Thursday, March 31, 2016
చాలా రోజుల తర్వాత ఒక అందమైన దృశ్యం
చూశాను. హీరో చిరంజీవి కూతురు శ్రీజ
పెళ్ళి సందర్భంగా వాళ్ళ ఇంట్లో వున్న హీరోలందరూ హుషారుగా ఆనందంగా ఆ పెళ్ళిని
సె'లబ్రేట్ చేసుకుంటున్న దృశ్యం. ఆ పార్టీలో సినిమాల్లోని తన పాటలకు తనే డాన్స్ చేశాడు
మెగాస్టార్. టీవీల్లో కోట్లమంది ఆ విజువల్స్ చూసి తరించారు. శ్రీజకి అది రెండో పెళ్ళి.
ఎవరేమనుకొన్నా, ప్రజల్లో తమపట్ల వుండే క్రేజ్, గ్లామర్ పోతే పోయినా, ఎవరేం అనుకున్మా.. మా పిల్ల జీవితం
బావుంటే చాలు, మా బిడ్డ ఎలాంటి పొరపాట్లు చేసినా, మా గుండెల్లో పెట్టుకుంటాం,
వాళ్ళు సుఖంగా సంతోషంగా వుండేలా తల్లిదండ్రులుగా మేం చేయగలిగినంతా చేస్తామని
ప్రపంచానికి తేల్చి చెప్పారు వాళ్ళు. సినిమా యాక్టర్లు అందంగా వుంటే.. స్టెప్స్
వేస్తే.. డ్యూయెట్స్ పాడితే ఆనందించి, ఫ్యాన్స్ అయిపోయే వాళ్ళు ఇలాంటివి ఆదర్శంగా
తీసుకొంటారా..? తమ ఇంట్లో ఓ ఆడపిల్లకు ఏదైనా సమస్య వస్తే, చుట్టూ జనం కాలువలో దూకిచావనీ..
మాకేం మా పిల్ల మాకెక్కువ, దాన్ని మేం కాపాడి రక్షించు కుంటాం అని ప్రతి తల్లితండ్రీ
ఎందుకు అనుకోరు. ప్రేమించినవాడు కాదంటే సాప్ట్ వేర్ ఇంజనీర్ రీనా ఈ మధ్యే ఆత్మహత్య
చేసుకుంది. ఆ అమ్మాయికి, నా కోసం చేతులు జాపే తల్లిదండ్రులు ఉన్నారనే నమ్మకం కన్న వాళ్ళు ఎందుకు ఇవ్వలేక పోయారు...? పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి..? పెళ్ళి చేసుకుని,
ఎలాంటి భయం సంకోచం లేకుండా భార్యల గొంతు నులిమే భర్తలు ఇవ్వాళ్టికీ పూటకోకడు
ఎందుకు కనిపిస్తున్నారు...? కన్నవాళ్ళు,
పిల్లల వెనక్కాల కొండంత అండగా ఎందుకు కనబడరు..? తనుపెట్టిన గుడ్లు తామే తినేసే పాముల్లాగా
ఎందుకున్నారు...? ఫ్యాషన్ డిజైనర్ ఒక డ్రెస్ కుట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు కుట్టబోయే
క్లాత్ కొలతలు తీసుకుని శ్రద్ధగా గీత గీసి పర్ ఫెక్ట్ గా అనుకున్న రూపం పోసినట్లు
జీవితం మన చేతులలోనే వుంది. దాన్ని కరక్ట్ గా తీర్చిదిద్దు కోవచ్చు. కుటుంబాల్లో కష్టనష్టాలొస్తాయి, నిలబడమా..? బిడ్డ పుట్టిన క్షణం చేతుల్లోకి
తీసుకుంటే అమాయకంగా వళ్ళు విరిచి నిశ్చింతగా మన చేతుల్లో నిద్రపోతున్న బిడ్డ,
పెరిగి పెద్దయితే మాత్రం ఆ కాస్త నమ్మకం మనం ఇవ్వ లేమా..? ఎలాగైనా శ్రీజ విషయంలో
మాత్రం నువు మెగాస్టార్.. హీరో నంబర్ వన్ వే..
