేను ఆగూ అంటే ఆగూతై, భూత భవిష్యత్ వర్తమానాలు నా కళ్ళముందునుంచే కదులుతాయి' అన్నాడు చారి.
సెట్లో చారి గారి విగ్రహం చక్కగా సూటయ్యింది.
'ఏమిటీ ఆలస్యం మొదలు పెట్టండి ' అన్నాడు చీఫ్.
చారి ఆయన్ని చేయెత్తి ఆశీర్వదిస్తూ....
'మీ చానలూ మీరూ ఉన్నత స్థితిలోకి వెళతారు ' అంటున్నాడు.. అంతలో కేమేరాకి అడ్డం రాకుండా ఉండేందుకు చీఫ్ వెనక్కి అడుగు వేయటం, కేమేరా వైర్లు కాలికి చుట్టుకొని.. వెల్లికలా...
ఎందుకులేండి.. చారి గారి అదృష్టం బావు లేడు.
ప్రొగ్రాం కేన్సిల్.
అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇమ్మని మా మా.మే చుట్టూ తిరుగుతున్నాడిప్పుడు.
అయనకు మంచిరోజులెప్పుడో పాపం!