Thursday, May 16, 2013

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం..


ఈ మధ్య సినిమా కథ ఎలా రాయచ్చో నేను కనిపెట్టా. మొదటి కిటుకు ఏమిటంటే వరసాగ్గా నెలరోజులపాటు టౌన్‌లో ఉన్న సినిమాలు మొత్తంచూసి పడేయాలి. ఆ మానసిక స్థితి సినిమా కథ రాసేందుకు చక్కగా పనికొస్తుంది. ఇప్పుడు  చూడండి. మనకీ జీవితంలో కాస్త ప్రేమకీ, త్యాగానికీ, వళ్లుమంటకీ, ఏడుపులకీ, మనదైన ప్రత్యేకత ఉంటుంది. సినిమాకు ఇవ్వేమీ అక్కర్లేదు. మనం చూసే, వినే ప్రేమకథలు. ఒక్కమ్మాయి ప్రేమలో పడాలంటే మగపిల్లలు చాలా తంటాలు పడాలి. బహుశా తనే ప్రేమిస్తూ వెంటపడుతున్నాడుకదా అని అమ్మాయిలు మరింత గర్వంగా ఆకాశంవైపు చూస్తూ నడుస్తారు. కానీ సినిమా అమ్మాయిలకు ఇవేం అక్కర్లేదు. స్పీడ్‌గా, ఇంకా మాట్లాడితే బైక్‌ని ఒక టైర్‌పైన నడిపిస్తూ అమ్మాయిచుట్టూ గిర్రున తిరిగి, ఓ ఈలవేస్తే చాలు. అమ్మాయి పుస్తకాలు పారేసి డాన్స్‌ కు దూకుతుంది. చూడండి. ఎంత టైమ్‌ కలిసివచ్చిందో. నేనీ విషయం మా కొలీగ్‌కు చెపితే  ఆయన చాలా దిగులుపడ్డాడు. అనవసరంగా ఓ అమ్మాయి చుట్టూ రెండేళ్ళు తిరిగీ తిరిగీ ఆవిడ్ని కట్టుకొన్నాట్ట. మరి టైమ్‌ ఎంత వేస్టో కదా.

ఇంకో ట్రిక్‌ చెబుతాను. ముష్టి పేదవాళ్ళ సెంటిమెంటు సినిమాతీయి, అదిరిపోయే లవ్‌స్టోరీ తీయి, తలకాయలో ఎలాంటి ఆలోచనా లేకుండా ఐటమ్‌సాంగ్స్‌ తీయి, రీజనింగ్‌తో పనిలేదు. పది గాగ్రాచోళీలు, పొట్టొపొట్టిగావుండే డ్రెస్‌లు కొనుక్కొంటే చాలు సగం సినిమా అయిపోతుంది. డాన్స్‌ లకీ పెద్ద కష్టంలేదు. ఓ పదినిముషాలు సీరియస్‌గా కొన్నిసినిమాలు చూసి, ఆ మూవ్‌మెంట్లలో నచ్చినవి మనసులో కాపీ చేసుకొంటే చాలు. కొత్త డాన్స్‌. అసలు మనకు డాన్స్‌ అనేది రాకపోయినా ప్లాన్‌ చేయచ్చు. ఈ మాత్రం  దానికి డాన్స్‌ డైరక్టర్‌కూడా దండగ. డైరక్టరే తిప్పలు పడొచ్చు. సగం సినిమా అయిందా. ఇంకా రెండు ఫైట్స్‌, క్లైమాక్స్‌ వున్నాయి అవీ చెప్తాను. సినిమా తీయటమంత ఈజీయెస్ట్‌ ఇంకేంలేదు. ఇప్పుడు క్రియోటివ్‌గా.. వద్దులేండి అంతమాటేందుకు. ఈ మాత్రం క్రియోటివిటీ ఏం అవసరం వుందీ. ఇందులో పెద్ద కష్టపడేది ఏదీలేదు. ఇరవైమంది ఫైటర్స్‌.. బాగా తన్నించుకొంటారా? ఐదునిముషాల ఫైటింగ్‌సీన్‌లో ఓ ఇరవైసార్లు పడండి. అంటే జంప్‌ చేస్తేచాలు. ఇక్కడ కాస్త క్రియోటివిటీ అంటే వాళ్ళు ఎక్కడెక్కడ పడతారో అక్కడ నీళ్ళొచ్చే పంపులూ, రెండుమూడు బురదగుంటలూ, పడగానే పైకి ఎగిరేలా టమోటాలు, నిమ్మకాయలూ వుంటే చాలు. గ్రాఫిక్స్‌ గురించి కాస్త ఓనమాలు తెలిస్తే చాలు. ఒకే ఒక ట్రిక్‌ని ప్లాన్‌ చేసుకొని, హీరోని ఐదంతస్థుల ఎత్తునుంచి, పరుగెత్తే కార్లపైనుంచి, లారీల అడుగునుంచి బయటకులాక్కొస్తే చాలు. ఫైట్‌ ఫినిష్‌. చూశారా. కథలు రాయటం ఎంత ఈజీనో. వారంరోజులు బండచాకిరీ చేశా, సెలవు పూటన్నా, పిచ్చి ఆఫీస్‌ స్టాఫ్‌ గోలలేకుండా మెదడు స్విచ్‌ ఆఫ్‌చేసి కళ్ళతో మాత్రం ఈ సినిమా చూద్దాం అనుకొనివచ్చే వేలాది మంది సినిమా ప్రేమికులు ఈ దేశంలో కొదువా చెప్పండి. ఉండండి తొందర పడకండి. ప్రతికథా కంచికి వెళుతుందా, లేదా. అలాగే ప్రతి సినిమా ఏదోరకంగా క్లైమాక్స్‌ కు చచ్చినట్లుగా రావాలి. దీనికి అస్సలు కష్టంలేదు. తలాతోకాలేకుండా నడిపించే సినిమాని, ఆ రెండూ కలిపి ముడేయాలి. మధ్యలో అడ్డం వచ్చిన పాత్రల్ని చంపి పడేసో, లేకపోతే దేశాంతరాలకు పంపేసో, ఎలాగోలా వదిలించుకోవాలి. మిగతావాళ్ళు.. ఎందుకులేండి ఇంత పెద్దమాట. ఇంకెవరుంటారూ.... తల్లీతండ్రినీ వదిలించుకొన్నాం. ఫైటర్స్‌ ఆ పూటతోనే వాళ్ళదారి వాళ్ళు చూసుకొన్నారు. హీరో వెనక్కాలతిరిగే పనీపాటాలేని ఐదారుగురు స్టూడెంట్స్‌, అనుచరులు, హీరో హీరోయినూ.వీళ్ళతో క్లైమాక్స్‌. పెద్ద కష్టమా..! సెంటిమెంట్‌ సినిమా అయితే గుమ్మానికి వేలాడి, గాజుముక్క గుచ్చుకొని విడ స్పృహలేకుండా పడిపోతే, డాక్టర్లు మా వల్లకాదంటే, హీరో ఈలతో హీరోయిన్ కళ్ళు తెరిచేలా చేయచ్చు. ఇలాంటి ఐడియాలు మన దగ్గర ఒక కోటి వుంటాయి.

ఇంత గొప్ప అవార్డ్‌ పిక్చర్‌ కథని, ఐదే నిముషాల్లో రాస్తే మీరు షాకైనారా, లేదా. చివర్లో ఎవరైనా ఇలాంటి గొప్ప సినిమా తీయదలుచుకొంటే ఒకే ఒక టెక్నిక్‌ అండీ. సినిమాకథ రాసిన మీకే పెద్దగా నచ్చకపోయినా పర్లేదు. డైరక్టర్‌ ఏడుపుమొహం పెట్టినా లెక్కలేదు. డోంట్‌కేర్‌. అయితే ఒక్క నిర్మాతకు మాత్రం నచ్చాలి. గుర్తు పెట్టుకోండి. ఆయనకే నచ్చాలి. మధ్యలో ఆయనకి పాపం కొన్ని డౌట్లు వస్తాయి. హీరో ఒకే ఒక్కగుద్దుతో 20మంది నుంచి 90మందిని ఎలా తంతాడండీ. తలుచుకొంటే నాకు చేతులు నెప్పుడుతున్నాయి అనేలోగానే ఆయన్ని కనికట్టుచేసి దృష్టి మళ్ళించగలగాలి. అసలా.. ఆ ఫైట్లేనండీ మన సినిమాకు హైలెట్‌ అని వప్పించగలగాలి. ఈ టాప్‌ సీక్రెట్‌ని దృష్టిలో పెట్టుకొన్నారా... సినిమా కథ రాయటం కాఫీ తాగినంత ఈజీ. 

Wednesday, May 15, 2013

ఛానెల్ 24/7 – 6 వ భాగం

( కిందటి వారం తరువాయి) “మీరు సావిత్రిగార్ని సజెస్ట్ చేశారు కదా. ఆవిడ్ని మేనేజ్ చేయగలమా” అన్నాడు న్యూస్ కోఆర్డినేటర్ రమణ. “మనం పట్టాభిగార్ని, వెంకట్రావు, ప్రొఫెసర్ బలరాం ఇంకా మొత్తం పన్నెండుమందిని అనుకొన్నాం. అందులో జయమ్మగారు, సంజయ్‌గారు వేరే లైవ్‌లో ఉన్నారట. పట్టాభిగారు ఆ మూల ఉన్నారు. వెహికల్ ప్రాబ్లం. ఇకపోతే రమణగారూ ఇటు దక్షిణామూర్తిగారిని మన చానల్ చుట్టుపక్కల్నే ఉన్నారు కనుక వాళ్లని అనుకొందమా” అన్నాడు శ్రీధర్.

ఎవరు గొప్ప..