చిరంజీవి సార్.. కంగ్రాట్స్.
Friday, November 22, 2013
వరంగల్
కాకతీయ యూనివర్శిటి అనుబంధంగా కొత్తగా మొదలు పెట్టిన పోస్టు గ్రాడ్యుయేషన్ మహిళా
కళాశాల తెలుగు ఎం.ఏ. సిలబస్ నాలుగవ పేపర్ గా ‘మహిళాజీవిత అధ్యయన సాహిత్యాన్ని’ ఎంపిక
చేశారు. ప్రొ. కాత్యాయని విద్మహే, మహిళల జీవితం
గురించి విస్తృతంగా అధ్యయనం జరగాలని ఈ పేపర్ తప్పనిసరిగా సిలబస్ లో వుండాలని పట్టుబట్టారు.
ఈ పేపర్లో మహిళల కథలు, కవితలు, సబ్జెక్ట్స్ గా వున్నాయి. కథా విభాగంలో మట్టిగోడలమధ్య
గడ్డిపోచలు (శివరాజు సుబ్బలక్ష్మి), ప్రయాణం (అబ్బూరి ఛాయాదేవి), త్రీ ఇన్ ఒన్ (సి. సుజాత), బచ్చేదాని (గీతాంజలి) ఎంపిక చేశారు.
నా
కథ ‘త్రీ ఇన్ ఒన్’ ఎంపికైనందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ఈ కథలో ఒక తరం స్త్రీకి
నేను నిర్వచనం చెప్పాను. ఇరవైయేళ్ళ తర్వాత కొత్తతరం స్టూడెంట్స్ ఈ కథను
చదువబోతున్నారు. స్త్రీల జీవితంలో కొత్తగా మార్పులేమైనా వచ్చాయా.. అలాగే వున్నారో..నేనూ
తెలుసుకోబోతున్నాను. ఈ కథ తెలుగులో, ఇంగ్లీషులో ఈ బ్లాగులో అందుబాటులో వుంది. మీ
అభిప్రాయం చెప్పండి.
ఇంగ్లీష్ లోకి ఈ కథను డా. హరిబండి లక్ష్మి ట్రాన్స్లేట్ చేశారు.. ఇంగ్లీషులో ఈ కథను చదవాలనుకొంటే ఇక్కడ క్లిక్ చేయండి.
http://csujatha.blogspot.in/2011/09/three-in-one.htmlSaturday, October 5, 2013
ఇవ్వాళ ఈ పాట నచ్చని కుర్రాళ్ళు లేరు. ఎందుకంటే పవన్
కళ్యాణ్ గొంతులోంచి విన్నారుకనుక. ఏనాడూ సీమ జానపదులు కట్టుకొన్న పాట ఇది.
ఇవ్వాళ్టికి దేశాన్ని ఉర్రూతలూగిస్తోంది. అర్దం ఇంకా బావుంది. తెలుసా..
బేట్రాయి
సామి దేవుడా నన్నేలినోడ
కాటమ రాయుడా
కదిరీ నరసింహుడా
మేటైన ఏటగాడ
నిన్నే నమ్మీతిరా
సేప
కడుపు సీరి బుట్టితి
రాకాసి
దాన్ని కోపాన తీసి కొట్టితీ
కోటిమన్ను
నీళ్ళలోన యెలిసీ యేగమై తిరిగి
బాపనోళ్ళ
సదువులెల్ల బ్రహ్మదేవర కిచ్చినోడ
అత్తారింటికి దారేదీ సినిమాలో
పవన్ కళ్యాణ్ సంతోషంగా పాడిన పాట అందరూ చూసే వుంటారు కదా. పాట అర్ధంకూడా ఎంతో
బావుంది. బేట్రాయి సామి దేవుడా.. పాటలో ఒక్కో చరణం.. దశావతారాల్లో ఒక్కో అవతారాన్ని
మాండలిక పదాలలో వినొచ్చు.
