Thursday, March 31, 2016

మెగాస్టార్.. మీకు కంగ్రాట్స్ సార్..

చాలా రోజుల తర్వాత ఒక అందమైన దృశ్యం చూశాను.  హీరో చిరంజీవి కూతురు శ్రీజ పెళ్ళి సందర్భంగా వాళ్ళ ఇంట్లో వున్న హీరోలందరూ హుషారుగా ఆనందంగా ఆ పెళ్ళిని సె'లబ్రేట్ చేసుకుంటున్న దృశ్యం. ఆ పార్టీలో సినిమాల్లోని తన పాటలకు తనే డాన్స్ చేశాడు మెగాస్టార్. టీవీల్లో కోట్లమంది ఆ విజువల్స్ చూసి తరించారు. శ్రీజకి అది రెండో పెళ్ళి. ఎవరేమనుకొన్నా, ప్రజల్లో తమపట్ల వుండే క్రేజ్, గ్లామర్ పోతే పోయినా, ఎవరేం అనుకున్మా.. మా పిల్ల జీవితం బావుంటే చాలు, మా బిడ్డ ఎలాంటి పొరపాట్లు చేసినా, మా గుండెల్లో పెట్టుకుంటాం, వాళ్ళు సుఖంగా సంతోషంగా వుండేలా తల్లిదండ్రులుగా మేం చేయగలిగినంతా చేస్తామని ప్రపంచానికి తేల్చి చెప్పారు వాళ్ళు. సినిమా యాక్టర్లు అందంగా వుంటే.. స్టెప్స్ వేస్తే.. డ్యూయెట్స్ పాడితే ఆనందించి, ఫ్యాన్స్ అయిపోయే వాళ్ళు ఇలాంటివి ఆదర్శంగా తీసుకొంటారా..? తమ ఇంట్లో ఓ ఆడపిల్లకు ఏదైనా సమస్య వస్తే, చుట్టూ జనం కాలువలో దూకిచావనీ.. మాకేం మా పిల్ల మాకెక్కువ, దాన్ని మేం కాపాడి రక్షించు కుంటాం అని ప్రతి తల్లితండ్రీ ఎందుకు అనుకోరు. ప్రేమించినవాడు కాదంటే సాప్ట్ వేర్ ఇంజనీర్ రీనా ఈ మధ్యే ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయికి, నా కోసం చేతులు జాపే తల్లిదండ్రులు ఉన్నారనే నమ్మకం కన్న వాళ్ళు ఎందుకు ఇవ్వలేక పోయారు...? పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి..? పెళ్ళి చేసుకుని, ఎలాంటి భయం సంకోచం లేకుండా భార్యల గొంతు నులిమే భర్తలు ఇవ్వాళ్టికీ పూటకోకడు ఎందుకు కనిపిస్తున్నారు...?  కన్నవాళ్ళు, పిల్లల వెనక్కాల కొండంత అండగా ఎందుకు కనబడరు..? తనుపెట్టిన గుడ్లు తామే తినేసే పాముల్లాగా ఎందుకున్నారు...? ఫ్యాషన్ డిజైనర్ ఒక డ్రెస్ కుట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు కుట్టబోయే క్లాత్ కొలతలు తీసుకుని శ్రద్ధగా గీత గీసి పర్ ఫెక్ట్ గా అనుకున్న రూపం పోసినట్లు జీవితం మన చేతులలోనే వుంది. దాన్ని కరక్ట్ గా తీర్చిదిద్దు కోవచ్చు.  కుటుంబాల్లో కష్టనష్టాలొస్తాయి,  నిలబడమా..? బిడ్డ పుట్టిన క్షణం చేతుల్లోకి తీసుకుంటే అమాయకంగా వళ్ళు విరిచి నిశ్చింతగా మన చేతుల్లో నిద్రపోతున్న బిడ్డ, పెరిగి పెద్దయితే మాత్రం ఆ కాస్త నమ్మకం మనం ఇవ్వ లేమా..? ఎలాగైనా శ్రీజ విషయంలో మాత్రం నువు మెగాస్టార్..  హీరో నంబర్ వన్ వే.. చిరంజీవి సార్.. కంగ్రాట్స్.