ఒక కవి, మాటలు గురించి ఎంత చక్కగా చెప్పారంటే.. ’కళ్ళు తెరిచినప్పటినుంచి చెవిఒగ్గివినాలనిపించే మాటలు ఐశ్వర్యప్రదాలు, జ్ఞానప్రదాలు, ప్రతిమాటకీ, అక్షరం అక్షరానికీ కృతజ్ఞతలు‘ అన్నారు. నిజమే కదా. మాటలులేని, మాటలువినిపించని ప్రపంచం ఊహించటం కష్టం. ఉత్త కష్టంకాదు అసాధ్యం. అసలు మాటలు ఎంత బావుంటాయో ఒక కథ చెప్పనా. ఇద్దరు జబ్బుగా ఉన్నవాళ్ళు ఓ హాస్పటల్‌లో ఉన్నారు. ఒకతను లేచి కూర్చోగలడు, ఇంకో అతను మంచంలో ఉన్నాడు. లేచి కూర్చొనగలిగిన రోగి, పడుకొనివున్న ఇంకో రోగికి తను కిటికీలోంచి చూడగలిగిన ప్రతిదీ వర్ణిస్తున్నాడు. అటుగావెళ్ళే ప్రేమికులు, పెళ్ళిఊరేగింపులు, నడుస్తూ వేళ్ళే భార్యాభర్తలు, ఒకటేమిటి ఈ ప్రపంచంలోని చైతన్యం అంతా ఆ కిటికీలోంచి చూస్తూ వర్ణించేవాడు. ఓ రోజు అతను చనిపోయాడు. పడుకొనివున్న రోగి తనకు కిటికీ అవతలేముందో చూడాలని వుందని అడిగాడు. ఎందరన్ని అడిగినా ఒకటే సమాధానం. ఆ కిటికీపక్కన ఏమీలేదు. తెల్లనిగోడ. లేవగలిగిన రోగి తనతోటి జబ్బుగావున్న రోగి ఉల్లాసం కలిగించేందుకు కల్పించి చెప్పిన కబుర్లు. మంచంలో ఉండిపోయిన అతనికి ప్రాణం పోసిన మాటలు అవన్నీ. మాటల గురించి ఒక రిపోర్ట్ చదివాను. దానిలో సారాంశం ఏమిటంటే.. ఆడవాళ్లు సగటున రోజుకి ఇరవైవేల పదాలు మాట్లాడితే, మగవాళ్ళు ఏడువేలే మాట్లాడతారట. చూడండి విచిత్రం. ఆడవాళ్లు ఊరికే ఏదేదో మాట్లాడుతూ వుంటారనికాబోలు అర్ధం. సాధారణంగా మాట్లాడే అవసరం ఆడవాళ్ళకే ఉంటుంది. పిల్లలతో మాట్లాడాలి. పెద్దలకు అన్నీ అమర్చాలి. ఇంటాబయటా ఎందరెందరితోనో మాట్లాడితేనే పన్లవుతాయి. మా బంధువు ఒకాయన మొత్తం రోజులలో ఒక్కమాటకూడా మాట్లాడటం నేనువినలేదు. అయినా వాళ్ళావిడ ఆయనకు సమస్తం అమర్చిపెడుతుంది. ప్రశ్న ఆవిడదే, సమాధానం ఆవిడదే. ఏమండీ.. భోజనం చేద్దామా అంటుంది. ఆయన ఆ.. ఊ.. అనడు. రండీ ఒంటిగంటయిపోయిందీ అంటోంది మళ్ళీ. ఆయనలేచి భోజనం దగ్గరనోరు తెరుస్తాడు తినేందుకు. అంతే.  మరి రిపోర్ట్‌లు వస్తున్నాయంటే, రావా. పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. అవునా, కాదా.

మాటలు సరిగ్గా ఉపయోగించగలిగితే అంతకంటే శక్తివంతమైనవి ఇంకొటి ఏమీలేదు. ఒకళ్ళ ఇంట్లో ఒక చార్ట్‌ చూశాను. తెల్లని చార్ట్‌ పైన పొందికగా రాసిన అక్షరాలు. మంచి మాటలు. వేదాల్లో పూర్వికులు, దయగల మాటలతో దానం చేయమన్నారు. ’సంతోషంగా, మనస్ఫూర్తిగా అర్హులైనవారికి దానం చేయండి. అది ఇతరులకు నువు చేసే మేలుకాదు.. నీ విద్యుక్తధర్మం‘. ఆ రోజు ఆ ఇంట్లో నేను కూర్చున్న పది నిముషాలూ ఈ మాటలని చూస్తూనే వున్నాను. మనం తరాలుకానుకగా డబ్బు, ఇళ్ళూ, ఆస్తులూ ఇవ్వాలనుకొంటాం. కానీ కానుకగా ఇవ్వాల్సింది మంచి తనాన్ని, సంస్కారాన్ని. గుణాలు నిజంగా సంతోషపెడతాయి. ఆ ఇంట్లో పిల్లలు గురించి ఓ నిముషం ఆలోచించాను.  శుభ్రంగా, తెలివిగా సంతోషంగా వున్నారు. మనస్ఫూర్తిగా ఇతరులకోసం ఏదయినా వీల్ళు ఇచ్చేయగలరు అనిపించింది. బహుశ నేనుచూసిన చార్ట్‌ని, పిల్లలని పక్కనే కూర్చుని చూడటం వల్ల కావచ్చు. మొత్తానికి వాళ్ళంటి వాతావారణాన్ని అద్భుతంగా మార్చేశాయి ఆ మాటలు.   మరొక్కసారి నేను చదివిన రిపోర్ట్‌ గురించి చెపుతున్నా. నాకెందుకో, ఈ స్త్రీ పురుషుల్లో తేడాలు కనిపెట్టే రిపోర్ట్లు నచ్చనేనచ్చవు. పోనీ ఆ రిపోర్ట్‌ ఆరోగ్యానికీ, భావోద్వేగాలకీ సంబంధించిన రిపోర్ట్‌ లైతే ఫర్వాలేదు. కేవలం ఎవరు తెలివైన వాళ్ళో నిరూపించే రిపోర్ట్ లపై మాత్రం ఎందుకింత సమయం వృధాచేశారో ననిపిస్తోంది. స్త్రీ పురుషుల్లో ఎవరుగొప్ప అయితేనేముంది, మనందరం ఎవరికివాళ్ళుగా ఎప్పుడూ లేము. అందరం కలిసే ఉండాలి. ఆ కలిసివుండటంలో ఒకళ్ళనొకళ్ళు అర్ధం చేసుకోవాలని, సమానంగా వ్యవహరించాలని కోరుకొంటాం. ఎందుచేతనంటే సమానంగావుండే సహజీవనంలో ఆనందం ఉంటుంది కనుక. వ్యక్తులు ఎప్పుడూ వాళ్ళ గుణాలవల్ల గొప్పవాళ్ళవుతారుకానీ ఆడా మగా తేడాలవల్ల మాత్రంకానేకాదు. 

Tuesday, May 14, 2013

మనం ఎలా వున్నాం..?


మనం చాలామందితో కలుస్తూవుంటాం. తప్పకుండా కుశలప్రశ్నలు వస్తాయి. బావున్నారా.. ఉద్యోగం ఎలావుందీ.. కంఫర్టబుల్‌గావుందా అని. ఈసారి సమాధానాలు ఎలావున్నాయో గమనించండి. చాలామందికి ఎందుకో ఏవీ నచ్చవు. వెతికి వెతికి తీసుకొన్న అద్దె ఇల్లు నచ్చదు, కష్టపడి సంపాదించిన ఉద్యోగం నచ్చదు. జీవితం ఎప్పుడూ ఒక వెతుకులాటలాగే ఉంటుంది. ఎందుకిలా..నేను ఇద్దరు అమ్మాయిలను కలుసుకొన్నాను. ఒకామె కాస్ట్‌ ఎక్కౌంటెంట్‌. వాళ్ళ భర్త చేస్తున్న ప్రాజెక్ట్‌లకు సహాయం చేస్తోంది. ఇంకొకామె కంపెనీ సెక్రటరీ.. చాలామంచి ఉద్యోగం.. కాస్ట్‌ ఎక్కౌంటెంట్‌గా పనిచేస్తున్న ఆమెకు వచ్చే జీతం చాలా తక్కువ. అదీ భర్త సొంత ఆఫీస్‌ కనుక బహుశ అసలేమీ ఉండకపోవచ్చు. కంపెనీ సెక్రటరీ అయితే ఏకంగా అప్పటికే మూడు ఉద్యోగాలు మారారు. కొన్నివేలరూపాయలు తేడా అంతే. అయితే స్థిమితంగా మాత్రంలేరు. తను ఇంకెంతో సంపాదించగలిగీ ఇలా ఉండిపోతున్నాననే దిగులుతో వున్నారు. కాస్ట్‌ ఎక్కౌంటెంట్‌కు .. తీరికలేదు. ఉద్యోగంఇల్లు ఇంతే. ఎంత డిప్రెషన్‌లో వున్నారంటే చదివిన చదువు వృధా. పైసా దొరకటంలేదు అన్నది ఈమె వాదన. వాళ్ళతో మట్లాడుతూవుండగానే ఇంకో అమ్మాయి వచ్చి చేరింది. పేరు వందన. చాలా ఇంటరెస్టింగ్‌ పర్సన్‌. ఈమె బాపట్ల వ్యవసాయవిశ్వవిద్యాలయం నుంచి పట్టా తీసుకొన్నారు. కృష్ణాజిల్లా నాగాయలంకలో ఉంటున్నారు. కొన్ని కంపెనీలకోసం ప్రూట్‌ఫల్ఫ్‌ తయారుచేసి ఇస్తారట. కృష్ణాజిల్లాలోవిస్తారంగా పండే ఎన్నో పండ్లనుంచి గుజ్జు తయారుచేసి ప్రిజర్వ్‌ చేస్తారు. ఈమె వుండేది పల్లెటూరు. ఆమె చెప్పిన సమస్య ఏమిటో తెలుసా.. అస్తమానం కరంటు పోవటం గురించి. ఇదే సమస్య. 