చేపగా పుట్టి సోమకాసురుడ్ని
చంపి వేదాలను (బాపనోళ్ళ చదువును) తిరిగి బ్రహ్మ (బెమ్మదేవర) దేవుడికి ఇచ్చిన
మహావిష్ణువు పొగిడే పాట ఇది.
చేప
కడుపు సీరి పుట్టితి
రాకాసి
దాన్ని కోపాన తీసి కొట్టితి (సోమకాసురుడ్ని చంపి)
కోటిమన్ను
నీళ్ళలోన యెలిసీ యేగమై తిరిగి
అవసరంకోసం
దండిగావున్న నీళ్ళలో తిరిగి తిరిగీ వేదాలను తిరిగి వెనక్కి తీసుకు వచ్చాడని అర్ధం.
బేట్రాయి
సామి దేవుడా..
అనంతపురం జిల్లా కదిరిలో
నరసింహస్వామి దేవాలయం వుంది. హిరణ్య కశిపుడిని చంపేశాక ఈ ప్రాంతానికే నరసింహస్వామి వచ్చాడని, అలా
ఆగ్రహవేశాలతో వచ్చిన స్వామి, ఇక్కడ అడవిలో క్రూరజంతువులను వేటాడాడని, అందుకే
ఆయన్ను వేటరాయుడు అంటారని చెబుతారు. వేటరాయుడు కాస్తా జనవ్యవహారంతో బేట్రాయుడు
అయింది. అలాగే ఇదే జిల్లాలోని గొడ్డు వెలగల గ్రామానికి ఎదురుగావుండే గుట్టపైన ఇంకో
నరసింహస్వామి వున్నాడు. ఆయన్ను కాటేమిరాయుడు అంటారు. అంటే కాడ అంటే అడవి, అడవిలో
వుండే దేవుడు కనుక ఆ పేరు వచ్చి వుంటుంది.
కదిరి, గొడ్డు వెలగల నరసింహులిద్దరినీ కలిపి కట్టిన పాట..
బేట్రాయి
సామి దేవుడా నన్నేలినోడ
కాటేమి
రాయుడా కదిరీ నరసిమ్ముడా..
ఇలా మంచి మంచి జానపద
గీతాలన్నీ పవన్ కళ్యాణ్ పాడేస్తే..
థాంక్స్ టు పవన్ కళ్యాణ్. నీ వల్లనే పాట ఇంత మంది నోళ్ళలో నానుతోంది.
Thursday, May 30, 2013
ఒక
దీపం నీ వెనగ్గా
కదలకుండా..
పెదవి కదపకుండా నువు
ఎలా
వచ్చావో.. ఎలా వెళ్ళిపోయావో..
రెంఢూ
ప్రశ్నార్ధకాలే
దీపం
గాలికి రెపరెప లాడింది
ఉలిక్కిపడి
చేయిచాస్తావేమో ననుకున్నా
నేనొచ్చినా
చిన్న నవ్వయినా లేదు
పలకనందుకూ..
పడుకుండి పోయినందుకూ
నీ
చుట్టూ సమూహాలు చూస్తున్నాసరే
ఎంతలా
అరిచానంటే
నువు
విననట్లే వున్నావు మరి
ఎన్నిసార్లు
అలా నిర్లిప్తంగా లేవు నువు
జీవితం
మొత్తంగా ఎన్నిసార్లు
నే
కన్నీటి సంద్రమయినా
అందులో
నువు మునుగుతూ తేలుతున్నావని
నాకు
ఖాయంగా తెలుసు
అందుకే
నా ఏడుపుని నీ చేతుల్లో పెట్టేను తప్పించి
మిగతా
భారమేదీ లేదు నాకు
ఇప్పుడు
చూశావూ.. నువు ఏ భారం
తీసుకోవని
తెలిశాకే అసలైన భయం
ఎప్పటికీ
నా భయాలన్నీ నేనొక్కదాన్నే
భరించాలన్న
భయం వెన్నులో పాకుతోందే అమ్మా..
