Saturday, October 5, 2013

బేట్రాయి సామి దేవుడా..

ఇవ్వాళ  ఈ పాట నచ్చని కుర్రాళ్ళు లేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గొంతులోంచి విన్నారుకనుక. ఏనాడూ సీమ జానపదులు కట్టుకొన్న పాట ఇది. ఇవ్వాళ్టికి దేశాన్ని ఉర్రూతలూగిస్తోంది. అర్దం ఇంకా బావుంది. తెలుసా..

బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ
కాటమ రాయుడా కదిరీ నరసింహుడా
మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతిరా
సేప కడుపు సీరి బుట్టితి
రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితీ
కోటిమన్ను నీళ్ళలోన యెలిసీ యేగమై తిరిగి
బాపనోళ్ళ సదువులెల్ల బ్రహ్మదేవర కిచ్చినోడ

అత్తారింటికి దారేదీ సినిమాలో పవన్ కళ్యాణ్ సంతోషంగా పాడిన పాట అందరూ చూసే వుంటారు కదా. పాట అర్ధంకూడా ఎంతో బావుంది. బేట్రాయి సామి దేవుడా.. పాటలో ఒక్కో చరణం.. దశావతారాల్లో ఒక్కో అవతారాన్ని మాండలిక పదాలలో వినొచ్చు.

చేపగా పుట్టి సోమకాసురుడ్ని చంపి వేదాలను (బాపనోళ్ళ చదువును) తిరిగి బ్రహ్మ (బెమ్మదేవర) దేవుడికి ఇచ్చిన మహావిష్ణువు పొగిడే పాట ఇది.

చేప కడుపు సీరి పుట్టితి
రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టితి (సోమకాసురుడ్ని చంపి)

కోటిమన్ను నీళ్ళలోన యెలిసీ యేగమై తిరిగి
అవసరంకోసం దండిగావున్న నీళ్ళలో తిరిగి తిరిగీ వేదాలను తిరిగి వెనక్కి తీసుకు వచ్చాడని అర్ధం.
బేట్రాయి సామి దేవుడా..

అనంతపురం జిల్లా కదిరిలో నరసింహస్వామి దేవాలయం వుంది. హిరణ్య కశిపుడిని చంపేశాక ఈ  ప్రాంతానికే నరసింహస్వామి వచ్చాడని, అలా ఆగ్రహవేశాలతో వచ్చిన స్వామి, ఇక్కడ అడవిలో క్రూరజంతువులను వేటాడాడని, అందుకే ఆయన్ను వేటరాయుడు అంటారని చెబుతారు. వేటరాయుడు కాస్తా జనవ్యవహారంతో బేట్రాయుడు అయింది. అలాగే ఇదే జిల్లాలోని గొడ్డు వెలగల గ్రామానికి ఎదురుగావుండే గుట్టపైన ఇంకో నరసింహస్వామి వున్నాడు. ఆయన్ను కాటేమిరాయుడు అంటారు. అంటే కాడ అంటే అడవి, అడవిలో వుండే దేవుడు కనుక  ఆ పేరు వచ్చి వుంటుంది. కదిరి, గొడ్డు వెలగల నరసింహులిద్దరినీ కలిపి కట్టిన పాట..

బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ
కాటేమి రాయుడా కదిరీ నరసిమ్ముడా..


ఇలా మంచి మంచి జానపద గీతాలన్నీ పవన్ కళ్యాణ్ పాడేస్తే..  థాంక్స్ టు పవన్ కళ్యాణ్. నీ వల్లనే పాట ఇంత మంది నోళ్ళలో నానుతోంది.

4 వ్యాఖ్యలు:

Unknown said...

నేను ఈ సినిమా చూసినప్పుడు మ్యూజిక్ పరంగా, పాట పాడిన విధానాన్ని బట్టి ఈ పాట బాగా నచ్చింది,కానీ అసలు అర్దం తెలియదు.సుజాత గారు, ఈ పాట అర్దాన్ని తెలిపినందుకు ధన్యవాధాలు.

సురేష్ బాబు said...

జానపద గీతాలు ఇలా పేరున్న వారి నోట పడితే మిగతా జనాల నోటిలో కూడా నానుతాయి. ఆంగ్ల వ్యామోహంలో కొట్టుకుపోతున్న జాతికి తెలుగును మరిచిపోకుండా సినిమా హీరోలు చేయగల్గిన సహాయం ఇదే.

Anonymous said...

మీ పోస్ట్ ని fb ద్వారా ఎవరో షేర్ చేస్తే చూసాను, చాలా బాగా వివరించారు కృతజ్ఞతలు

suresh venkat said...

చిత్తూరు నాగయ్య గారి గొంతులో వింటే స్పష్టంగా అర్థమౌతుంది. చాలా ప్రశాంతంగా వుంటుంది.