ఈమెకు ముందు నేనో మాట్లాడుతూవున్నవిధ్యాధికులు ఇద్దరూ ఎన్నో అసౌకర్యాల గురించి చెప్పారు. వస్తువుల ధరలుధరకు తగ్గ నాణ్యతలేకపోవటం,కిరాయికి తీసుకొన్న ఇళ్ళల్లోవుండే ఇబ్బందులు, అసూయపరులైన చుట్టుపక్కలవాళ్ళు. ఈ ప్రపంచంలో ఒక్క విషయంకూడా వాళ్ళకు ఆనందం ఇచ్చినట్లు నాకు కనిపించలేదు. నా ఎదురుగ్గా కూర్చున్న వందన ఎలాంటి సౌకర్యంలేని ఆ పల్లెటూరు గురించి ఎన్నో కబుర్లు చెప్పారో లెక్కలేదు. ఆవిడ మాటలువింటూ నేను కృష్ణాజిల్లాలోని ఆ పల్లెటూరి రోడ్లపైన విహరించాను. ఎర్రమట్టినేలజున్నుపాలుఅప్పుడేకోసిన కూరలతో భోజనంవందన నన్ను చాలా ఊరించింది. మనిషికి కావలసింది ఏమిటో నాకు ఫజిల్‌ పూర్తిచేసినట్లు తేలింది.  వసంత రుతువులో కోయిల మనల్ని అడిగి పాడదు. ఎప్పుడూ కష్టపడుతూ తేనెటీగ తేనే సంపాదించటంలోనే ఆనందిస్తుంది. మనం కేవలంవసంతరుతువునీవర్షగమనాన్ని ఆనందిస్తూ ఉండలేకపోవచ్చు. కానీ మనకోసంగావున్న ప్రపంచాన్ని ఆనందించి లేకపోవట నష్టంకదా.

 చాలామందికి చాలా విషయాలు బావుండకపోవచ్చు. కానీ అలా బాగాలేనివిలైఫ్‌ కాదు. అవి చిన్నపాటి అసౌకర్యాలు. అంటే వందన అన్నట్లు ‘కరంటు విషయంలోమాత్రం చిరాకొస్తుందండీ. నేను పుట్టినప్పటినుంచి టౌన్స్‌లో పెరిగాను. కొన్ని సౌకర్యాలకు అలవాటు పడ్డాను. కానీ నేనీ పనిని చేతిలోకి తీసుకొచ్చాక మిగతా విషయాలవైపు దృష్టి పోనివ్వలేదు. నేను చదువుకొన్న చదువుకు దగ్గరగా వుండేపని ఇది. ఇంకా చుట్టుపల్లెలనుంచిస్త్రీలసంఘాలు ఏర్పాటుచేశాం. తేనెటీగల పుట్టగొడుగుల పెంపకం ఇలాంటి చిన్నపాటి పరిశ్రమలు నెమ్మదిగా మొదలుపెట్టాం. కొన్నాళ్ళకు అందరిచేతుల్లో డబ్బులుంటాయి‘ అన్నది వందన. వాళ్ళ నాన్నగారు హైద్రాబాద్‌లో లీడింగ్‌ లాయర్‌. అమ్మ డాక్టర్‌. పుష్కలంగా డబ్బుంది. వందనకి ఆ పల్లెటూరు నచ్చింది. నాకు వందన చాలాచాలా నచ్చింది. 

జార్జ్‌ మాసన్‌ యూనివర్శిటీ సైకాలజీ పరిశోధకులు జేమ్స్‌ మాడక్స్‌ చేస్తున్న పరిశోధనల ప్రకారం ’చక్కని తిండికాస్తో కూస్తో వ్యాయామంకంటినిండా నిద్రడాక్టర్‌ చెకప్‌లతోపాటు రోజులో సాధ్యమైనంత సమయం మానసికంగా తృప్తిగా నిర్మలంగా బతకటంకూడా అవసరం. ప్రతి ఒక్కరూ జీవితంలో మనకు తృప్తినీఆనందాన్ని, బాధనీ కలిగిస్తున్న అంశాలేమిటో గుర్తించి, చక్కని వృత్తిచక్కని వ్యాపకం పెంచుకోవాలి. పనిలో ఆనందం అనుభవించాలి. మనం ఏంచేసినా తృప్తిగా చేస్తే నిండు నూరేళ్ళు ఖాయం‘ అంటున్నారు మాడక్స్‌. ఈ సందేశం చాలా బావుంది కదా. సంవత్సరం మొత్తంగా ఇలా తృప్తిగా వుండి చూద్దాం.

Monday, May 13, 2013

సరికొత్త జీవితం..


నేను ఇంతకుముందు ఒక టీవీ కార్యక్రమానికి స్ర్కిప్టు రాసేపుడు,  ఆ కార్యక్రమానికి సంబంధించి చాలా ఉత్తరాలొచ్చేవి. చాలామంది ఉత్తరాల్లో పదే పదే ఆ కార్యక్రమం చాలా బావుందని రాసేవారు.  ఆ ఉత్తరాలన్నీ ఒక వరసలోపెట్టి చూస్తుండేదాన్ని. ఆ ఉత్తరాల్లోంచి నేనువినగలిగే ఒక చక్కని మెసేజ్‌ ఒకటుండేది. ఉత్తరాలలో ఒకేరకంగా 'బావుంది' అన్న మూడే అక్షరాలు కానీ, వాటిల్లోంచి నిశ్శబ్దంగా 'మేము కార్యక్రమం మొత్తంగా చూస్తున్నాం. దాని నుంచి మాకు అందుతున్నది తీసుకొంటున్నాం. మా స్పందన తెలియజేసేందుకు ఉపకరించేది ఈ మూడు అక్షరాలే'కదా అని. అందుకే ఆ ఉత్తరాల్ని కార్యక్రమంలో చదివేవాళ్ళం.

సాధారణంగా, ఒక్కోసారి మెచ్చుకోవటం, మనల్ని గుర్తు తెచ్చుకోవటం కూడా చాలా అవసరం. ఎదుటివాళ్ళ గుండెల్లో, వాళ్ళు ప్రేమతో మన గురించి జ్ఞాపకం ఒకటి వుందికదా అని,  ఆ తీయని అనుభూతికోసం అలాంటి ఉత్తరాలని నేనెప్పుడూ ముట్టుకొంటూ వుంటాను.   సాధారణంగా చూడండి... మన సొంతిల్లయినా..  అద్దెఇల్లయినా దాన్ని శుభ్రంగా వుంచుతూ అందంగా అలంకరిస్తాం. అన్ని ఇళ్ళూ.. ఒకేలాగా ఉండకపోవచ్చు. అది పూరిల్లయినా సరే, ద్వారాలు.. కిటికీలు తెరిచి చల్లని గాలిని, వెలుతురిని ఆహ్వానిస్తాం. ప్రతిపండగకీ తోరణాలు కట్టి, తియ్యటి పిండివంటలు వండుతాం. బంధువులని ఆహ్వానిస్తాం.  ఆహ్వానం అందుకొన్న అందరూ వచ్చి కాస్సేపు మన ఇంట్లోవుండి, వెళ్ళేముందు ఓ మౌనసందేశం వదిలివెళతారు. 'మీ ఇల్లు బావుంది. నీ ఆహ్వానం బావుంది.. అభిమానం బావుంది. నీ ఇల్లు అచ్చం మా ఇల్లులా వుంది అని. ఆ కార్యక్రమం గురించి రాసిన ఉత్తరాల్లోకూడా నాకు ఇదేవినిపిస్తుంది. ఆ కార్యక్రమ స్ఫూర్తితో ఎన్నెన్నో నైపుణ్యాలు నేర్చుకొన్నామని రాసిన వందలాది ఉత్తరాల్లోకూడా ఇదేవినిపించింది. సమయంలేక అందరినీ చూడలేకపోయం, కానీ మన దగ్గరకు ఉత్తరాలసుగంధం మోసుకువచ్చిన శుభసందేశం ఇదే.

ఆ కార్యక్రమానికి వచ్చిన ఒక ఉత్తరం గురించి చెబుతాను. ద్వారక రాశారు. బషీర్‌బాగ్‌లో వుంటారు. ఆవిడ రాసిన ఉత్తరంలో తన ప్రతి మధ్యాహ్నాన్ని ఎంత బాగా వర్ణించారో చెప్పలేను. మధ్యాహ్నాం వాళ్ళవీధిలో పెద్దగా సంచారం వుండదు. కిటికీలోంచి కాస్తంత వంగితే నందివర్ణనం, పచ్చని ఆకులు పలకరిస్తాయట. గాఢమైన ఆకుపచ్చ రంగు, ఆకులమధ్యని గుండ్రని తెల్లని పువ్వులు, వాటిపైనుంచి దూరంగాచూస్తే రోడ్డు.. అప్పుడప్పుడు వాహనాలు... వీటన్నింటిమధ్య నుంచి కనిపించకుండా రెక్కలు అల్లాడిస్తూ ఓ తెల్లని హంస ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటుందట. ఆ హంస ఆవిడ కలల ఊహలు. ఆ కిటికీ ఆవిడ ప్రపంచం. ఈవీథి దాటితే నగరంలోకి అడుగుపెట్టవచ్చు. నాకేం పని ఉంటుంది..? నెలకో సారి ఇంట్లోకి కావలసిన సరుకులు తెచ్చుకోవటం తప్ప. అయినా ఉదయాన్నీ, మధ్యాహ్నాలనీ, సాయంత్రపు చల్లదనాన్ని, నెలవంకనీ ఆమెకు చూపెట్టే ఆ కిటికీ ఇవ్వాళ ఆవిడ మనోప్రపంచంపు మహాగ్రంధం. కేవలం  ఆ కార్యక్రమం వల్లనే నాకీ దృష్టి కలిగింది. నేనిలా ఆలోచించానంటే దీనివల్లనే అన్నారామె. ఎలావుందీ ఉత్తరం? వెతుకుతున్నదేదో నీటి సుసిరం, నీలిసరస్సులా నిశ్చలం. అవునా కాదా? మనం వెతికేది మన మనస్సుల్లోనేవుంది. కాకపోతే దాన్ని తెలుసుకొనేందుకు సమయం పడుతుంది.  ద్వారక ఒక చక్కని కిటికీ తలుపు తీసి చూపించారు. ప్రతిరోజు చూసే నగరం నాకెంత కొత్తగా కనిపించిందో చెప్పలేను. ఏ రోడ్డు కూడలిలోనయినా ఆగి చూడండి. ఒక పక్క మొలుచుకొచ్చిన పువ్వులు, ఫలభరితమైన తోటలుంటాయి. కూడలి, నాలుగు చేతులతో నగారాన్ని మోస్తున్న ఆదిశేషుడిలా ఉంటుంది. సెలవురోజుల్లో పాతపుస్తకాల లైబ్రరీ అవుతుంది. ఇంకా ఎన్ని కనబడతాయో చూడండి. పరుగెత్తుతున్న వేగాన్ని చూడచ్చు. ఆ వేగాన్ని చిటికెలో ఆపేయగల శక్తినీ చూడచ్చు. నవ్వొస్తోందా...! పరుగెత్తే వాహనాల్ని ఒక్క చేతిసైగతో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ ఆపేయ్యడా. ఆ రోడ్డుకి జీవం లేదు. కానీ మనందరంకలసి, పూలమ్మేవాళ్ళు, పండ్లమ్మేవాళ్ళు, నడిచేమనం, వాహనాల శబ్దం.. ఇవన్నీ కలసి ఆ రోడ్డుకి చైతన్యం తెచ్చాం. జీవితానికి అంతే. నిత్య చైతన్యం మనమే.  ఇంత వసంతాన్ని మనలోనే దాచుకొని, ఎప్పుడైనా, వడగాలి­dస్తే.. వడగాలివంటి కష్టాలొస్తే రానీయండి. హాయిగా రెండుచేతులా ఏదిదొరికినా తీసుకొందాం.