నిజంగా
భయంగా వుందే
నాకు
తెలుస్తూనే వుంది నా చేతులు వదిలావని
వెళ్ళేముందు
నీ ఎదురుగ్గా నేను
చూపు
నిలవని కళ్ళతో నువు.. చూసింది నన్నేనా
లాక్కుపోతున్న
ప్రాణశక్తి నిలుపుకోవాలనే
నీ
తపన నన్ను తాకిన నీ చేయి చెపుతూనే వుంది
నాకు
తెలియదనుకొన్నావేమో
నీ
నొప్పిని నరనరానా నేను
అనుభవించలేదనుకొన్నావేమో
ఈ
ప్రపంచంలో మొట్టమొదటిసారిగా
నువు
లేకుండా నేను నిలబడే క్షణం గు రించి
నాకు
భయం వేయదని నువ్వెలా తీర్మానించుకొన్నావే
ఈ
ప్రపంచం నాకెంత తెలుసనీ.. తెలిస్తే
గాలికి
ఎగిరిన నీ ప్రాణాన్ని అలా చేత్తో అందుకొనే దాన్నిగా
ఈ
ప్రపంచం నాకెంత పరిచయమనీ
నా
చుట్టూవున్న ఈ ఏ ఒక్క మనసునన్నా
ఒక్క
క్షణం చదవగలనా
ఈ
ప్రపంచం నా కెంత అనుభవమనీ
కొన్ని
వందల గంటలు నీ ఎదురుగ్గావున్నా
నా
కళ్ళముందే మాయమైపోతున్న
నీ
జాడ అణువంతయినా నాకు తెలిసిందా
ఈ
ప్రపంచం నా కెంత సన్నిహితమని
నా
కిష్టమైన నువ్వే చేజారినా నాకు కాస్తయినా
కబురు
అందలేదే
అమ్మా
అందుకే భయంగా వుందే
నేనిక్కడున్నా
ఎలాగూ మాయమౌతా
నే
కట్టుకొన్న చిన్నారి గూడు
నాది
కాకుండా జారిపోతూ
మన
చుట్టుబంధాలు ఎలా తెగి ముక్కలవుతాయో
నిన్ను
చూస్తూంటేనే తెలిసిపోయింది
నాదైనదేదీ
ఇక్కడ శాశ్వతంగా ఉండదని
నేనున్నదీ
నిజం
నేనెక్కడా
లేనిదీ నిజం
నాకు
హక్కులేని ఈ క్షణంలో నేనున్నాననీ తెలుసు
నువు
నవ్వుకొంటున్నావనీ నాకు తెలుసు
నిన్నే
లాక్కుపోయిన కాలం
నన్ను
మాత్రం ఎలా వదులుతుంది
ప్రయాణం
మొదలు పెట్టాను
త్వరలోనే
కలుస్తా
Thursday, May 23, 2013
Saturday, May 18, 2013
కొందరు కబుర్లు చెపుతుంటే... అదో
సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. పద విన్యాసాలూ, మాటల కూర్పులూ, పదాల కూర్పులూ ఎప్పటికప్పుడు కొత్తగా
ఉంటుంది. కబుర్లు చెప్పటం, సందేహం లేకుండా చక్కని ఆర్టే. ఒక చక్కని వ్యాసం
చదివాను. పోతన రాసిన భాగవతంలో వామనుడు బలి చక్రవర్తినుంచి మూడడుగుల నేలను దానంగా
తీసుకొన్నాక, భూమినీ ఆకాశాన్ని శరీరంతో కప్పిన వర్ణన
ఏ మూవీ కెమేరాలకు కూడా అందనట్లుగా ఉంటుంది.