మనం జీవితాన్ని కవిత్వంతో పోల్చుకొందాం. కవిత్వం రాయటం ఇష్టం అని చాలామంది అంటుంటారు. నిజంగానే ఏదయినా రాయటంమాత్రం గొప్ప అనుభవం. కవిత్వం రాయటమంటే 'ప్రపంచాన్ని మేల్కొపటం. ఎవ్వరూ లేవకముందు నువు నిద్రలేవటం' అన్నారోకవి. ఇంకా చీకట్లువిడిపోని నగరం మధ్యలో నిలబడి అందరికీ హెచ్చరిక చేయటం. దానికర్ధం, నిద్రలేవండి, రాజీపడకండి, సరికొత్త జీవితాన్ని ఆహ్వానించండి అని చెప్పటమేగా. కవిగారు అన్నట్లు కవిత రాయటమంటే మళ్ళీ మళ్ళీ పుట్టటం, కొత్త ప్రపంచానికి స్వాగతం చెప్పటం. ఏమంటారు?

Sunday, April 28, 2013

నా సాహిత్యంపై డా. శ్రీదేవి సమీక్ష

సి. సుజాత సాహిత్యం- స్త్రీవాద దృక్పథం
డా. కె. శ్రీదేవి,
Associate Professor
Dravidian University
                                                                         
          మానవ  జీవితాన్ని కొన్ని రకాల మూసల్లోకి, నమూనాల్లోకి కుధించివేస్తున్న వర్తమాన ఆర్థిక సందర్భం భయంకరంగా తయారవుతోంది. దీన్ని అరుదుగా తమ కాల్పనిక సాహిత్యంలో సృజనకారులు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్న వారిలో సి. సుజాత ఒకరు. అయితే గాఢత, సాంద్రత వున్న సృజనాత్మక వ్యక్తీకరణ మరింత బలంగా, మరింత విస్తృతంగా రావాల్సి వుంది. మూడు దశాబ్దాల క్రితం వున్న బ్రతుకు తీరుతెన్నుల్ని గమనిస్తే ఇవాల్టి జీవితంలో అమానవీయ ధోరణి ఎంత ప్రమాదకరంగా పరిణమించిందో అర్థమవుతుంది. వీటిని ప్రపంచీకరణ, ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావమనే పేరుతో తేలికగా తీసుకొంటున్నారు.  కాని అలా తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదు. అత్యంత వేగవంతమైన, సాంకేతిక పరిఙ్ఞానం అందుబాటులోకి వచ్చి, మనిషి జీవన  ప్రమాణాన్ని పెంచింది కానీ బుధ్ధి నైశిత్యం మాత్రం సంకుచిత పరుధులకు లోనవుతుంది. దీనిని ఎదుర్కోవడానికి  తాత్విక పరమైన స్త్రీవాద సృజనాత్మక సాహిత్యం ద్వారానే సాధ్యమవుతుంది. రచయితలు ఈ మార్కెట్ మాయాజాలానికి అతీతంగా  విశేష తాత్విక అధ్యయనంతో విశాల దృష్టి కోణాన్ని సంతరించుకోవడం ద్వారానే మంచి సృజనాత్మక  సాహిత్యం లభ్యమవుతుంది..
           సామూహిక లేక నిర్థిష్ట సమాజ సంబంధమైన విషయాలను మాత్రమే ప్రతిఫలించటం వలన,  గత రెండు దశాబ్దాల కాలంలో సాధికారత చేకూరటంతో బలమైన వ్యక్తీకరణకు స్త్రీవాద సాహిత్యం నోచుకుంది.  ఈ తరహా ఆలోచనలు గత రెండు దశాబ్దాల కాలంలో  చాలా వరకు తెలుగు కాల్పనిక సాహిత్యంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.  అందుకు దోహదం చేసిన స్త్రీవాద రచనలలో   సి. సుజాత ఆలోచనలలో స్త్రీవాద దృక్పథం ప్రతిబింబించాయి.
            నాలుగు దశాబ్దాలుగా కాల్పనిక సాహిత్యాన్ని సృజిస్తున్న సి. సుజాత స్త్రీల జీవితాన్ని దాదాపు అన్ని కోణాల్నించి విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. వివిధ పార్శ్వాల నుండి  విడివిడిగా రచనలు చేస్తున్న రచయితల రచనల్లో  సహజంగానే జీవితాన్ని గురించి సమగ్ర అవగాహన   వ్యక్తంకాదనే నమ్మకం వుంది. అలాంటి అవగాహనలను, నమ్మకాలను సుజాత  సునాయాసంగా అధిగమించి  కాల్పనిక సాహిత్యాన్ని సృజించారు. సుజాత ఇంతవరకు మూడు  సంపుటాల కథా సాహిత్యాన్ని,  రెండు నవలల్ని ప్రచురించారు. ”సుజాత కథలు,   ’రెప్పచాటు ఉప్పెన”,  ’సుప్త భుజంగాలు” ప్రచురించడం  ద్వారా  సాహిత్య ప్రపంచంలో సుస్థిర స్థానాన్ని  సంపాదించుకోగలిగినారు. ఇటీవల వచ్చిన నెరుసు కథా సంపుటి,  ‘రాతిపూలు’  నవల రెండు ప్రక్రియలు  కూడా సుజాతను  సీరియస్  స్త్రీవాద కాల్పనిక సాహిత్య కారిణిగా నిలబెట్టడమే కాకుండా ఆమె తన సామర్థ్యాన్ని మరోసారి శక్తివంతంగా ఋజువు చేసుకోగలిగింది.
         స్త్రీవాదం చర్చకు పెట్టిన  పితృస్వామ్య అణచివేత రూపాలైన ఇంటిచాకిరి, లైంగికత, పునరుత్పత్తి హక్కులు లాంటి అంశాలన్నీ సుజాత సాహిత్యంలో ముఖ్యంగా ‘రెప్పచాటు ఉప్పెన’, ‘నెరుసు’ కథా సంపుటాలలోని  కథలు చాలా బలంగా, గాఢంగా స్త్రీవాద తాత్వికతలోని వ్యక్తరూపాలుగా దర్శనమిస్తాయి సంక్లిష్ట సంధర్భాల్లో కూడా సుజాత కథల్లోని పాత్రలు నిరాశలో మునిగిపోవు. పరిస్థితులను అర్థం చేసుకుని, తమంతకు తామే స్వీయ చైతన్యంతో ప్రవర్తిస్తాయి. జీవితానికి కావాల్సిన స్వేఛ్ఛా స్వాతంత్ర్యాల స్వరూపం ఎలా వుంటుందంటే అవి  జీవితాన్ని కోల్పోయేంతగాకాకుండా, జీవితాన్ని కైవసం చేసుకునేంత స్వేఛ్ఛ పొందేవిగా  వుంటాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  ఈమె పాత్రలు జీవితాన్నిఎంతగా ప్రేమిస్తాయో ఆమె కథల్లోని పాత్రలన్నీ అందుకు నిర్వచనంలాగా నిదర్శనంగా నిలుస్తాయి.
          స్వేచ్ఛ అంటే జీవితాన్ని కోల్పోయేలాగా  ఉండకూడదన్న అవగాహన  సుజాతకు వుంది.  జీవితంలో మమేకమైన స్వేఛ్ఛను తమకు కావాల్సిన  లేదా పొందాల్సిన  స్వేఛ్ఛ గురించి తమ పాత్రల ద్వారా శక్తిగతంగా వ్యక్తం చేసే క్రమంలో సుజాత తాను పొందిన  స్వీయ అనుభవ చైతన్యమే ఈ కథల్లో పర్యవసించడం వలన ఈ కథలు ఇంత వాస్తవికంగా potentialగా  తయారయ్యాయని చెప్పవచ్చు.
          స్త్రీవాద సిధ్ధాంతం  ప్రతిపాదించిన లైంగికత వైవాహిక వ్యవస్థపైన చూపిన ప్రభావ ఫలితంగా రూపుదిద్దికున్న భావనలు (concepts) సహజీవనం (living together) స్వలింగ సంపర్కులుగా (Lesbians) ఒంటరి స్త్రీలుగా (Single women) ప్రత్యామ్నాయ జీవన విధానాలుగా చర్చకు వచ్చాయి.   ఈ భావనలన్నింటినీ సి. సుజాత , ‘బీటెన్ ట్రాక్’, ‘చందన’, ‘నా దారిలోనే’  కథల్లో చిత్రించారు.
స్త్రీవాద రచయితగా సుజాత మాతృత్వం పట్ల పితృస్వామ్యం  ఏర్పరచిన భావనలను బద్దలుకొట్టి, పునరుత్పత్తి క్రమంలో స్త్రీలు వంటరివాళ్ళుగా మారుతున్న క్రమాన్ని ‘నేనొక్కదాన్నే’, ‘త్రీఇన్ ఒన్’ కథల్లో చిత్రించారు. పెళ్ళికాకముందు స్త్రీలు చేయని పనులన్నింటినీ ఒకరు చెప్పకుండానే చేసుకుపోయేంత తర్ఫీదును తల్లులు, నాయనమ్మలు, అత్తలద్వారా గ్రహించడం జరుగుతుంది. అందువలననే అమ్మాయిలు ఆటోమేటిక్ గా ఆ పనుల్ని ఒకరు చెప్పకుండానే చేసుకుపోయే తత్వాన్ని ఈ కథల్లో జెండర్ దృక్పథంతో సి. సుజాత చర్చించారు. పుట్టినప్పటి నుంచీ అలవాటు లేని పిల్లల పెంపకం బిడ్డ పుట్టి పెరుగుతున్న కొద్దీ తమ చేతుల స్పర్శ తల్లుల సేవల్లో వాళ్ళెంత హాయిగా, సౌకర్యంగా వుండగలరో తెలుసుకోవటం అంతెందుకు గర్భం ధరించగానే దూకుడు తగ్గించి నడవడం దగ్గర నుంచి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ అమ్మ నాయనమ్మల పర్యవేక్షణలో అమ్మాయిలు తల్లులుగా రూపాంతరం చెందే క్రమాన్ని అర్థం చేసుకోగలుగుతాం. అలాగే చదువుల విషయంలో కూడా చక్కగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించి, వాళ్ళ సంతృప్తిని గెలుచుకోవడం, వాళ్ళందరి దృష్టిలో నమ్రత కలిగిన తెలివైన ఆడపిల్లలుగా ఎలా తీర్చి దిద్దబడతున్న క్రమం ఈమె కథలలో వ్యక్తమవుతాయి.  అందుకే ఆ నియంత్రణ ఆమెపై అధికారపూర్వకంగాకాక ప్రేమ పూర్వకంగా సాగడం వలననే ఆ తీవ్రతను, వత్తిడిని గుర్తించలేకపోతుంది రేవతి. ఈ వరుసలోనే, తల్లితండ్రుల పెంపకంలో పెరిగిన  ఆమె చంద్రాన్ని పెళ్ళాడిన దగ్గరి నుంచీ ఏఇబ్బందీ కలుగకుండా ఒద్దికైన భార్యగా పేరు తెచ్చుకునే క్రమమంతా కూడా ఎవరినీ నొప్పించరాదనే తారకమంత్రాన్ని పఠిస్తే వచ్చిన  అనుభవంగా గుర్తించడంలోనే రేవతి వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. తనకు తెలియకుండా తనను కంట్రోలు  చేయగలిగిన శక్తులన్నింటికి తల వంచింది.  తన జీవితం తన చేతుల్లో కాక మరెవరో గీసిన హద్దుల్లోంచి, ఇంకెవరో డిజైన్ చేసిన జీవితాన్ని ఆ చట్రంలోనే ఆమె జీవితాన్ని ఎవరో పేక్ చేసి ఇస్తున్నారనే భావన కలిగింది. భర్త చంద్రం రేవతికి ఉద్యోగరీత్యా వచ్చిన ప్రమోషన్ ను వద్దని చెప్పదం వలననే, ఆమె అస్థిత్వం ప్రశ్నార్థకమవుతుంది.
ఇన్నాళ్ళు  స్వేఛ్ఛా జీవిగానే బ్రతుకుతున్నాననే తనను నిలబెట్టిన విశ్వాసం ఎంత బలహీనమైనదో అర్థమవుతుంది. రేవతి పర్సనల్, పబ్లిక్ జీవితాలు రెండూ ఎవరి కంట్రోల్లో వున్నాయో , చంద్రం ప్రమోషన్ తీసుకోవద్దని చెప్పినప్పుడు మాత్రమే తన స్వతంత్ర  పరిథి ఎంతో ఆమెకు తెలుస్తుంది. ఇది కొంచెం సినిమాటిక్ గా అనిపించినప్పటికీ రచనలో చూపించిన నైపుణ్యం వలన పాఠకులు  ఒక లోపంగా దీనిని గుర్తించరు.
తన కోసం ఫిల్టర్ చేసిన కాఫీలాగా కాచి చల్లార్చి సిధ్ధం చేసిన జీవితం తన కోసం ఎవరో షేక్ చేసిన జీవితం ...... కంప్యూటర్ లోకి ఎక్కించిన  ప్రోగ్రామ్ లాగా అక్షరం తేడా లేకుండా ఖచ్చితమైన స్టాటిస్టికల్ రిపోర్ట్ లాంటి (పే-)  జీవితం తల్లి నాయనమ్మల చేతుల్లోంచి చంద్రం చేతుల్లోకి మారి పధ్ధతిగా,  నిదానంగా చిక్కుడు పొద మీద పాకే గొంగళి పురుగులా నడిచే జీవితం  తనకు వద్దనుకుంటుంది.  తన జీవితాన్ని గొంగళి పురుగు లాంటిదని Identity అవ్వడం ఏ సొంత ఆలోచనలకూ ఆస్కారం ఇవ్వని జీవితం, పొందికగా తయారయిన జీవితం, ఎలా వుంటే అందరి మన్ననలకు పాత్రమవుతారో అలా తయారైన జీవితం. సమస్త ప్రపంచం ఏమైనాగానీ తాను మాత్రం భద్రంగా గడపాలనే జీవితాన్ని గొంగళి పురుగు నడకతోనే కాదు రచయిత వీళ్ళంతా వెంట్రుకలతో, నల్లగా, నింపాదిగా నడిచే గొంగళి పురుగు స్వరూప స్వభావాలన్నింటితో తనను తాను Identity చేసుకున్న  రేవతి పాత్రలో భారతదేశంలోని 90శాతం మంది మహిళలు Identity అవుతారు.