ఆకాశాన్ని దాటి, మేఘరాసిని దాటి, తారాపథాన్నిదాటి, విశ్వమంతా తానే నిండివున్నాడంటారు పోతన. ఇది ఏ కంప్యూటర్
గ్రాఫిక్స్ కు అందుతుంది....? ఇలాంటి ఎన్నో ఉదాహరణలతో ఓ రచయిత్రి
చక్కని వ్యాసం రాశారు. చదువుతుంటే విశేషాలు తెలుస్తాయి. రకరకాల మాటలు ఉపయోగించటంలో
అవతలివాళ్ళ టెక్నిక్‌లు తెలుస్తాయి. ఇవన్నీ తెలిస్తే చక్కగా కబుర్లాడటం
తెలుస్తుంది. సో.. మనం చక్కని కబుర్లు చెప్పాలంటే చక్కగా చదవాలి. ఈ చక్కని ఊహ
చూడండి. కవికి అర్ధరాత్రి వేళ ఎందుకో మెలకువ వచ్చింది. కిటికీలోంచి, నిద్రజారని కళ్ళతోచూస్తే, చల్లని
తెల్లని ఎండలాగా అనిపించిందట. ఎండలో ఇంత ప్రశాంతత ఎలా వుందా అని ఆలోచిస్తుంటే, అది
అర్ధరాత్రివేళ కాస్తున్న వెన్నెల అని తేలిందట. నిశాదేవి కట్టుకొన్న నల్లని చీరెపైన తళుకుమన్న జరీపువ్వుల్లాగా నక్షత్రాలు
మెరుస్తుంటే, లోకమంతా చల్లని వెన్నెల వాన
కురుస్తోందట. దీన్ని వర్ణించాలంటే ప్రకృతిని ఎంతగా ప్రేమించాలి...? ఎంత ఉత్సాహభరితంగా జీవించటాన్ని నేర్చుకోవాలి....? రచయిత ఏమంటారో చూడండి. ఆరుబయట నిద్ర చలిగా, వెన్నెలగా వుంది. మంచు బొట్లు రాలే శబ్దం అన్నారు. మంచు బిందువు
చల్లగా ఆకు కొస నుంచి జారటాన్నివినటం ఎలాంటి అనుభూతి..! ఇంత ఉత్సాహాన్ని అనుభవించ గలిగితే,
చక్కని మాటల పందిళ్ళేయచ్చు. శ్రీశ్రీ గురించి కొత్తగా చెప్పే పనే లేదు. ఆయన ఒక
బాధని వర్ణించే తీరు ఎలా వుందో చూడండి. ఈ పాటకూడా వినేవుంటారు.
కూటి కోసం, కూలి కోసం
పట్టణంలో బతుకుదామని
తల్లి మాటలు చెవిని పెట్టక
బయలుదేరిన బాటసారికి
ఎంత కష్టం!
మబ్బుపట్టి గాలికొట్టీ
వానవస్తే, వరదవస్తే
చిమ్మచీకటి కమ్ముకొస్తే..
ఈ మాటలు పేర్చటంతోనే ఆ యువకుడి
పరిస్థితి మన కళ్ళముందు కదులుతుంది. వానలో, ఆకలితో, తల్లివేదనతో మనమూ తడుస్తాం. మాటలిలా
పేర్చగలగాలి. ఈసారి చక్కని పోయిట్రీ గురించి ఆలోచించండి. రాయటం అలవాటైతే కబుర్లు
వస్తాయి. కబుర్లు చెప్పాలనివుంటే, ముందుగా మాటలు పేర్చండి. మనం రాసే విషయాలు, మాట్లాడే మాటలు ఎంత ఆచితూచి ఉపయోగించాలో చూడండి. ఓ వార్త చదివాను. ఏం
రాశారంటే... 'సభ్య సమాజం సిగ్గుపడేలా పోలీస్
ఉద్యోగం చేస్తూ, భార్యను హింసిస్తున్న... . ఈ మాటలో ఎంత గందరగోళం వుంది...? పోలీస్ ఉద్యోగం చేస్తే సభ్య సమాజం సిగ్గుపడుతుందా అనిపిస్తుంది.
అసలు విషయం ఏమిటంటే.. బాధ్యతగల పోలీస్ వృత్తిలోవుంటూ సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రవర్తించాడు అని రాయాలికదా. మనం కొన్నిసార్లు
అనాలోచితంగా మాట్లాడితే ఇలాంటి వ్యతిరేక అర్ధాలు వస్తాయి. ఓ చోట 'అటకెక్కిన గిరిజనుల భూమి పంపిణీ' అనివుంది. ఇంతకీ భూమి పంపిణీ అటకెక్కిందా, గిరిజనులు అటకెక్కారా..? భూమి పంపిణీ
అటకెక్కిందీ.. అంటే ప్రస్తుతానికే వాయిదా పడిందీ అనుకోండి. కానీ రాసినతను
అటకెక్కిన గిరిజనులు అన్నాడు. ఇలాంటివి ఎన్నెన్ని తప్పుల తడకలో. మన మాటలూ ఇలాగే వుంటాయి సరిగ్గా
మాట్లాడకపోతే. మన తెలుగు ఎంత అందమైన భాష.