గంటకొట్టే సరికల్లా తన కాబిన్ లో మనుషులతో సంబంధం లేని జమా ఖర్చుల బిల్లులు చేసే గుమాస్తా  వుద్యోగం , మళ్ళీ గంత కొట్టే సరికల్లా ఇంట్లో వాలిపోయే భార్య ఉద్యోగం, రాత్రి పదింటికల్లా నైటీ తగిలించుకుని శృంగారం కోసం పనికి వచ్చే పనిముట్టుగా స్త్రీలు మారుతున్న క్రమాన్ని కనిపించని నియంత్రణకు కొనసాగింపే స్త్రీల జీవితం అని గుర్తించడంలోనే సుజాత స్త్రీవాద దృక్పథం స్పష్టమవుతుంది.
స్త్రీవాద సిధ్ధాంతం ప్రతిపాదించిన లైంగికత,  వైవహిక  వ్యవస్థపైన చూపిన ప్రభావ ఫలితంగా రూపుదిద్దుకున్న భావనలు సహజీవనం, ఒంటరి స్త్రీగా జీవించే ప్రత్యామ్నాయ జీవన విధానాలుగా చర్చకు వచ్చాయి. ఈ భావనలన్నింటినీ సి. సుజాత ‘బీటెన్ ట్రాక్’, ‘నా దారిలోనే’, ‘చందన’,  కథల్లో చిత్రించారు.
 ‘బీటెన్ ట్రాక్’. కథల్లోని విమల ప్రకాష్ తో సహజీవనం చేయడానికి సిధ్ధపడుతుంది. కానీ పెళ్ళికి వ్యతిరేకం. ప్రకాష్  మూడేళ్ళ సహజీవనం తర్వాత సుఖవంతమైన  జీవితం గడపడానికి పెళ్ళి కావాలనుకుంటాడు. కానీ విమల తన తల్లి, అత్త, అక్క జీవితాల్లోని జవజీవాలను కుటుంబం ఎలా లాగేసిందో గ్రహించి, పెళ్ళి వద్దంటుంది.  కానీ పెళ్ళి చేసుకోక తప్పదంటాడు. విమల అందుకు ఇష్టపడకపోతే,మరో అమ్మాయినైనా పెళ్ళాడతానంటాడు. విమలతో జరిగిన సంభాషణను గమనిస్తే ప్రేమించిన స్త్రీ పెళ్ళికి అంగీకరించకపోయినా, ప్రేమించకపోయినా ఎవరినైనా పెళ్ళాడడానికి సిధ్ధపడుతున్న ప్రకాష్ ది ఎలాంటి ప్రేమో, ఇన్నాళ్ళూ అతనితో సహజీవనానికి ఎలా సిధ్ధపడిందో ఆమె చైతన్య స్థాయిని పట్టించే అంశాలు. కాబట్టి ఇక్కడ ప్రకాష్ మాటల్ని ఖచ్చితంగా ఇక్కడ  పరిశీలించాల్సిన అవసరముంది.
  మనిద్దరి మద్య కాంట్రాక్ట్ కంటే ముందు ప్రేమ కూడా వుంది విమల. మనం మెషీన్లం కాదు, మనుషులం పోనీ ఆ కొత్త మోజులో అర్థం కాలేదు. ఏ లంపటం లేకుండా హాయిగా వుందని అనిపించింది. ఇందులో లోటు నాకు ఇప్పటికి తెలిసింది. నువ్వు ఆలోచించుకో. నీకు నచ్చకపోతే నేను ఇంకో అమ్మాయిని పెళ్ళాడతాను. (పే-89నెరుసు సుజాత కథలు) అంటాడు.
 ప్రకాష్ మాటల ద్వారా పెళ్ళి తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని అతను పట్టపడడంలోని ఆంతర్యం ఏమిటి? అన్న ప్రశ్న కలుగకపోతే రెంటాల కల్పన సి. సుజాత కథలపై రాసిన ‘ తెలుగు కథకులు- కథన రీతులు’  అన్న వ్యాసంలో విమలదే మొత్తం తప్పనిపిస్తుంది. బాధ్యతగా ప్రకాష్ పెళ్ళి చేసుకుంటానంటే విమలెందుకు తిరస్కరిస్తుంది?  అన్న వాదమే నిజమనిపిస్తుంది. విమల స్నేహితురాలు, పెళ్ళి ప్రసక్తి లేకుండా పూర్తికాలం  ఉద్యమ కార్యకర్తగా పనిచేసే నళినీ అభిప్రాయంతో  ఏకీభవించాల్సి వస్తుంది. ఆమె విమలకు చూపిన కారణాలు రెండు:
1.     విమలకు ఒళ్ళు కొవ్వెక్కి పెళ్ళి వద్దనటం
2.     పెళ్ళి వెనుక వున్న అభద్రతను చూసి పెళ్ళి వద్దనటం.
             పెళ్ళిని భద్రతగా భావించే వారున్నట్లుగానే, అభద్రతగా భావించే వాళ్ళు కూడా వుండటం గమనించాల్సిన విషయం. కాబట్టి ఆమె అభిప్రాయాల్లో వాస్తవం పాళ్ళెంతుందో మనందరికీ తెల్సిన విషయమే. మరి సి. సుజాత  నళిని పాత్ర చేత ఒళ్ళు కొవ్వెక్కి పెళ్ళి వద్దన్నట్లుగా ఎందుకు చెప్పించింది అంటే, రచయిత సమకాలీన  ఉద్యమ కార్యకర్తల
అభిప్రాయాలలోని  దుర్మార్గమైన వ్యాఖ్యల్ని  రికార్డు చేయడం కోసమే తప్ప స్త్రీవాద వుద్యమ చైతన్యాన్ని అందిపుచ్చుకున్నవాళ్ళెవరికీ ఇలాంటి అభిప్రాయాలు కలుగవని, ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటాను. 
విమలను నళిని దృష్టితోనో, ప్రకాశం దృష్టితోనో చూస్తే, విమలతో జరిగే సంఘర్షణను  కొంచెం కూడా అర్థం చేసుకోలేం. సమాజంలో ఇంతవరకూ ఎలాంటి విలువలు కొనసాగుతున్నాయో ఆ విలువలకే మళ్ళీ పట్టం కట్టిన  వాళ్ళమవుతాం.  సామాజికుల అభిప్రాయాల కంటే సృజనకారుల దృష్టి, అంతకంటే నిశితంగా విశ్లేషకుల తాత్విక దృక్పథం సునిశితంగా వుంటుంది. వుండాలి. ఈ సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావు గారు గుర్తుకొస్తున్నారు.సమాజంలోని సాధారణీకరణాలను చర్చించడం కన్నా సమస్యాత్మకమైన  సంఘర్షణలను, సంక్లిష్టతలను రచయితలు సాహిత్యీకరించినప్పుడే రచయిత సాధించే సాహిత్య ప్రయోజనం ప్రజలకు అవసరమంటాడు. కొ.కు అభిప్రాయంతో ఏకీభవించడానికి ఎలాంటి సందిగ్దాలు వుండవు. కానీ దాన్ని సాహిత్యానికి అనివర్తింపచేయడంలో మాత్రం మళ్ళీ మొదటికే వస్తాం. దర్నాలు హర్తాళ్ళు నిర్వహించే వుద్యమాల్లో వున్నా నళినీ లాంటి వాళ్ళు సహజీవనాన్ని అంతకంటే గొప్పగా తమ  అవగాహనలోంచి చెప్పే అవకాశం  సందేహాస్పదమే
 పెళ్ళిని స్త్రీవాదులు వ్యతిరేకిస్తారు. ఎందుకు  వ్యతిరేకిస్తున్నారో అందులో వున్న సమస్యలేమిటో  మనకందరికీ తెలుసు. వాటిని అధిగమించడానికి ప్రయత్నించే క్రమంలో ఒకే కప్పు కింద జీవించటం  వలన వచ్చే సమస్యల్ని ఆచరణలో అర్థం చేసుకోకుండా గుడ్డిగా మాట్లాడుతున్నారనిపిస్తుంది. పరిణతి చెందిన వ్యక్తిత్వాలతో, సొంత సంపాదన , సొంత ఆలోచనలు కలిగిన స్త్రీ  పురుషుల మధ్య Flexible relations వుండాలిగానీ విప్పుకునే అవకాశంలేని పీటముళ్ళు కాదు. ఒక సారి పెళ్ళి అన్న బంధంలోకి వెళ్ళిన తరువాత విడిపోవడం గానీ, కలిసి వుండడం అంత సులభంగా జరిగే పనులు కావు. ఒక జీవిత కాలానికి సరిపోయే వేదన అందుకే దాన్నుంచి విమల విముక్తమవ్వాలనుకుంటుంది.
 సహజీవనంలో ప్రకాష్ పనిని శ్రమ అయినా, ఆ పనిని చేయగలిగింది. అలా చేయలేని రోజు దాన్ని తిరస్కరించే అవకాశం వుంటుంది. పెళ్ళిని కూడా అలా తిరస్కరించవచ్చు కదా అనుకుంటే, ప్రకాశ్ కోరుకునే శాశ్వత బంధంలో ఇంటి చాకిరిని, పెత్తనాన్ని తప్పకుండా ఏదో స్థాయిలో ఎంత వద్దనుకున్నా భరించాల్సే వస్తుంది. అందుకే విమల పెళ్ళిని తిరస్కరించింది. ఇక్కడ విమలను శంకించే అవకాశమే లేదు. ప్రకాష్ తో గడిపిన మధురానుభూతుల్నివదులుకోలేక అతనితో కలసి వుండాలనే కోరుకుంది. అని చెప్పడానికి ఈ క్రింది వాక్యాలే సాక్ష్యం.
వేళ్ళ సందుల్లోంచి ఇసుక జారిపోయినట్లుగా చూస్తూచూస్తూ వుండగానేజీవితం మొత్తం చేజార్చుకున్నట్లే వుంది. తెల్లవారే సరికి ఇదంతా ముగిసిపోతుందా? ఇంకేమీ వుండవా? ఏ ఙ్ఞాపకాలు మిగలకుండా, హృదయంపైన ఏ ముద్రలు లేకుండా నేనొక్కదాన్నే ఈ విశాలమైన ఆకాశం నీడలో ఉండిపోతానా? ఆక్ట్ పస్ లా చేతులు జాస్తున్న ఈ నాలుగు గోడల మధ్య నేనిమిడి పోవడం తప్పేనా?........ నిర్మానుష్యంగా నిశ్శబ్దంలో, ఒంటరితనంలో........ ఈ ఆలోచనా క్రమంలో విమల మానసిక స్థితి, ఆమె గురవుతున్న సంఘర్షణల వైనం చాలా స్పష్టంగా వ్యక్తమవుతుంది.
సమాజం రూపొందించే విలువలకు బలయ్యే వాళ్ళు వున్నట్లే ఆ విలువలను తిరస్కరించి తమకు అవసరమైన జీవితాన్ని తాముగా రూపొందించుకునే వాళ్ళు వుంటారు. సమస్యలకు తక్షణ పరిష్కారాలు లభించనప్పుడు వ్యక్తులు తమ సొంత పరిష్కారాలు వెతుక్కుంటారు. తమకు కావలసిన separate space ని peace ని వెతుక్కుంటారు. విమల వెతుకులాటలోంచే తన వునికికి సంబంధించిన ప్రశ్నలు కూడా వేసుకోగలిగింది. సాహచర్యం మాత్రమే Ultimate solution  అని కూడా ఈ కథలో రచయిత ఎక్కడా ప్రస్తావించలేదు.   ప్రకాష్ కు ఎప్పటికప్పుడు తానే ఉతికించి, వండీ, అతని మూడ్స్ కనిపెట్టి..... ఏమిటిది? ఎక్కడ తన ఉనికి? అని సంఘర్షించడంలో సహజీవనంలో కూడా పురుషుని ఆధిపత్య ధోరణి,  స్త్రీల ఇంటి చాకిరి కొనసాగటాన్ని ప్రశ్నించటం ద్వారా సుజాత కథలలో స్త్రీవాదులు ప్రతిపాదించిన సహజీవనం పట్ల వున్న వెర్రి భ్రమలకు గండికొట్టే ప్రయత్నం చేశారు. ఈ కథలో సుజాత స్పష్టమైన వైఖరిని తీసుకోకుండా కేవలం చర్చను మాత్రమే కథనంగా చూపించి, పరిష్కారం పాఠకులకే వదిలేస్తుంది.
 సుజాత ‘బీటెన్ ట్రాక్’  కథాలక్ష్యం పెళ్ళి, సహజీవనాల్లో వున్న డొల్లతనాన్ని బహిర్గతపరచడంలో స్త్రీవాద దృష్టికోణం  ఏమంటే, సహజీవనం, పెళ్ళి నిర్మాణాల్లో వున్న అణచివేత స్వరూపంలో వచ్చే మార్పు కంటే, స్వభావంలో రావాల్సినమార్పు వైపు తన లక్ష్యాన్ని గురిపెట్టడంలోనే ఆమె స్త్రీవాద  దృక్పథం వ్యక్తమవుతుంది.

            స్త్రీలు తమ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను గానీ తారసపడే సమస్యల పట్ల స్త్రీలుగా వర్తించాల్సిన లేదాఅవలంబించాల్సిన వైఖరిని తన కథల్లో ప్రదర్శించారనిపిస్తుంది. ఏవి చర్చించాల్సిన విషయాలో, ఏవి ఉదారంగా ప్రవర్తించాల్సిన విషయాలో కూడా సి. సుజాతకు అవగాహన వుంది. అనే విషయం ఆమె కథలు నిర్వహించిన విధానంలో వ్యక్తమవుతుంది అనడానికి నిదర్శనంగా ‘చందన కథ’  నిలబెడుతుంది. పాశ్చాత్య స్త్రీవాదులు  చర్చించిన స్వలింగ సంపర్కం (లెస్బియన్)  సమస్య వున్న వారిని సానుభూతితో అర్థం చేసుకోవాలనే అభివ్యక్తి, ఆమె కథా లక్ష్యాన్ని సంవిధానాన్ని తెలుపుతుంది.  ఈ కథలో చర్చకు అవకాశం లేదు. కానీ త్రీ-ఇన్ వన్ కథలో కథను నిర్వహించిన తీరుకు ఈ కథా నిర్వహణ తీరుకు వ్యత్యాసం వుంది.   బీటెన్ ట్రాక్ కథను నిర్వహించిన తీరులో  అవలంబించిన ఎత్తుగడ ప్రశంసనీయమైనది.
మధ్యతరగతి జీవితాన్ని గురించి తెలుగులో చాలా విస్తృతంగా స్త్రీల కథలు వచ్చాయి. అయితే  మధ్య తరగతి జీవితాన్ని చిత్రించిన  కథల్లోని పాత్రలు ఆ మధ్య తరగతి చట్రంలో ఇమడలేక, దాన్నుంచీ బయటపడలేక ఒకానొక సంక్షోభంలో కొట్టుమిట్టాడడం కనిపిస్తుంది. ఈ విలువల చట్రాన్ని కొన్ని పాత్రలు అధిగమించి బయటపడగలిగినా ఆ తరువాత  ఆ పాత్రలు ఒక నాస్టాల్జియంలో (ఙ్ఞాపకాల్లో) మిగలటం  లేక మరింత సంక్షోభాన్ని ఎదుర్కొనడం కనిపిస్తుంది. పాత్రల ఈ స్థితికి మౌలికంగా రచయితల మధ్యతరగతి మనస్తత్వం నుంచి బయటపడలేకపోవటం ఒక కారణమైతే, స్త్రీ రచయితలకు మధ్య తరగతి విలువల చట్రాన్ని  అధిగమించే దైర్యం లేకపోవటం కూడా మరో కారణం. అయితే స్త్రీ రచయితలు అలా అధిగమించలేకపోవడంలోని వాస్తవాన్ని విమర్శించటంలో భాగంగా చూడటం సరికాదు. వాస్తవ సమస్యలకు వ్యూహాత్మక పరిష్కారాలు సూచించటం అనేది కాల్పనిక సాహిత్యంలో భాగం. ఆ పని చేయటం  వలననే వర్తమాన ప్రపంచంలో తాత్విక అవగాహన కన్నా సాహిత్య అవగాహనకు ప్రాముఖ్యం ఇవ్వటం జరుగుతుంది.
 తెలుగు కాల్పనిక సాహిత్యంలో స్త్రీ రచయితలు తాము ముందు మధ్య తరగతి మనస్తత్వం నుండి బయటపడగలిగి వున్నట్లైతే, మధ్యతరగతి వెలుపల వున్న జీవితాన్ని గురించి సాహిత్య వ్యక్తీకరణలు చేసి వుండేవారు. అందువలన వాళ్ళ రచనలకు పరిమితులు ఏర్పడ్డాయి. ఈ పరిమితుల్నిఅవలీలగా అధిగమించి సి.సుజాత రంగుల ప్రపంచం వెనుక స్త్రీల అనుభవంలో ఎదురయ్యే అనేకానేక సమస్యలను మన ముందు ఆవిష్కరించారు. మధ్యతరగతి ప్రపంచంలో ఏ విలువలైతే మనిషి సహజ ప్రవృత్తికి అడ్డుగా నిలుస్తాయో, ఆ విలువల్ని చాలా సునాయాసంగా వ్యక్తీకరించటాన్ని ‘రాతిపూలు’ నవలలో చూస్తాం. ఏ విలువల అతిక్రమణ జరిగినప్పుడు మధ్యతరగతి వత్గం గుండెలు బాదుకుంటుందో ఆ విలువల్ని (Corporate Culture) చాలా సునాయాసంగా తృణీకరించింది. ఆ తృణీకరించడంలో కూడా డబ్బు చుట్టూ తిరిగే మాయా ప్రపంచాన్ని అది పెంచి పోషించే కుహనా విలువల్ని తన రచనల్లో ప్రతిపాదించగలిగారు.
తొలి నవలతోనే రచయిత తన దార్శనుకతను, రచనా పటిమను సౌందర్యాత్మకతను, వ్యాకులతను, వాస్తవికత తాలూకు స్వాభావికతను ప్రస్పుటంగా చాటడం చాలా అరుదైన విశేషమైన సన్నివేశం. దోపిడీ పీడనల మధ్య వుండే అవిభాజ్యతను లోతుగా మన ముందుంచింది. ఈ నవల. ‘రాతిపూలు’ నవలలోని పాత్రల యథార్థ జీవితాన్ని అంతర్ బాహిర్ వాతావరణాన్ని, సంక్లిష్ట మానసిక సంఘర్షణలను, సంక్షోభాలను వ్యక్తం చేస్తుంది. టాలెంట్ వుండి కూడా అవసరాల కోసం వాళ్ళ చుట్టూ తిరిగే మహిళా కళాకారుల జీవితాల్లోని వివృత హింసా తత్వాన్ని ఆ క్రమంలో వ్యక్తమయ్యే అనివార్యతను ఈ నవల దృశ్యమానం చేస్తుంది. ఇంతవరకూ media రంగంలో స్త్రీలు పడే హింస పట్ల వున్న అమూర్తతను సి. సుజాత ఈ నవలలో బద్దలు కొట్టగలిగారు. ఆశ్చర్యం, అసహ్యం. అమానవీయ అంశాల సమ్మేళనంలావున్న ప్రపంచంలోకి  పాఠకుని చేయి పట్టుకుని దృశ్య మాధ్యమ రంగభూమికి నడిపిస్తుంది.
 ప్రపంచీకరణ నేపధ్యంతో సాంస్కృతిక విధ్వంసాన్ని ఈ నవలలో ప్రతిభావంతంగా చర్చకు పెట్టగలిగింది. వర్తమాన సమాజంలో స్త్రీ శరీరం డబ్బు ఆర్జించి పెట్టే(Comidity) సరుకుగా మారుతున్న క్రమాన్నిఇంతకు ముందు ప్రక్రియలో వోల్గా,  కుప్పిలి పద్మ లాంటి స్త్రీవాదులు చర్చించారు. కానీ సి.సుజాత  ప్రత్యేకంగా దిశ్య మాధ్యమాన్ని వస్తువుగా ఎంచుకోవడం వలన మరింత సూక్ష్మ పరిశీలనాక్రమాన్ని ఈ నవల అందిపుచ్చుకోగలిగింది.
 స్త్రీలు పురుషులు Career కోసం వెంపర్లాడే క్రమంలో లైంగిక సంబంధాల్లోకి వెళుతున్న క్రమాన్ని సి. సుజాత ఈ నవలలో చర్చించారు. శమంత పాత్ర తన అవసరాల కోసం సురేంద్రతో తనకు గల పరిచయాన్ని వ్యామోహంతో మార్చే క్రమంలో తను నిర్వహించిన పాత్ర సురేంద్రకు గల కొత్తగా పరిచయం పెంచుకునే అవసరాన్ని శమంత ఆసరాగా చేసుకుంటుంది. సురేంద్ర, శమంత పరస్పరం తమ సాన్నిహిత్యాన్ని అవసరాల సంబంధంగానే భావిస్తారు. కానీ  శమంత తన  కుటుంబ సభ్యుల ధనదాహం కోసం సురేంద్ర relation ను కోరుకుంటుంది, సురేంద్ర వాళ్ళ career ను develop చేస్తున్నానన్న భ్రమలో స్త్రీల నుంచి వాళ్ళద్వారా మీడియారంగంలోని వాళ్ళకు అవసరమైన పెట్టుబడిగా, తన finance వ్యాపారాన్ని కొనసాగిస్తూ పైగా అందరి అవసరాలను సమర్ధించే వాడుగా వాళ్ళు భావించేటట్లు అన్ని హంగుల్ని  వాళ్ళకు సమకూర్చగలుగుతాడు. ఈ వాస్తవాన్ని శమంత గ్రహించగలుగుతుంది. సురేంద్ర సృష్టించిన విషవలయం నుండి Identity  తాను రక్షించుకునే క్రమంలో అతన్నే పావుగా మలచుకుంటుంది.
సుజాత ఈ ఎత్తుగడను సాధిఉంచడానికి, శమంత జీవితాన్ని పరాయీకరణ నుండి అధిగమించే క్రమంలో ఆమెకు మీనాక్షి పాత్ర ఎంతగా ఉపయోగపడిందో, చంద్రశేఖర్ పాత్ర కూడా అంతే ఉపయోగపడింది. కళ పట్ల గొప్ప భావుకత కలిగిన చంద్రశేఖర్ వాస్తవ జీవితంలో అవసరాల వెంట పరుగులు పెట్టాల్సిన అవసరం లేనితనాన్ని ఆచరణాత్మకంగా అతని కుటుంబసభ్యులు నిర్వహించే పాత్రను శమంత అర్థం చేసుకోగలిగింది.దృశ్య మాధ్యమ రంగం కోసం తనలోని కళా తృష్ణను ఫణంగా పెట్టలేక తల్లి నిర్వహించే నర్సరీ వ్యాపారాన్ని అందిపుచ్చుకోవడమే కాకుండా కళను వ్యాపారం కాకుండా కాపాడుకోగలుగుతాడు.కళను వ్యాపారంగా చూడటం, చేయటం కంటే వ్యాపారాన్ని వ్యాపారంగా నిర్వహించేందుకు చర్దశేఖర్ సిధ్ధపడటం ద్వారాశమంత జీవితం కోల్పోకుండాచేయడంలో కూడా ప్రత్యక్ష్యంగా తన పాత్ర ఏ మాత్రం లేకుండానే శమంతను ప్రభావితం చేయగలుగుతాడు. ఆ చైతన్యం లోంచే భాను జీవితాన్ని శమంత తీర్చిదిద్దగలిగింది. అనడం కన్నా పరోక్షంగా శమంత భాన్ కలల ద్వారా తన జీవిత లక్ష్యాన్ని నిర్ధేశించుకోగలిగింది అనడం సమంజసం.
పెట్టుబడిరూపాలు మారుతూ వస్తున్నాయి. మూడు నాలుగు దశాబ్దాల ముందు సాహిత్య సృజనలో దోచుకునేవాడు, దోపిడీకి గురయిన వాడు చాలా స్పష్టంగా కనిపించేవాడు. కానీ వర్తమాన సంక్లిష్ట జీవన వ్యవస్థలోకి పరిణమించిన ఆధునికత వ్యక్తులు తమకు తాముగానే దోపిడీకి గురవడానికి అనుగుణంగా  సిధ్ధపడటం అనేది పరిణతి చెందిన ప్రపంచీకరణ స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది.శమంత పాత్రనుశక్తివంతంగా మలచడంలో రచయిత స్త్రీవాద దృక్పథం ఆవిష్కరింపబడుతుంది. శమంత ఏ అవసరాల కోసం తనను తాను Comidity గా మలుచుకుందో, ఆ చట్రంలో నుంచీ అంతే జాగ్రత్తగా బయటపడినట్లుగా చిత్రించడం వలన దృశ్య మాధ్యమ రంగంలో(media) చిద్రమవుతున్న వాళ్ళు ప్రత్యామ్నాయ జీవన శైలుల్ని వెతుక్కోవటం ద్వారా ఈ సమస్యకు పరిశ్కారం అందించగలిగారు
ఎక్కడా సిధ్ధాంత రాధ్ధాంతంగానీ, ఉపన్యాస ధోరణి గానీ కనిపించకుండా వున్నది వున్నట్లుగా తన అనుభవాలను మన ముందుంచడం ద్వారా తన దృక్పథాన్ని ప్రత్యేకంగా ఇది అని సుజాత వ్యక్తీకరించాల్సిన అవసరం కలుగదు. తనకు పరిచయం వున్న పరిసరాలను కథా వాతావరణంగా మార్చుకోవడంలో సుజాతకు గల నిశిత పరిశీలనాశక్తి, నైపుణ్యం ఆమె సాహిత్యంలో ఆవిష్కృతమవుతుంది. తను చెప్పదలుచుకున్న విషయాల్ని ప్రతిపాదించడంలో ఈమెకు బలమైన (Connection) వుంది.
శరీరానికి మనస్సుకు వున్న సంబంధాన్ని గురించి గత మూడు నాలుగు కాలంలో మౌలిక భావనలు ముందుకు వచ్చాయి. డెరిడా, పుకోవ్ లాంటి తాత్వికులు సంప్రదాయికంగా వస్తూ వున్నకాట్రిషియన్ ద్వంద్వాన్ని తిరస్కరించి శరీర కేంద్రకంగా అలవడిన సంబంధాలు ఎలా రూపొందుతున్నాయో, ప్రతిఘటింపబడుతున్నాయో చర్చించారు. వీళిద్దరు