ఎక్కడైనా ఓ కాలేజ్‌కి వెళ్ళి చూడండి. తెలుగే మాట్లాడు తుంటారు. ష కారం లేకుండా
ఉండదు. నీ పేరేమిటి అనడిగితే శైలజ కాస్త షైలజ అంటుంది. ఒకబ్బాయిని అడిగితే షామీ
అన్నాడు. నాకు అర్ధం కాలా. నాలుగుసార్లు విన్నాక అది స్వామి అని అర్ధం అయింది. ఇది
వరకూ ఇంగ్లీష్ కష్టపడి నేర్చుకొనేవాళ్ళు. ఎందుకంటే అది మన భాష కాదు కనుక. ఇప్పుడు
తెలుగు తిన్నగా నేర్చుకో అని చెప్పాల్సి వస్తోంది.
Friday, May 17, 2013
సినిమా కథలు బావుంటాయి. ముఖ్యంగా రాజులు, రాజ్యాలు,విఠలాచార్య కత్తియుద్దాల సినిమాలు టీవీల్లో చూస్తుంటాం. సరదాగా వుంటాయి. అవన్నీ కాల్పనిక కథలు. అందులో ఎక్కడా రీజనింగ్ వుండదు. ఓ పెద్ద దయ్యమో, రాక్షసో కనిపిస్తుంది. దానికి అస్సలు తెలివితేటలే వుండవు. వీపుపైన ఓ దెబ్బకొట్టినా భయపడుతుంది. మనకి నవ్వొస్తుంది. లైఫ్‌లో మనకి అందనివాటిని, మనం చేయలేని సాహసాలను అలా ముట్టుకోగలిగితే, లేని శక్తి మన చేతిలోవుందని వూహిస్తే కలిగే సంతోషం అది. రాజకుమారుడి వేషంలో ఎన్టీఆర్ కత్తియుద్ధంచేసి పాతాళమాంత్రికుణ్ణి ఓడిస్తే ఎంతసరదాగా వుంటుంది! ఒక సామాన్యుడ్ని, మంత్రాలొచ్చిన మాయగాడు తలుచుకొంటే పిల్లినో, బల్లినో చేయడా..? అయినా చేయలేరు. హీరోనే జయిస్తాడు. మనలో వుండే విజేతనవుదామనే కాంక్ష హీరోని గెలిపిస్తేనే వుంటుంది. అంతే కదండీ. వాస్తవం కంటే ఊహ అందంగా వుంటుంది. ఊహలాగా జీవితం ఉంటుందా...? సాఫీగా సాగుతున్న జీవితంలో ఏదో ఒక అలజడి రాకుండా వుండదు. చదువుకి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపారంలో హెచ్చుతగ్గులు కావచ్చు, ఎవరైనా స్నేహితుల నమ్మక ద్రోహం కావచ్చు, స్నేహంలో, బంధుత్వంలో, చివరికి భార్యాభర్తలు, బంధువులకుకూడా అనుకోని సంఘటనలు జరగవచ్చు. ఇలాంటి ఎదురు దెబ్బల్ని మనుష్యులు తేలిగ్గా తీసుకోగలిగితే బావుండు. కానీ అలా జరగదు. సక్సెస్‌ను ఆరాధించినట్లు, జీవితంలోకి ఆహ్వానించినట్లు ఎవ్వరూ ఓటమిని ఒప్పుకోరు. కానీ, గెలుపులాగే ఓటమినికూడా చేతిలోకి తీసుకోవటంలోనే అసలైన సరదా వుందనిపిస్తుంది నాకు. జీవితంలో ఛాలెంజ్ అనేది లేకపోతే ఇంకా థ్రిల్ ఏముంటుంది. కొందరిని చూడండి. కాస్త ఇబ్బంది ఎదురైనాసరే వెంటనే కుంగిపోతారు. స్నేహితులమధ్య, భార్యభర్తలమధ్య