తాత్వికులు శరీరం.(Body), మనస్సు(mind)  ల మధ్య వున్న ద్వంద్వాన్నితిరస్కరించారు. పితృస్వామిక సమాజం  నిరంతరం పురుషుడ్ని మనస్సుతోను,  స్త్రీని శరీరంతోనూ గుర్తించి, జత చేస్తూ వచ్చింది. అందువల్ల స్త్రీవాదులు పితృస్వామిక వ్యవస్థలో స్త్రీల శరీరాల మీద కొనసాగుతున్న నియంత్రణను అణచివేతను గురించి ప్రధానంగా చర్చించారు.
1990ల నుంచి తెలుగు సాహిత్యంలో స్త్రీవాద భావజాలం వాస్తవికతా పునాది మీద నిలబడడానికి, Second thought of feminist out look అభివృద్ధి చెందడానికి సి. సుజాత కృషి (Contribution)ని కూడా పరిగణనలోనికి తీసుకోవాల్సి వుంటుంది. రెండు దశాబ్దాల తెలుగు స్త్రీవాద సాహిత్యానికి, ఒక కాల్పనిక రచయితగా ఆమె చేసిన దోహదం  చాలానే వుంది.
సాహిత్యం నవల, కథానిక ఇలా ఆమె రచనలు  ఏరూపంలో వున్నా వ్యక్తి జీవితానికి భరోసా ఇవ్వగలగడమే కాక, వ్యక్తి భావుకతను, విశ్లేషణ శక్తిని పెంచగలుగుతాయి. అలాగే వ్యక్తి తన Identity ని assert  చేసుకోగలిగే ధీమా కూడా ఇవ్వగలగాలి.   స్త్రీల జీవితాలలో నిర్ణయాధికారాన్ని స్వీయ యాజమాన్యాన్ని  పెంచే ఈ మూడింటిని సుజాత కథల్లో చూడగలం.
రెండు దశాబ్దాల కాలం నుంచి ఆర్థిక సరళీకృత విధానాల నేపథ్యంలో డబ్బు సంపాదన గురించి గర్వంగా చెప్పుకున్నారు. అది సంబంధాలను నిర్ణయించే స్థితిని ఏ వ్యతిరేఖత సంఘర్షణకు అవకాశం లేకుండా అమోదిస్తున్నారు. ఈ క్రమం గత తరానికి మింగుడు పడడం లేదు. మారుతున్న విలువల్ని అంగీకరించడం కష్టం అందుకే శమంత, కుమారి జీవితాల్లోని Extra Marital relations ని ఆమె  మిత్ర బృందం అంగీకరించినట్లుగా శకుంతల తల్లి జీర్ణం చేసుకోలేకపోయింది. కానీ అదే తరానికి చెందిన శమంత  అత్త, మామ మాత్రం తమ తరానికి అతీతంగా వ్యవహరించి,   నీతి నియమాల్ని పక్కకు నెట్టేస్తారు ఈ కథల్లోని పాత్రలు తమ జీవితాల్లో ప్రవేశించిన పరాయీకరణను గుర్తించి వాటిపట్ల తమ నిరసనను ప్రకటిస్తాయి. క్రోటన్స్ కథలోని సౌమ్యలోని భావుకత డబ్బు సంపాదనలో Burden గా అనిపిస్తుంది. స్వాతి burden relevant గా అనిపిస్తుంది. Hero కు Self Centered, career oriented Generation Marge అయిన క్రమాన్ని ఈ కథల్లో సి. సుజాత నిరూపించడం  జరిగింది.
సుజాత సాహిత్యంలో వస్తు శిల్పాల ఐక్యత ప్రశంసించాల్సిన విషయం. అభివృధ్ధికరమైన భావాలతో కూడిన వస్తువు ఎంత అవసరమో ఆ భావాలను ప్రకటించడానికి రచయిత అనుసరించే ప్రక్రియా, రచనా శిల్పం లోప రహితంగా వుండటం అంతే అవసరం. చిన్న కథకు సరిపోయే యితివృత్తంలో నవల రాయటం, నవల రాయటానికి సరిపోయే విశేషాలను చిన్న కథలో ఇరికించడం. ఈ రెండూ ప్రక్రియల్లో రచయితలు  చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. కానీ సుజాత కథల్లో వస్తు పరిథిని, ప్రయోజనాన్ని కూడా ఆమె గమనంలో వున్నాయని ఆమె అధ్యయనం చేసుకున్నప్పుడు  తెలిసే విషయం. రచయిత ముందుగా తాను తన రచనల వల్ల  సాధించదల్చిన ప్రయోజనాన్ని  గురించి స్పష్టంగా తెలిసినపుడే దాన్ని సాధించడానికి ఏ ప్రక్రియా నిర్మాణం ఆ ఆలోచనకు సరిపోతున్న అవగాహన కలిగి వుంటారు. వర్తమాన కథా రచయితలు చాలా మంది ఈ విషయంలో పొరపాట్లు చేస్తూనే వున్నారు.
కానీ సుజాత తాను చూసిన జీవితాన్ని ఆవిష్కరించటానికి ఆమె ఎన్నుకున్న పాత్రలు, ఆ పాత్రల భావాలు, సన్నివేశ కల్పనలు, సంభాషణలు ఆమె సాహిత్య శిల్పాన్ని సమర్థవంతంగా మలచగలిగాయి. పాత్రల భావాలకు, పాఠకులకు మధ్య  అడ్డుగోడగా నిలచే వారెవరూ వుండరు. ఎలాంటి గందరగోళం. అస్పష్టతా లేకుండా పాత్రల స్వభావాలు పాఠకులకు అర్థమవుతాయి. స్త్రీల వుద్యమాలతో,  స్త్రీల సమస్యల పట్ల సహానుభూతి వుంది.  అలా లేనిపక్షంలో ఇంత శక్తివంతంగా స్త్రీల సమస్యలను ఆవిష్కరించలేరు. పాత్రల అనుభూతులతో కలసిపోయి వుండటం వలననే ఆసక్తి పెరుగుతుంది. ఎక్కడా ఈమె శైలిలో కఠినమైన, కృత్రిమమైన పదాలకు గానీ భావాలకు గానీ ఆస్కారం లేకుండా చాలా సహజంగా అలవోకగా రచన చేయటం ఈమె ప్రత్యేకత. ఈ ప్రత్యేకత వలననే ఈమె సాహిత్యం తెలుగు స్త్రీవాద సాహిత్య గమనం ఉదారవాద దశ నుంచీ సోషలిస్టు స్త్రీవాద భావజాల ఆవిష్కరణతో తన గమ్యాన్ని నిర్దేశించుకోవడం వలన స్త్రీవాద సాహిత్య సృజనలో విశిష్ట  స్త్రీవాద రచయితగా తన స్థానాన్ని పదిలంగా పొందగలిగారు.

Friday, April 19, 2013

ఛానెల్ 24/7 – 5 వ భాగం

http://www.saarangabooks.com/magazine/?p=1993