విభేధాలు రావటం సహజం. ఎదురు దెబ్బలు మనసుకి గాయం చేస్తాయి. నిజమే. ఆ గాయం మానక పోవచ్చు. అయితే కోలుకొనే దిశగా వెంటనే ప్రయాణం అవ్వాలి. ఎలాంటి ఇరకాటాన్నయినా ఎదుర్కోవాలి. జీవితం మొదటిలోనే ఎన్నెన్నో చేదు అనుభవలు ఎదుర్కొన్న విజేతలు మనకి ఎంతోమంది తెలుసు. రాజకీయాలు, క్రీడలు, కళలు.. ఇలాంటి వాటిల్లో మొదట తిరస్కరించబడి తర్వాత ఎదిగినవాళ్ళ గురించి మనం విన్నాం, చూశాం కూడా. మనిషి హృదయంలో ఓ పోరాడే శక్తి వుంది. దాన్ని వదులుకొంటే నష్టం. రేపటి పైన ఆశ వుండాలి. నేను దర్జాగా బతక గలననే ధైర్యం చాలా అవసరం. ఒక్కోసారి వృత్తిపరమైన ఇబ్బందులు వస్తాయి. కానీ ఓటమి ఒప్పేసుకొని, పరిస్థితుల నుంచి పారిపోవాలని చూస్తేనే ప్రమాదం. ఒక చిన్నచీమను చూడండి. అది ఎంతో కష్టపడి బుల్లి పంచదార పలుకును లాక్కుపోతూ వుంటుంది. ఆ పలుకు బరువు చీమకంటే ఎక్కువే. దాన్ని కష్టపడి కష్టపడి ఈడుస్తూ వుంటుంది. దాని ఆశ చూడండి. ఎలాగోలా ఆ ఆహారం దాచుకోవాలి. పాపం ఎన్నిసార్లు చేతులు నొప్పెడుతుంటే ఆగిపోతుందో. చీమకి అసలు చేతులుంటాయా అని డౌటొచ్చింది. గోడ పైకి ఎక్కి, జారి పడి, మళ్ళీ ప్రయత్నం చేసే చీమను శ్రద్ధగా చూశాను. దానికి చేతులు ఉన్నాయోలేవో కానీ, ఓర్పు మటుకు బోలెడంత వుంది. అది ఎక్కాలని ప్రయత్నం చేస్తుందికానీ, వెను దిరిగి పారిపోవాలని చూడదు. అంత చిన్న చీమలో అంత ఓర్పు, ఓపికవుంటే మనకెంత వుండాలి...? ఒక్కక్షణం ఆలోచించండి. ప్రతిరోజు, ప్రతి ఉదయం మనకోసమే వుందనిపిస్తుంది. ఎలాంటి గాయం అయినా ఒకటి రెండురోజుల్లో తగ్గుముఖం పట్టినప్పుడు, మనసుకి తగిలినగాయం మాత్రం శాశ్వతమా...? అయితే కాస్త సమయం తీసుకొంటుంది. లైఫ్‌లో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి. మనసు దాన్నుంచి మళ్ళించ గలగాలి. ఒక్కోసారి సంగీతంవింటూవుంటే మనసుకెంతో స్వాంతన అనిపిస్తుంది. ఇష్టమైన స్నేహితులను కలుసుకోవటంలో, పుస్తకాలు చదవంటంలో ఎంతో అలసట మాయమై పోతుంది. ఎవరో ఒక కవి వెలిగే దీపాన్ని ఆశతో పోల్చారు. మనిషి మనసులో ఆశ, దీపంలాగా వెలుగుతూ వుండాలని ఆయన భావన. బావుంది కదా. మన మనసులో దీపం మనకి తప్పకుండా వెలుగువైపు చూపిస్తుంది.
Subscribe to:
Posts (Atom)







